ఆ ఊళ్లో దెయ్యం భయం... రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు!

Mexico: People Afraid Of Ghosts Haunted Place - Sakshi

కొన్నేళ్ల కిందట తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ‘ఓ స్త్రీ రేపు రా’ అనే రాతలు ఇళ్ల గోడల మీద కనిపించేవి. స్త్రీ రూపంలో ఒక దెయ్యం హడలెత్తిస్తోందనే ప్రచారం కారణంగా, ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల గోడల మీద అలా రాసేవారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో ఎలాంటి దెయ్యం భయాలూ లేవు, అలాంటి రాతలూ లేవు. అయితే, కొద్దిరోజుల కిందట మెక్సికోలోని కోకోయోక్‌ పట్టణంలో దెయ్యం తిరుగుతోందనే ప్రచారం మొదలైంది.

రాత్రి పదిగంటల తర్వాత ఆ దెయ్యం వీథుల్లో తిరుగుతోందని కథలు కథలుగా ప్రచారం సాగడంతో ఆ ఊళ్లోని జనాలు రాత్రి పదిగంటల తర్వాత బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కోకోయోక్‌ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ‘నహువా’ తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది.

మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఊళ్లో తిరిగే దెయ్యం ఇంట్లో చొరబడకుండా ఉండటానికి ఊళ్లోని ప్రతి ఇంటికీ వీధి తలుపులపై శిలువ గుర్తులు వేయించుకున్నారు. అయినా సరే భయం తీరక రాత్రివేళల్లో పదిగంటలకు లోపే ఇళ్లకు చేరుకుని, తలుపులు బిడాయించేసుకుంటున్నారు. 
చదవండి: వీడియో: సూపర్‌ టైపూన్‌ హిన్నమ్నోర్‌.. గంటకు 314 కిలోమీటర్ల ప్రచండ గాలులు.. చిగురుటాకులా వణుకు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top