
తల్లిపాల దాత
నవజాత శిశువులకు తల్లిపాలు అమృతం’ అనే మాటను చాలాసార్లు విని ఉంటాం. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల వల్ల అందరు శిశువులు ఆ అదృష్టానికి నోచుకోవడం లేదు. నెలలు నిండని పిల్లలు, తక్కువ బరువుతో పుట్టే నవజాత శిశువులకు తల్లిపాలు దొరకడం గగనమైంది. ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది అనంతపురం నగరానికి చెందిన దర్శి లిఖిత. తాను పడిన ఇబ్బంది ఇతరులు పడకూడదని భావించిన లిఖిత పేదింటి శిశువులకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగూరులో ఎలక్ట్రికల్ మేనేజర్‌గా పని చేస్తోంది లిఖిత. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు బాబు పుట్టాడు. ‘మొదటి రెండు వారాల పాటు నాకుపాలు తక్కువగా వచ్చేవి. నాపాలతో పాటు డబ్బాపాలు బాబుకు పట్టేవాళ్లం. బాబు కడుపు నిండా తాగేవాడుపాలు తక్కువైన ప్పుడల్లా ఏడ్చేవాడు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న డబ్బాపాలు పట్టేదాన్ని. అయితే డబ్బాపాలు తాగించేటప్పుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు, కొందరు వైద్యులు చెప్పిన సూచనలను, సలహాలను పాటించిన తర్వాత అదృష్టవశాత్తూ నాకు పాలు బాగా పడ్డాయి. నా బిడ్డ బొజ నింపుకున్న తర్వాత కూడా ఇంకా మిగిలేవి. వాటిని తల్లిపాలు దొరకని చిన్నారుల కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. విదేశాల్లో, బెంగళూరులాంటి ప్రాంతాల్లో మిల్క్ బ్యాంకుల గురించి విన్నాను. అనంతపురంలోనూ మదర్ మిల్క్ బ్యాంకు ఉందని అక్క శ్రీలేఖ (గైనకాలజిస్టు) చెప్పారు. నేను పడ్డ ఇబ్బంది ఇతరుల పిల్లలు, తల్లులూ పడకూడదని, అలాంటి వారికి తల్లిపాలు అందజేయాలని నిర్ణయించు కున్నాను’ అంటుంది లిఖిత.
చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
లిఖిత తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. ప్రోత్సహించారు. పాలను స్టోరేజ్ చేయడానికి ఆన్‌లైన్‌లో ΄్యాకెట్స్ కొనుగోలు చేస్తుంది లిఖిత. వాటిలో నుంచి తన బిడ్డకు సరిపడాపాలు ఇస్తూనే మిగిలిన పాలను రోజూ 200 మి.లీ. వరకు సేకరించి డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేస్తుంది. అలా నెల రోజుల పాటు సేకరించిన మొత్తం తొమ్మిది లీటర్ల పాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అందిస్తోంది.‘చనుబాల దానం కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను. తల్లిపాల ప్రాముఖ్యత, దానిలోని ΄ోషకాలు, రోగనిరోధక శక్తి గురించి ప్రచారం చేస్తాను’ అంటుంది లిఖిత
– ఆర్‌డీవీ బాలకృష్ణారావు, సాక్షి, అనంతపురం
ఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
లిఖిత బాటలో
అనంతపురం జిల్లాలో ఎంతోమంది పేదతల్లులు గర్భం సమయంలో రకరకాల కారణాల వల్ల సౌష్టికాహారం తీసుకోకపోవడంతో నెలలు నిండక, బిడ్డ ఎదుగుదల సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పసికందులు పాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారి కోసం మదర్ మిల్క్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. లిఖిత ముందుచూపుతో తొమ్మిది లీటర్ల పాలు అందజేయడం సంతోషంగా అనిపించింది. వృత్తిరీత్యా బిజీగా ఉండే లిఖిత పేద పిల్లల గురించి ఆలోచించడం అభినందనీయం. ఇంకా ఎంతోమంది తల్లులు ముందుకువచ్చి పాలు ఇవ్వాలి. లిఖితను స్ఫూర్తిగా తీసుకోవాలి.– డాక్టర్ హేమలత, డిప్యూటీ ఆర్‌ఎంఓ