మన్‌కీ బాత్‌లో మోదీ మెచ్చుకుంది ఈయననే!

Mann ki baat: Modi Talks About Sandeep Kumar From Haryana  - Sakshi

ఎంత పంచితే అంత పెరిగేది జ్ఞానం. ఆ విజ్ఞానకాంతులను నలుదిశలా పరుచుకోవాలని తపిస్తున్న వ్యక్తి పేరు సందీప్‌ కుమార్‌ బద్‌స్రా. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌ కి బాత్‌ ప్రసంగంలో సమాజంలో విద్య, జ్ఞానం వ్యాప్తిని ప్రోత్సహించే వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు చండీగడ్‌ వాసి సందీప్‌ కుమార్‌ చేస్తున్న మంచి పని గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో 28 ఏళ్ల సందీప్‌ పేదల పిల్లలకు పుస్తకాల పంపిణీ, సేకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు 8 వేల మందికి పైగా నిరుపేద విద్యార్థులకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తన పేరును ప్రధాని ప్రస్తావించడంపై ఉద్వేగభరితుడయ్యాడు. 

సందీప్‌ మాట్లాడుతూ ‘నేను ఈ రోజు బాపు ధామ్‌ వద్ద పుస్తకాల పంపిణీలో బిజీగా ఉన్నాను. అందుకే నేను ఉదయం మన్‌ కి బాత్‌ కార్యక్రమం వినలేదు. నా పనిని ప్రస్తావించడం గురించి, దేశ ప్రధానమంత్రి మెచ్చుకున్నప్పుడు నేను సరైన దిశలో వెళుతున్నానని మరింతగా స్పష్టమైంది. విద్య సమాజాన్ని మార్చగలిగే మాధ్యమం అని ఎప్పుడూ నమ్ముతాను. ప్రధాని ప్రస్తావించడం అంటే సమాజం కోసం మరింత మేలు చేయటానికి ప్రోత్సాహానిస్తుంది’ అన్నాడు. 

ఇంటింటికీ తిరిగి సేకరణ
హర్యానాలోని భివానీ జిల్లాలోని ధని మహు గ్రామానికి చెందిన సందీప్‌ చండీగడ్‌లోని శ్రీ గురు గోవింద్‌ సింగ్‌ ఖల్సా కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేశాడు. 2016 లో భివానీ జిల్లాలోని దాదామ్‌ గ్రామంలో తన ఆరు నెలల జెబిటి శిక్షణ సమయంలోనే పేద పిల్లలకు పుస్తకాలు అందించి, వారిని ప్రోత్సహించాలనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత పుస్తకాలు కొనడం, స్టేషనరీ వస్తువులను సేకరించడం వాటిని రీసైక్లింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. 2017 లో సందీప్‌ ‘ఓపెన్‌ ఐ ఫౌండేష ’ను ప్రారంభించాడు. ఈ మూడేళ్లలో అతను ట్రిసిటీలోని మురికివాడల పిల్లలకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. ‘నా జెబిటి శిక్షణ సమయంలో, దాదామ్‌ గ్రామంలోని పాఠశాల పిల్లలు పుస్తకాలు, నోటుబుక్స్‌ లేకపోవడంతో స్కూల్‌కి వచ్చేవారు కాదు.

వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాను. మా ఇంట్లోవాళ్లకు ఆలోచన గురించి చెప్పినప్పుడు మొదట్లో ఇష్టపడలేదు. ముందు ఏదైనా ఉద్యోగం చేయమన్నారు. దీంతో నేను ఇంటిని విడిచిపెట్టి, కొంత డబ్బు సంపాదించడానికి పెళ్లిళ్ళలో వెయిటర్‌గా పని చేశాను. సెక్టార్‌ 11 లోని పిజిజిసిలో మొదటి పుస్తక విరాళ శిబిరాన్ని నిర్వహించాను. నా నిబద్ధతను చూసి, మా అన్న అతని భార్యతో సహా నా కుటుంబం కూడా పుస్తకాల కోసం రూ.35,000 ఇచ్చి తమ చేయూతను అందించారు. అప్పటి నుండి, పేదలకు పుస్తకాలు, చదువును అందించడం గురించే ఆలోచించాను. ప్రజల నుండి పుస్తకాలను సేకరించడానికి నేను సెకండ్‌ హ్యాండ్‌ స్కూటర్‌ను నడుపుతున్నాను. నా గదిలో ఎక్కువ స్థలం లేనందున కొన్నిసార్లు నా స్నేహితుల ఇళ్ళ వద్ద పుస్తకాలను ఉంచాల్సి వచ్చేది’ అని తెలిపారు సందీప్‌. 

మిత్రుల సాయం
రెండేళ్ళలో నాయగావ్‌ వద్ద ఒక చిన్న ఆఫీసు తెరిచాడు సందీప్‌. తరువాత 690 చదరపు అడుగుల çస్థలంలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ కన్సల్టెన్సీతో పాటు టిఫిన్‌ వ్యాపారాన్ని నడపడం మొదలుపెట్టాడు. అతని ఆదాయంలో 60 శాతం ఎన్జీఓ కోసం ఖర్చు చేస్తాడు. లాక్డౌన్‌ సమయంలో ఈ ఎన్జీవో 40 మంది మురికివాడల పిల్లలకు పుస్తకాలు అందజేసింది. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 ఆడియో పుస్తకాలను రికార్డ్‌ చేసింది. ‘నేను చేసినదంతా సమాజ హితం కోసమే. తమ వంతు పాత్ర పోషించాలనుకునే మిత్రుల సాయంతో ఇదంతా జరిగింది. కిందటేడాది చిన్నలైబ్రరీని ఏర్పాటుకు వ్యాన్‌ తీసుకున్నాను. లాక్డౌన్‌ సమయంలో చాలా మంది నగరవాసులు, వాలంటీర్లు దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 కి పైగా ఆడియో పుస్తకాలను రికార్డ్‌ చేయడంలో సహాయపడ్డారు’ అని ఆనందంగా తెలిపాడు సందీప్‌.

గొప్ప అవకాశం
విద్యార్థులు తమ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, చదవుకోవడానికి పుస్తకాలు ఇవ్వడమనేది తనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం అని చెబుతాడు సందీప్‌. ‘మా తాత సుబేదార్‌ కన్హయ్య కుమార్‌ నుండి నేను ప్రేరణ పొందాను. అతను 1950 లలో మా స్థానిక గ్రామంలో తన భూమిని అమ్మి అక్కడ ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఈ పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మార్చారు. అక్కడి విద్యార్థులు స్వీట్స్‌తో మా ఇంటికి వచ్చి, వచ్చే ఏడాదికి కూడా పుస్తకాలు అవసరమని నాకు చెప్పినప్పుడు వారికి సాయం చేసే అవకాశం ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది’ అని వివరించాడు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top