'సైంటిస్ట్‌గానే కాదు... భార్యగానూ గెలిచింది'! | Sakshi
Sakshi News home page

ఆమె నవయుగ సావిత్రి!

Published Sat, Dec 9 2023 12:27 PM

Husband Fight Superbug Infection Woman Saves Husband Life - Sakshi

ఆమె అంటువ్యాధులకు సంబంధించిన వైద్యురాలు, పరిశోధకురాలు. ఆమె భర్త అనుకోకుండా యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌కు గురయ్యాడు. తన కళ్లముందే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి క్షణం ఓ యుగంలా భయం ముంచుకొస్తోంది. అంత పెద్ద పరిశోధకురాలు అయినా ఓ సాధారణ మహిళలా భర్త ప్రాణాల ఎలా రక్షించాలో తెలియక తల్లడిల్లిపోయింది. ఇంతవరకు అలాంటి యాంటీబయోటిక్‌ బ్యాక్టీరియల్‌ కోసం ఎలాంటి చికిత్స లేదని తెలిసి హుతాశురాలైంది. ఎలాంటి యాంటి బయాటిక్‌లు వాడిన ఫలితం ఉండదని తెలిసిన క్షణంలో ఆమె మెదడు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో.. కలియుగ సావిత్రలా మారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందరిచేత శభాష్‌ అనిపించుకుంది. దాని గురించి ఓ పుస్తకం సైతం ప్రచురించింది కూడా. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎలా భర్త ప్రాణాలు కాపాడుకుంది అంటే..

యూఎస్‌కి చెందిన స్టెఫానీ స్ట్రాత్‌డీ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ ఎపిడెమియాలజిస్ట్‌. ఆమె భర్త టామ్‌ ప్యాటర్సన్‌ సూపర్‌ బగ్‌(యాంటీబయాటిక్స్‌కి లొంగని బ్యాక్టీరియా) ఇన్ఫెక్షన్‌ బారినపడ్డాడు. సరిగ్గా 2015లో టామ్‌ నదిపై సర్ఫింగ్‌ చేస్తూ.. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో పడిపోయాడు. తక్షణమే స్ట్రాత్‌ డీ ఈజిప్ట్‌లోని ఒక క్లినిక్‌కి తరలించగా, అక్కడ అతడి ఆరోగ్య మరింతగా దిగజారడం ప్రారంభమయ్యింది. దీంతో ఆమె అతడిని జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యుల యాంటీబయోటిక్స్‌కి లొంగని "బాక్టీరియం అసినెటోబాక్టర్ బౌమన్ని"తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది అతడి కడుపులో ద్రాక్షపండు సైజులో ఓ గడ్డలా ఉందని చెప్పారు. అది ఎలాంటి యాంటీ బయోటిక్‌లకు లొంగదని చెప్పారు.

నిజానికి ఈ బ్యాక్టీరియాని మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇరాక్ యుద్ధంలో చాలామంది అమెరికన్ దళాల గాయపడ్డారు. అయితే వారంతా ట్రీట్‌మెంట్‌ తీసుకుని ఇంటికి వెళ్లాక ఈ బ్యాక్టీరియా బారిన పడే చనిపోయినట్లు నిర్థారించారు. అప్పుడే ఈ బ్యాక్టీరియాకు ఇరాకీ బాక్టీరియాగా నామకరణం చేశారు. దీనికి ఆధునిక వైద్యంలో సరైన చికత్స లేదు. ఇప్పటికీ ఈ బ్యాక్టీరియాని అంతం చేసేలా పరిశోధనలు జరుగుతున్న దశలోనే ఉన్నాయి. ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా జరగలేదు. దీంతో స్ట్రాత్‌ డీ డీలా పడిపోయింది. కళ్ల ముందు మృత్యు ఒడిలోకి జారిపోతున్న భర్త, ఏం చేయాలేని స్థితిలో తాను ఏంటీ స్థితి అని పరివిధాలుగా ఆలోచించింది.

ఈ క్రమంలో ఎందరో పరిశోధకులను సంప్రదించింది. దీనికి సంబంధించిన సమాచారాన్నంత క్షుణ్ణంగా పరిశీలించింది. దేనికి లొంగని ఈ యాంటీ బ్యాక్టీరియాలను తినేసే ఫేజ్‌ వైరస్‌లే(పరాన్నజీవులు) శరణ్యమని అర్థమయ్యింది. ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బ్యాక్టీరియాలని కూడా చెప్పొచ్చు. ఇవి మురికి నీటిలోను, చెరువులు, పడవల్లో, సముద్రాల్లో ఉంటాయని గుర్తించింది. అయితే వాటిలో ఏది తన భర్తకు వచ్చిన బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్‌ను తినేయగలదో అంచనావేసి, ఆ ఫేజ్‌ వైరస్‌ని శుద్ధి చేసి రక్తంలోకి ఇంజెక్ట్‌ చేయాలి. అయితే ఇంతవరకు ఈ ఫేజ్‌ థెరఫీని ఏ పేషెంట్‌కి ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరగలేదు. తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సాహసం చేయకు తప్పదు స్ట్రాత్‌ డీకి.

