Komal Pandey: మిడిల్‌ క్లాస్‌ నుంచి ఫ్యాషన్‌  స్టార్‌గా..

Komal Pandey: Indian Fashion Blogger, YouTuber, Fashion Stylist Success Story in Telugu - Sakshi

కోమల్‌ పాండే ఫ్యాషన్‌ కథ

సోషల్‌ మీడియా వేదికగా నేటి యువతరం తమలోని ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ సోషల్‌ స్టార్‌లుగా ఎదుగుతూ.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటారు. కానీ, ఇండియన్‌ యూట్యూబర్, ఫ్యాషన్‌ బ్లాగర్, మోడల్, స్టైలిస్ట్, కంటెంట్‌ క్రియేటర్‌ ఫ్యాషన్‌  క్వీన్, ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ‘కోమల్‌ పాండే’ ఆరేళ్లుగా సోషల్‌ స్టార్‌గా నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఫ్యాషనబుల్‌గా ఎలా ఉండాలో వివరిస్తూ... రీయూజబుల్‌ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ డిజిటల్‌ వరల్డ్‌ను ఉర్రూతలూగిస్తోంది. 

ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్‌ పాండే 1994లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది.  బి.కామ్‌ చేసిన కోమల్‌కు చిన్నప్పటినుంచి ఫ్యాషనబుల్‌గా ఉండడమంటే ఎంతో ఇష్టం. దీంతో రోజుకోరకంగా తయారై కాలేజీకి వెళ్లేది. ఆమెను చూసిన ఫ్రెండ్స్‌ ‘నువ్వు చాలా స్టైలిష్‌గా ఉన్నావు! మోడలింగ్‌ ట్రై చేయెచ్చు కదా!’ అనేవారు. అయితే ఆ సమయంలో .. బాయ్‌ఫ్రెండ్‌ తో ప్రేమలో ఉన్న కోమల్‌... వాళ్ల మాటలు అంతగా పట్టించుకోలేదు. అలా నాలుగేళ్లు గడిచిన తరువాత బాయ్‌ ఫ్రెండ్‌ బ్రేకప్‌ చెప్పడంతో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. 

లుక్‌ ఆఫ్‌ ది డే..
లవ్‌ బ్రేకప్‌ను మర్చిపోవడానికి తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్‌ రంగంలోకి తనదైన శైలిలో అడుగులు వేసింది. 2015లో ‘లుక్‌ ఆఫ్‌ ది డే’ పేరిట తన ఫ్యాషన్‌  కెరీర్‌ ను ప్రారంభించింది. రోజుకోరకంగా తయారై ఇన్‌ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టేది. కోమల్‌ ఫ్యాషన్‌ బుల్‌ ఫోటోలు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు నచ్చడంతో ఫాలోవర్స్‌ సంఖ్య పదివేల నుంచి 50 వేలకు చేరింది. ఈ ప్రోత్సాహంతో కోమల్‌ ‘‘ది కాలేజీ కోచర్‌’’ పేరిట బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనిలో తక్కువ ఖర్చుతో ఫ్యాషన్, పాకెట్‌ ఫ్రెండ్లీ స్టైల్, బ్యూటీ, లుక్‌ బుక్స్, లేటెస్ట్‌ ట్రెండ్స్‌పై వీడియోలు పోస్టు చేసేది.
 
ఉద్యోగం వదిలేసి..
2015 నవంబర్‌లో కోమల్‌ బ్లాగ్‌ను గుర్తించిన ‘పాప్‌క్సో’ చానెల్‌ కోమల్‌కు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. పాప్‌క్సోలో  చేరిన ఏడాదిన్నరలోనే 400 వీడియోలు చేసి కోమల్‌ మరింత ఫేమస్‌ అయ్యింది. అప్పుడే కోమల్‌కు ఓ ఆలోచన వచ్చింది. ‘‘నాలో ఇంత టాలెంటు దాగుందా? అయితే నేను ఎందుకు ఒకరి దగ్గర పనిచేయాలి? నా ప్రతిభను నమ్ముకుంటే నేనే బాస్‌గా ఎదుగుతాను!’’ అనుకోని వెంటనే పాప్‌క్సోలో ఉద్యోగం మానేసింది. అ తరువాత 2017లో తన సొంత యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్‌ చానల్‌ల్లో రోజూ రకరకాల ఫ్యాషన్‌ లపై వీడియోలు రూపొందించి పోస్టుచేసింది.. వాటికి మంచి స్పందన రావడంతో ఫాలోవర్స్‌ సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయం లక్షల్లో వస్తోంది. 2015 నుంచి ఇప్పటిదాకా సోషల్‌ మీడియా స్టార్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ.. మరోపక్క హనర్, వివో, గార్నియర్, మెబ్లిన్‌  వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘‘నేను చిన్నప్పటి నుంచి స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ఇష్టపడేదాన్ని. ఆ ఇష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చాలామంది ఫ్యాషన్‌  అంటే ధనవంతులకే సొంతమనుకుంటారు. అది నిజం కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఫ్యాషన్‌  స్టార్‌గా ఎదిగాను. ఫ్యాషన్‌గా ఉండాలంటే రోజూ కొత్తగా, ట్రెండీగా ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీ ఫ్యాషన్‌  చాలా సింపుల్‌గానూ, సౌకర్యంగానూ ఉండేలా చూసుకోవాలి’’ అని కోమల్‌ చెప్పింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top