
మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహించిన నగరవాసి
పోర్టు సెక్టార్‌లోనే అరుదైన రికార్డు సొంతం
79 మీటర్ల జాతీయ పతాకాలు ఆవిష్కరణ
ఆయనో పోర్ట్ అధికారి.. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించాలనుకున్నాడు.. దీనిని సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ మిషన్ అని కూడా అంటారు.. ఇందులో తొలి మిషన్‌గా మౌంట్ ఎల్బ్రూస్ అధిరోహణను పరిగణిస్తారు.. ఈ నెల 7న ముంబై నుంచి ఈ సాహస యాత్రకు బయలుదేరాడు. ఆయనే నగరానికి చెందిన ప్రణయ్. దాదాపు పదేళ్లుగా ముంబై పోర్ట్ అథారిటీలో సీనియర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ 79 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు పోర్టు జెండాను అధికారికంగా ప్రణయ్‌కు అందించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ముంబై పోర్టులో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హైదరాబాదీ బి.ప్రణయ్ రెడ్డి పోర్టు సెక్టార్‌లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రష్యాలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించి ఆ సెక్టార్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. రష్యన్ కాలమానం ప్రకారం ఈ నెల 16 ఉదయం 5.50 గంటలకు శిఖరాగ్రానికి (5,642 మీటర్లు) చేరుకున్న ఆయన 79వ స్వాతంత్ర దినోత్సవానికి గుర్తుగా తన బృందంతో కలిసి 79 మీటర్ల జాతీయ జెండాలను ఎగరేశారు. దీంతో పాటు దీన్‌దయాళ్ పోర్టు అథారిటీ జెండాను అక్కడ ఎగరేశారు. ఈ మేరకు ప్రణయ్ రెడ్డికి రష్యా ప్రభుత్వం గునిసెస్ ప్రపంచ రికార్డుకు అవసరమైన సర్టిఫికెట్ జారీ చేసింది.
వారి సహకారం కీలకం..
‘దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ అథారిటీలతో పాటు నా తల్లిదండ్రులు బి.కృష్ణారెడ్డి, బి.నాగమణి, నా భార్య బి.అపర్ణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. వారందరి సహకారం లేకుంటే ఈ విజయం సాధించలేకపోయే వాడిని.’ రష్యా– జార్జియా సరిహద్దు సమీపంలో కాకసస్ పర్వతాల్లోని ఎ్రల్బస్ సముద్ర మట్టానికి 18,510 అడుగుల (5,642 మీటర్లు) ఎత్తులో ఉంటుంది. ఇది రష్యాలోనే కాదు.. యూరప్‌లోనే ఎత్తైన అగ్నిపర్వతం. – ప్రణయ్ రెడ్డి∙