Miz Korona: మహిళను అయినందు వల్ల అన్నిచోట్లా నిరాశ అనే చేదు టేస్ట్‌ చేశా.. కానీ

Hyderabad: US Rapper Miz Korona In Saint Francis College Interview - Sakshi

అవకాశాలను మనమే కల్పించుకోవాలి

అమెరికన్‌ ర్యాపర్‌ మిజ్‌ కొరోనా

యుఎస్‌–ఇండియా 75 ఏళ్ల సంబంధాలను గుర్తుచేసుకోవడానికి  హైదరాబాద్‌లోని యుఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హిప్‌–హాప్‌ కాన్సెర్ట్‌ను నిర్వహించింది.  ఈ సందర్భంగా నగరంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ కాలేజీలో గత శనివారం హిప్‌–హాప్‌ గ్రూప్‌  ‘ది ఇన్విజిబుల్స్‌’ తమ బీట్స్‌తో యువతని ఉర్రూతలూగించింది. వారిలో అమెరికన్‌ ర్యాపర్, ఫొటోగ్రాఫర్, యాక్టివిస్ట్‌ మిజ్‌ కొరోనా ఒకరు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన సంభాషణ.

భవిష్యత్తు ఆలోచనలు?  
సాహిత్యాన్ని, సంగీతాన్ని అమితంగా ఇష్టపడతాను. నా సంగీతంతో నేను కూడా ఊహించనంత ఎత్తుకు చేరుకోవాలన్నది నా కల. అందుకోసం ప్రతి క్షణం తపిస్తూనే ఉంటాను. ఏ దేశమైనా మహిళల్లో చాలా ప్రతిభ ఉంటుంది. దానిని ఎవరికివారు వెలికి తీసుకురావడంలోనే హెచ్చుతగ్గులు ఉంటాయి. నాపైన నాకు అపారమైన నమ్మకం ఉంది. అది ఎలాంటిదంటే.. నేను ఈ లోకం వదిలేలోపు నాదైన ముద్రను వదిలి వెళ్లాలనేది నా కోరిక.

ఈ సంగీత అభిరుచి ఎప్పుడు మొదలైంది? 
మా నాన్న పాటలు పాడేవారు. నేనూ పాటలు పాడాలని కోరుకున్నారు. (నవ్వుతూ) మా చుట్టుపక్కల వాళ్లు ఎలా భరించేవారో కానీ, గల్లీ బేబీలా గలగలమంటూ ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతూనే ఉండేదాన్ని. మా ఇంట్లో చాలా వస్తువులు నా చేతులతో వేసే తాళాలకు బలయ్యేవి.

12 ఏళ్ల వయసులో ఇచ్చిన ప్రదర్శన నా జీవితంలో అత్యంత కీలకమైంది. చిన్నదాన్ని కావడం, పురుషాధిక్య పరిశ్రమ కావడంతో ప్రతిసారి చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అయినా ‘వెళ్లాల్సిందే’ ప్రతీ అవకాశాన్ని కల్పించుకుంటూ, దూసుకెళ్లాల్సిందే అనుకున్నాను.

ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉండేది?  
ప్రదర్శనలు, ఆల్బమ్స్‌ రిలీజ్‌ తర్వాత ర్యాప్‌లో ‘అబ్బాయిల్లా కనిపించాలి’ అనే లెటర్స్, మెసేజ్‌లు వచ్చేవి. ఇది కొంచెం కష్టం కలిగించేదే అయినా పెద్దగా పట్టించుకోలేదు. నేను, నాలాగే ఉండాలి అనుకున్నాను. అలాగే ఉన్నాను. (నవ్వుతూ).

కళాకారిణిగా ఈ రంగంలో సమస్యలను ఎలా అర్థం చేసుకున్నారు?  
యునైటెడ్‌ స్టేట్స్, ఆఫ్రికా, ఫ్రాన్స్, నార్వే, ఇప్పుడు ఇండియా.. ప్రపంచంలోని హిప్‌–హాప్‌ ఆర్టిస్టులను కలుసుకోవడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి వెళుతూనే ఉంటాను. సింగిల్‌గానూ ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేస్తుంటాను. నిజానికి, నేను చాలా కష్టపడుతున్న కళాకారిణిని. ఈ విషయం నాకు తెలుసు. కానీ, ఎదిగే దశలో నాలాంటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి చాలామంది అభూత కల్పనలను జోడిస్తారని తెలుసుకున్నాను.

అంతేకాదు, వాటిని అంతగా పట్టించుకోకూడదు అని కూడా అర్థం చేసుకున్నాను. స్త్రీ అనే కారణంగా అన్నిచోట్లా నిరాశ అనే చేదును టేస్ట్‌ చేయడం అత్యంత సాధారణమైపోయింది. కానీ, నా హిప్‌–హాప్‌ టీమ్స్‌తో నాకలాంటి సమస్యలు లేవు. సంగీతాన్ని ఎక్కడైనా ఆస్వాదిస్తారు. దీనికి జెండర్‌ అనేది లేదని నా నమ్మకం.

కరోనా టైమ్‌లో సంగీతంలో మీరు చేసిన సృజన?  
(నవ్వుతూ)నా పేరు, కోవిడ్‌–19 పేరు (కరోనా)కు దగ్గరగా ఉండటంతో చాలామంది దీనికి తగిన మ్యూజిక్‌ని క్రియేట్‌ చేయమని అడిగారు. ముఖ్యంగా నా ఫ్రెండ్స్‌ మరీ మరీ అడిగారు. అందరూ అడుగుతున్నారు కదా అని రెండు వారాల్లో ‘ది వైరస్‌’ పేరుతో రాసి, మ్యూజిక్‌ ఆల్బమ్‌ రిలీజ్‌ చేశాను. గత నాలుగేళ్లలోనూ ఇది మంచి క్రియేటివ్‌ వర్క్‌ అని చెప్పవచ్చు.
– నిర్మలారెడ్డి 
ఫొటోలు: అనిల్‌ కుమార్‌ మోర్ల 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top