అందుకోసం ముందుగా యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఈ ట్రీట్‌మెంట్‌ చేసేందుకు పరిశోధకులు కూడా స్వచ్ఛందంగా ముందుకురారు ఎందుకంటే? ఈ టీట్‌మెంట్‌ పేషెంట్‌ ప్రాణాలతో చెలాగాటమనే చెప్పాలి. చివరకు టెక్సాస్ యూనివర్శిటీ బయోకెమిస్ట్ రైలాండ్ యంగ్ అనే పరిశోధకుడు మాత్రమే ముందుకొచ్చారు. ఆయన గత 45 ఏళ్లుగా ఈ ఫేజ్‌లపైనే  ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్సాస్‌ యూనివర్సిటీ ల్యాబ్‌ స్ట్రాత్‌ డీ భర్త టామ్‌కి సరిపడా ఫేజ్‌ కోసం ఆహర్నిశలు యత్నించి టామ్‌ శరీరంలోని బ్యాక్టీరియాతో క్రియాశీలకంగా పనిచేసే ఫేజ్‌ వైరస్‌ని కనుగొన్నారు. 

ముందుగా అతడి పొత్తికడుపులో చీముతో నిండిన గడ్డలోని ఈ ఫేస్‌ని ఇంజెక్ట్‌ చేశారు. ఏం జరగుతుందో తెలియని ఉత్కంఠతో ప్రతి రెండు గంటలకు చికిత్సు కొన​సాగిస్తూ పరిశోధక బృందమంతా అతడిని పర్యవేక్షించారు.  ఆ తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలను వ్యాపించిన బ్యాక్టీరియాను నివారించటం కోసం ఆ ఫేజ్‌లను టామ్‌ రక్తంలోకి ఇంజెక్ట్‌ చేశారు. నెమ్మదిగా టామ్‌ కోలుకోవడం కనిపించింది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తూ..ఇలా యూఎస్‌లో సిస్టమిక్‌ సూపర్‌బగ్‌ ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి ఇంట్రావీనస్‌ ఫేజ్‌ థెరపీని పొందిన తొలి వ్యక్తి టామ్‌ అని చెప్పారు.

ఈ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా కోమాలోకి వెళ్లిన టామ్‌ కాస్త బయటకు రావడమే కాకుండా తన కూతురిని గుర్తుపట్టి ఆమె చేతిని ముద్దాడాడు. దీని నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డాకు దీర్ఘాకాలిక వ్యాధులైన డయాబెటిస్‌ వంటి రోగాల బారిన పడ్డాడు. ఆహార సంబంధ జీర్ణశయ సమస్యలను కూడా ఫేస్‌ చేశాడు. అలాగే కోవిడ్‌ మహమ్మారి సమయంలో కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నింటిని విజయవంతంగా జయించి కోలుకున్నాడు. ఇప్పుడూ తన భార్య స్ట్రాత్‌ డీతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఒకరకంగా టామ్‌కి ఇచ్చిన ఫేజ్‌ థెరఫీ కొత్త శాస్త్రీయ ఆలోచనకు నాందిపలికింది.

ఇక స్ట్రాత్‌ డీ తన భర్త ప్రాణాల కోసం సాగించిన అలుపెరగని పోరాటాన్ని “ది పర్ఫెక్ట్ ప్రిడేటర్: ఎ సైంటిస్ట్ రేస్ టు సేవ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఎ డెడ్లీ సూపర్‌బగ్” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి మరీ ఈ బ్యాక్టీరియా పట్ల అవగాహన కల్పిస్తోంది. తనలా ధైర్యంగా ఉండి తమవాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకం ద్వారా ప్రచారం చేస్తోంది కూడా. కాగా, అయితే యాంటీబయటిక్‌లను ఈ ఫేజ్‌లు భర్తీ చేయవు కానీ యాంటీబయోటిక్‌లకు లొంగని బ్యాక్టీరియాలకు(సూపర్‌ బగ్‌లు) ఈ ఫేజ్‌లు మంచి ప్రత్యామ్నాయమైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు.

నటుడు కృష్ణంరాజు సైతం..
అంతేగాదు 2050 నాటికి ప్రతి మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఏడాదికి 10 మిలియన్ల మంది దాక ప్రజలు ఈ సూపర్‌బగ్‌ ఇన్ఫెక్షన్‌తో మరణిస్తారని యూస్‌ లైఫ్‌ సైన్స్‌ అంచనా వేసింది. అంతేగాదు దివంగత సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇది ఎక్కువగా సుదీర్ఘ కాలం ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికే వస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. దీన్ని నెగిటివ్‌ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. భారత్‌లో కూడా దీని తాలుకా కేసులు పెరుగుతుండటంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

(చదవండి: 41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె ఎవరనేది గుర్తించి కూతురికి అందజేస్తే..!)

Advertisement
 
Advertisement
 
Advertisement