డాక్టరవ్వాలని... ఓ కూరగాయలమ్మాయి ఎదురుచూపులు

Medical student turns vegetable vendor in Hyderabad as Covid disrupts family finances - Sakshi

‘ఒక పేదింటి బిడ్డ డబ్బు లేని కారణంగా చదువుకు దూరం కాకూడదు’ అనే స్ఫూర్తి ఏమైంది? ఒక విద్యా కుసుమం ఎందుకు వాడిపోవడానికి సిద్ధంగా ఉంది? ఎవరైనా వచ్చి పాదులో నీళ్లు పోస్తే సంపూర్ణంగా వికసించాలనే ఆశతో ఎదురు చూస్తోంది. డాక్టర్‌ అయి తీరాలనే కోరిక ఆ అమ్మాయి చేత ఓ సాహసం చేయించింది. తొలి అడుగు వేయగలిగింది. కానీ విధి పరీక్షల్లో తర్వాతి అడుగులు తడబడుతున్నాయి. ఇంత పెద్ద సమాజంలో పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రాకపోతారా అని బేలగా చూస్తోంది హైదరాబాద్, మోతీనగర్‌లోని అనూష.

‘‘నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ అవాలనే కోరిక ఉండేది. స్కూల్‌డేస్‌ నుంచి అదే కలతో చదివాను. మెడికల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో 945వ ర్యాంకు వచ్చింది. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ పాయింట్‌లు ఉంటే ఫ్రీ సీటు వచ్చేది. మా పేరెంట్స్‌ ఇద్దరూ ఏమీ చదువుకోలేదు. నాకు చిన్నప్పుడు ఇలాంటివి చెప్పేవాళ్లెవరూ లేరు. ఏ రిజర్వేషనూ లేదు. ఓపెన్‌లో సీట్‌ తీసుకుంటే గవర్నమెంట్‌ కాలేజీల్లో కూడా ఏడాదికి ఏడు లక్షలుంది. ప్రైవేట్‌లో అయితే కోటిదాకా ఉంది. కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో కోర్సు పూర్తవుతుందని ఫ్రెండ్స్‌ ద్వారా తెలిసింది. మా ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కూడా జరిగే పని కాదు. అయితే మెరిట్‌ స్టూడెంట్‌ని కాబట్టి స్కాలర్‌షిప్‌లు వస్తాయని, మిగిలిన డబ్బు బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోవచ్చనుకున్నాను. స్కాలర్‌షిప్‌ కోసం ఎన్ని అప్లికేషన్‌లు పెట్టానో లెక్కేలేదు. ‘ఈపాస్‌’ లో అయితే ఇరవై సార్లు అప్లయ్‌ చేశాను.

బ్యాంకులోన్‌ కూడా రాలేదు
విద్యాలక్ష్మి పథకానికి అప్లయ్‌ చేసిన తర్వాత బ్యాంకు నుంచి ఫోన్‌  వచ్చింది. కానీ ష్యూరిటీ లేకుండా లోన్‌ ఇవ్వడం కుదరదన్నారు. కూరగాయల బండిని ష్యూరిటీగా పెట్టుకోలేం. నీ సర్టిఫికేట్‌లన్నీ బాగున్నాయి. గవర్నమెంట్‌ ఇచ్చిన ఇల్లు ఉన్నా... ఆ ఇంటి మీద లోన్‌ ఇస్తామన్నారు. కానీ మాకు ఇల్లు లేదు. నాకు చదువుకోవడానికి సహాయం చేయమని ఎంతమంది కాళ్లమీదనో పడ్డాను.

అందరమూ పని చేస్తున్నాం
మా నాన్న వాచ్‌మన్, అమ్మ స్వీపర్‌గా కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తోంది. నెలకు తొమ్మిది వేలు వస్తాయి. ఆమె ఉదయం నాలుగు గంటలకు లేచి మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెచ్చి, ఆరు గంటలకు తన డ్యూటీకి వెళ్తుంది. మధ్యాహ్నం తర్వాత కూరగాయలమ్మేది. ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతున్నాను. తమ్ముడు డిగ్రీ చదువుతూ ఖాళీ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసి కూడబెట్టుకున్న డబ్బును అనారోగ్యం హరించి వేసింది.

ఇక ఇప్పుడు మూడవ సంవత్సరం చదువుకు వెళ్లాలి. రెండవ సంవత్సరం ఫీజు, ఈ ఏడాది ఫీజు కలిపి పది లక్షలు కట్టాలి. నేను కాలేజ్‌లో అడుగుపెట్టగలిగేది ఆ డబ్బు చేతిలో ఉంటేనే’’ అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అనూష. ఆమె మాటల్లో అన్ని దారులూ మూసుకుపోయాయనే దిగులుతోపాటు ఏదో ఒక దారి కనిపించకపోతుందా అనే చిరు ఆశ కూడా కనిపించింది. ఆమె ఆశ, ఆశయం నెరవేరుతాయని భావిద్దాం.

విధి కూడా ఆడుకుంటోంది
ఎలాగైనా డాక్టర్‌నవ్వాలనే ఆశతోనే కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో చేరాను. కిర్గిస్తాన్‌ వెళ్లడానికి చెవి కమ్మలతో సహా ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేశాం. చిట్టీల డబ్బులు... అంతా కలిపితే మూడు లక్షలు జమయ్యాయి. మొదటి ఏడాది ఫీజు ఆరులక్షల్లో సగం ఫీజు కట్టాను. రెండవ ఏడాదిలో ఉండగా మరో మూడు లక్షలు కట్టాను. రెండవ ఏడాది ఫీజు కట్టాల్సిన సమయంలో అమ్మకు యాక్సిడెంట్‌ అయింది. ఫీజు కోసం సమకూర్చుకున్న డబ్బు వైద్యానికి అయిపోయింది. కాలేజ్‌ ప్రొఫెసర్‌లు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఫీజు కట్టకనే పరీక్షలు రాయగలిగాను. ఇంతలో కరోనా రూపంలో మరో ఉత్పాతం వచ్చి పడింది. కాలేజ్‌ యాజమాన్యం స్టూడెంట్స్‌ అందరినీ వారి దేశాలకు పంపించి వేసింది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్‌ వచ్చింది. నా వైద్యం కోసం మళ్లీ అప్పులు. ఐదు లక్షలు ఖర్చయ్యాయి.

– వాకా మంజులారెడ్డి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top