ముసోరీ శిఖరం.. గంగాతీరం!

IRCTC Introduce Uttarakhand Coombs Tour: Know Details - Sakshi

భారతీయం

ఐఆర్‌సీటీసీ ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌ కుంభ్‌ స్పెషల్‌ టూర్‌ నిర్వహిస్తోంది. ఆరు రోజుల పర్యటనలో  ఢిల్లీ, హరిద్వార్, ముస్సోరీ, రిషికేశ్‌లు ఉంటాయి. ఈ ప్యాకేజ్‌లో ఒకరికి 31, 200 రూపాయలవుతుంది. డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 24,100 రూపాయలవుతుంది. హైదరాబాద్‌ – ఢిల్లీ రానుపోను విమాన చార్జీలు కూడా ప్యాకేజ్‌లోనే. ఏప్రిల్‌ రెండవ తేదీ ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కాలి. పర్యటన పూర్తయిన తర్వాత ఏడవ తేదీ రాత్రి పదకొండుకు హైదరాబాద్‌లో దిగడంతో పర్యటన పూర్తవుతుంది.

ఆరు రోజుల్లో
మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి ఎనిమిదిన్నరకు ఢిల్లీలో విమానం దిగిన తర్వాత హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావడం. మధ్యాహ్న భోజనం తర్వాత లోటస్‌ టెంపుల్, కుతుబ్‌మినార్, సాయంత్రం అక్షర్‌ధామ్‌దర్శనం. 
రెండవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత గది చెక్‌ అవుట్‌ చేయాలి. రోడ్డు మార్గాన ముస్సోరికి ప్రయాణం. ముస్సోరి చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, మాల్‌ రోడ్డులో ఒక రౌండ్‌ తిరగడం. మాల్‌ రోడ్డు మొత్తం నడిస్తే ముస్సోరి జనజీవనాన్ని చదివినట్లే.
మూడవరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ముస్సోరిలోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తారు. ఆ రాత్రి బస కూడా ముస్సోరిలోనే.
నాలుగవ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత రూమ్‌ చెక్‌ అవుట్‌ చేసి దారిలో డెహ్రాడూన్‌లోని తప్కేశ్వర్‌ మందిర్, రిషికేశ్‌లను చూసుకుంటూ హరిద్వార్‌ చేరుతుంది ట్రిప్‌. రాత్రి బస అక్కడే. 
ఐదవ రోజు హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ దర్శనం, హర్‌ కీ పౌరిలో గంగాతీర విహారం, గంగా హారతి తర్వాత రాత్రి గదికి చేరడం, ఆ రోజు బస కూడా హరిద్వార్‌లోనే.
ఆరవ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి ప్రయాణం ఢిల్లీకి సాగిపోతుంది. రాత్రి ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దించడంతో ప్యాకేజ్‌ నిర్వహకుల బాధ్యత పూర్తవుతుంది. ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇండిగో విమానం ఎక్కి పదకొండు గంటలకు హైదరాబాద్‌లో దిగడంతో టూర్‌ పూర్తవుతుంది.

ప్యాకేజ్‌లో ఇవన్నీ ఉంటాయి!
విమానం టిక్కెట్లు, ఐదు రాత్రులు బస సౌకర్యం (ఢిల్లీ 1, ముస్సోరి 2, హరిద్వార్‌ 2), ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్, రాత్రి భోజనం. 
సైట్‌ సీయింగ్‌ కోసం ఏసీ మినీ బస్‌ ఉంటుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఒక ఎస్కార్ట్‌ సర్వీస్, టూరిస్ట్‌లకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి.

ఇవేవీ ప్యాకేజ్‌లో ఉండవు!
పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్‌లు, ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకి పికప్, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి డ్రాప్, మధ్యాహ్న భోజనాలు, విమానంలో ఆహారం–పానీయాలు ప్యాకేజ్‌లో ఉండవు. దుస్తులు ఉతికించుకోవడం, వాటర్‌ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు ఇందులో వర్తించవు.
బస కోసం కేటాయించే హోటళ్లు ఢిల్లీలో హోటల్‌ సదరన్, ముస్సోరిలో హోటల్‌ ప్రైడ్, హరిద్వార్‌లో హోటల్‌ రీజెంటా ఆర్కోస్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top