హాయ్! ఫ్రెండ్స్ .. నేనూ.. మీకు ఎంతగానో ఇష్టమైన బార్బీని. ఇవాళ నా గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుదామని మీ ముందుకు వచ్చాను.. మీకూ తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి మరి. ∙నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నన్ను సృష్టించింది రూత్ హ్యాండ్లర్ అనే ఒక వ్యాపారవేత్త.
తన కూతురు బార్బీ పేరు మీదుగానే నాకు కూడా ‘బార్బీ’ అని పేరు పెట్టారు తెలుసా! మొట్టమొదటిసారి నన్ను న్యూయార్క్ టాయ్ ఫెయిర్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు. 150 పైగా దేశాల్లో నాకు అభిమానులున్నారంటే ఆశ్చర్యమే కదా!
నేను మొదట నలుపు, తెలుపు రంగుల జీబ్రా గీతల స్విమ్‌సూట్ ధరించి, పోనీటైల్ హెయిర్ స్టైల్‌తో ఉండేదాన్ని.
ఇప్పటి వరకు నన్ను 250 కి పైగా వృత్తుల వేషధారణల్లో తయారుచేశారు. అందులో డాక్టర్, పైలట్, ఆస్ట్రోనాట్, దేశాధ్యక్షురాలు వంటివి కూడా ఉన్నాయి.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడానికి 4 ఏళ్ల ముందే, అంటే 1965 లోనే బార్బీ ’ఆస్ట్రోనాట్’ రూపంలో నేను మార్కెట్లోకి వచ్చేశాను.
నాకు ఎంతో ఇష్టమైన రంగు పింక్. దీనికి ఒక ప్రత్యేకమైన ΄పాంటోన్ షేడ్ కూడా ఉంది. నాకు జోడీగా కెన్ బొమ్మను1961లో విడుదల చేశారు. విచిత్రమేమిటంటే, రూత్ హ్యాండ్లర్ కొడుకు పేరు కెన్!
నన్ను ఈ మధ్యకాలంలో రకరకాల ఆకృతులలో, ఎత్తులలో, 35 కంటే ఎక్కువ చర్మపు రంగులలో తయారుచేస్తున్నారు. అందం అంటే కేవలం ఒకేలా ఉండటం కాదు అని చెప్పడమే ఇందులోని ఉద్దేశం.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైపోయిన నా నమూనాల్లో ‘టోటల్లీ హెయిర్ బార్బీ’ ఒకటి. ఎందుకంటే ఈ నమూనాలో నా జుట్టు పొడవుగా నేలకు అంటుకుని ఉండడమే కారణం. ఇప్పుడు కేవలం నేను ఒక బొమ్మను మాత్రమే కాదండోయ్, యూట్యూబ్ వ్లాగర్‌ని కూడా! నాకు కూడా ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నా జీవిత విశేషాలను షేర్ చేస్తుంటాను తెలుసా!
(చదవండి: పల్లెటూరి అమ్మాయి ఘనత..రైతన్నల కోసం..! ఏకంగా జపాన్..)


