మిస్‌ వరల్డ్‌ 2025 : అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు' | Miss World 2025 May 15 contestants visit Handloom Village fo Pochampally | Sakshi
Sakshi News home page

Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు'

May 9 2025 8:47 AM | Updated on May 9 2025 8:53 AM

Miss World 2025 May 15 contestants visit Handloom Village fo Pochampally

ఆ రంగులు, పువ్వులు, పక్షులు, జంతువుల జ్యామెట్రీ నమూనా డిజైన్లు నేత శైలి చూడగానే పోచంపల్లి ప్రత్యేకత ఇట్టే తెలిసిపోతుంది. మన దేశీయ సాంస్కృతిక, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. మిస్‌ వరల్డ్‌ 2025 కాంటెస్ట్‌ ఈవెంట్‌లో భాగంగా ఈ నెల 15న ఒక బృందం ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామమైన పోచంపల్లి(Pochampally )ని సందర్శించనుంది. దీంతో దేశంలో అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇకత్‌ ఫ్యాషన్‌ మరోమారు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. 

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని సంక్లిష్టమైన ఇకత్‌ నేత పద్ధతులు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. యునెస్కో ‘ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామం’గా పోచంపల్లి ప్రశంసలు అందుకుంది. చేతిపనులు, సంస్కృతి, వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఈ చేనేతలో అబ్బురపరిచే డైయింగ్‌ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్‌లో సంప్రదాయ చిలుక, ఏనుగు, వజ్రం, పూల మోటిఫ్‌లతోపాటు ఇప్పుడు వందల రకాల డిజైన్లు సృష్టిస్తున్నారు వీవర్స్‌. 

హుందాతనాన్ని చాటేలా! 
పోచంపల్లి ఇకత్‌ కాటన్‌తో ఎన్నో మోడల్స్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుర్తా పైజామాలు, లాంగ్‌ అండ్‌ షార్ట్‌ జాకెట్స్, ఫ్రాక్స్, జంప్‌సూట్స్, లెహంగాలు.. ఇండో–వెస్ట్రన్‌ డిజైన్స్‌ ఆధునికతను చాటుతున్నాయి. సౌకర్యంతోపాటు క్యాజువల్, అఫిషియల్‌ అండ్‌ పార్టీవేర్‌గానూ హుందాతనాన్ని చూపుతున్నాయి.

పట్టు ప్రత్యేకత 
బ్రైట్‌ కలర్స్, సంప్రదాయ డిజైన్లు, జరీ మెరుపులు చూపు తిప్పుకోనివ్వవు. కాంట్రాస్ట్‌ కలర్‌ ప్లెయిన్‌ బ్లౌజ్‌లు, క్రాప్‌టాప్స్‌తో ఈ చీరలను జత చేసి మరిన్ని స్టైల్స్‌ తీసుకువస్తున్నారు. ఇతర అలంకారాలుచీర కట్టు, టెంపుల్‌ జ్యువెలరీతో సంప్రదాయ శైలిని తీసుకువస్తే ఫ్యాబ్రిక్‌ లేదా సిల్వర్‌ జ్యువెలరీతో వెస్ట్రన్‌ స్టైల్‌ని మెరిపించవచ్చు. ఏ జ్యువెలరీ, కేశాలంకరణ స్టైల్స్‌ లేక΄ోయినా ఫ్యాబ్రిక్‌నే అలంకారంగా ధరించవచ్చు. 

దేశభక్తి చాటేలా! 
పోచంపల్లి, ఇకత్‌లో యువతను ఆకట్టుకునేలా నేస్తున్న డిజైన్స్‌ గురించి స్టేట్‌ అవార్డ్‌ గ్రహీత వీవర్‌ బోగ సరస్వతి మాటల్లో..   

‘‘నేను పాతికేళ్లుగా, మావారు బోగ బాలయ్య యాభై ఏళ్లుగా ఈ చేనేత వస్త్రాలను నేస్తున్నాం. కొత్త కొత్త డిజైన్స్‌ను తయారు చేస్తున్నాం. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని, వారి ఆధునిక వస్త్రాలకు తగినట్టుగా, హుందాగా ఉండే డిజైన్స్‌ రూపకల్పనలో కృషి చేస్తున్నాం. ఇటీవల ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తి చాటేలా ఇండియా మ్యాప్‌ మధ్యన చరఖా రాట్నం వచ్చేలా స్కార్ఫ్‌ నేశాం. 

ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించాం. 2023 డిసెంబర్‌లో డబుల్‌ ఇకత్‌లో చరకా వచ్చేలా స్కార్ఫ్‌ డిజైన్‌ చేసి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కానుకగా ఇచ్చాం. 121 కలర్స్‌లో 121 మోటిఫ్స్‌తో చీర తయారుచేశాం. 2021లో 100 అడ్డు చిటికీలు 100 నిలువు చిటికీలు రూపొందించి 100*100 అంటే 10,000 షేడ్‌ వచ్చేలా చీరలు రూపొందించాం. ఆ కృషికి గుర్తింపుగా స్టేట్‌ అవార్డు వరించింది. బెస్ట్‌ వీవర్‌ అప్రిసియేషన్, బెస్ట్‌ వీవర్‌ అవార్డ్‌ సర్టిఫికెట్‌ లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా బెస్ట్‌ వీవర్‌గా ప్రశంసలు అందుకున్నాను. 

కొంగొత్త డిజైన్లు
మా కృషి, దృష్టి అంతా అనుకున్న డిజైన్లు, డైయింగ్, టైయింగ్, మోటిఫ్స్, షేడ్స్, వీవింVŠ  పైన  ఉంటుంది. నచ్చిన డిజైన్లకు ఎక్కువ మొత్తంలో కోరితే డిమాండ్‌ను బట్టి బయట ఆర్డర్‌ ఇస్తాం. సంప్రదాయ ఏనుగులు, పక్షులు మాత్రమే కాకుండా మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి డిజైన్‌ చేస్తున్నాం. రాజకీయ నాయకులు, ప్రముఖులు మా వద్ద నుంచి చీరలు తీసుకెళతారు. బాలీవుడ్‌ నటి జయాబచ్చన్, ఇన్ఫోసిస్‌ సుధామూర్తికి కూడా మా చీరలు వెళ్లాయి. పదివేల షేడ్స్‌తో తయారుచేసిన ఇకత్‌ స్పార్ఫ్‌కు మంచి గుర్తింపు లభించింది. జాతీయస్థాయి మా డిజైన్స్‌ గుర్తింపు సాధించాలని కృషి చేస్తున్నాం.
– బోగ సరస్వతి, పోచంపల్లి ఇకత్‌ వీవింగ్‌ డిజైనర్‌

 

(చదవండి: Miss World 2025: ఆ దేశాలు డుమ్మా..! ఆఖరి నిమిషంలో..)

Advertisement
 
Advertisement
Advertisement