Women In Aviation: శభాష్‌ అన్నది ఆకాశం.. యూఎస్‌, యూకే కంటే మన దేశంలోనే అధికం!

India Has More Commercial Women Pilots Compared To Other Countries - Sakshi

స్త్రీ సాధికారత.. ఆకాశంలో సగం.. విజయంలో పరిపూర్ణం

ప్రపంచంలోని అగ్రదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్‌లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంఖ్యాపరంగానే కాదు... పనితీరు, ప్రతిభ విషయంలోనూ ఇతర దేశాలకు స్ఫూర్తి ఇస్తున్నారు...

మూడు దశాబ్దాల వెనక్కి వెళితే...
వైమానికరంగంలోకి నివేదిత భాసిన్‌ పైలట్‌గా అడుగు పెట్టినప్పుడు ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు. అడుగడుగునా అహంకారపూరిత అనుమానాలు ఎదురయ్యాయి. అయితే అవేమీ తన ప్రయాణానికి అడ్డుకాలేకపోయాయి.

‘మహిళలు విమానం నడపడం ఏమిటి!’ అనే అకారణ భయం, ఆందోళన ప్రయాణికులలో కనిపించేది.
అయితే ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది.

‘వైమానిక రంగంలో మహిళలు’ అనే అంశం ముందుకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయి. మన దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్‌ల గురించి ప్రస్తావిస్తున్నాయి.

తాజాగా...
‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఉమెన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌’ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్‌(కమర్షియల్, ఎయిర్‌ఫోర్స్‌)లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఉదా: యూఎస్‌–5.5 శాతం యూకే–4.7 శాతం  ఇండియా–12.4 శాతం..
‘సంస్థల ఆలోచన తీరులో మార్పు రావడం, స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్‌లు, కుటుంబ సభ్యుల మద్దతు, ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్స్, సోషల్‌ మీడియా... ఎలా ఎన్నో కారణాల వల్ల మన దేశంలో మహిళా పైలట్‌ల సంఖ్య పెరుగుతుంది.

మహిళలు వైమానిక రంగంలో రాణించడానికి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు బాగా కనిపిస్తుంది’ అంటుంది ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చిన నివేదిత భాసిన్‌. నిజానికి వైమానికరంగంలో మహిళల ఆసక్తి నిన్నా మొన్నటిది కాదు.

వెనక్కి వెళితే...
1948లో ఏర్పాటైన యూత్‌ ప్రొగ్రామ్‌ ‘నేషనల్‌ క్యాడెట్స్‌ కాప్స్‌ ఎయిర్‌ వింగ్‌’ మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడంలో శిక్షణ ఇచ్చేది. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, హోండా మోటర్‌లాంటి సంస్థలు శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం చేసేవి.

వర్తమానానికి వస్తే...
ఇండిగోలాంటి విమాన సంస్థలు మహిళా పైలట్‌లకు సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రత్యేక సందర్భాలలో వెసులుబాటు ఇస్తున్నాయి. పికప్, డ్రాప్‌ కోసం గార్డ్‌తో కూడిన వాహన సౌకర్యం కలిగిస్తున్నాయి.

విధి నిర్వహణలో తమను ముందుకు నడిపిస్తున్నది ‘కుటుంబ మద్దతు’ అంటున్నారు మహిళా పైలట్‌లు.
జోయా అగర్వాల్‌ పైలట్‌ కావడానికి మొదట్లో తల్లిదండ్రులు సుముఖంగా లేరు. అయితే కూతురు పట్టుదల చూసి పచ్చజెండా ఊపారు. వైమానికరంగ చరిత్రలో జోయా సాధిస్తున్న విజయాలు వారికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.

చిన్నవయసులోనే బోయింగ్‌ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచిన జోయా నలుగురు మహిళా పైలట్‌లను తోడుగా తీసుకొని పదిహేడుగంటల పాటు ఉత్తరధృవం మీదుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది.

‘కల కనడం ఒక్కటే కాదు ఆ కలను నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రతికూలతల గురించి ఆలోచించవద్దు. విజయాలు అందించడానికి ఈ ప్రపంచమే మీకు తోడుగా ఉంటుంది’ అంటుంది జోయా అగర్వాల్‌.

జోయాలాంటి ప్రతిభ, సాహనం మూర్తీభవించిన మహిళల వల్లే ఇప్పుడు ప్రపంచ వైమానికరంగ చరిత్రలో భారతీయ మహిళా పైలట్‌లకు ప్రశంసనీయమై, స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకత ఏర్పడింది. 
చదవండి: Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top