Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు.. | Miss world 2025: 72nd edition of the Miss World in May 10 At Gachibowli | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే ‍ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ​ పోటీలు..!

May 9 2025 9:09 AM | Updated on May 9 2025 9:09 AM

Miss world 2025:  72nd edition of the Miss World in May 10 At Gachibowli

ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్‌ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు.                

ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్‌ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్‌ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్‌ వరల్డ్‌ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్‌ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. 

ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్‌ టాప్‌ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం.  

దేశవ్యాప్తంగా డిజిటల్‌ వెల్‌కమ్‌.. 
పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్‌ వేదికగా గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. 

ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ వెల్‌కమ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్‌ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు.  

(చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')

Advertisement
 
Advertisement
Advertisement