కోడి పకోడి.. నోరూరించేలా!

How to Make Chicken Popcorn, Chicken Pakodi, Chicken Strips Easy - Sakshi

నిన్నమొన్నటి దాకా ఎండలు మండిపోయాయి. దాంతో వేపుడు కూరలు, కరకరలాడించే శ్నాక్స్‌ను దూరం పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు ముసురు పట్టిన వాతావరణానికి సుయ్యి సుయ్యిమని చేసుకు తినే రకరకాల వెజ్, నాన్‌ వెజ్‌ వంటకాలు తినాలనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం... ముసురుకు మూకుడు పెట్టండి మరి!

కోడి పకోడి
కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు–కేజి, శనగపిండి–150 గ్రాములు, బియ్యంపిండి–ఐదు టేబుల్‌ స్పూన్లు, కారం– టీస్పూను, ఎరుపురంగు ఫుడ్‌ కలర్‌ – చిటికడు, గరం మసాల– టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, నిమ్మకాయ– ఒకటి, నువ్వుల నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు– రుచికి తగినంత.


తయారీ:
► ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కను పేస్టులా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.

► ఇప్పుడు చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో పచ్చిమిర్చి, అల్లంపేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పువేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని గంటపాటు మ్యారినేట్‌ చేసుకోవాలి.

► శనగపిండి, బియ్యంపిండి, కారం, ఫుడ్‌ కలర్, గరం మసాల, మ్యారినేట్‌ చేసిపెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేయాలి.

► స్టవ్‌ మీద డీప్‌ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసి బాగా వేడెక్కనివ్వాలి. సలసల కాగిన నూనెలో చికెన్‌ ముక్కలు వేసి సన్నని మంటమీద వేగనివ్వాలి.  

► ముక్కలు ఎర్రగా క్రిస్పీగా మారితే చికెన్‌ పకోడి రెడీ అయినట్లే. వీకెండ్స్‌లో ఈవినింగ్‌ స్నాక్స్‌గా ఈ కోడిపకోడి ఎంతో రుచిగా ఉంటుంది. 


చికెన్‌ పాప్‌కార్న్‌

కావలసినవి: బోన్‌ లెస్‌ చికెన్‌ ముక్కలు– కేజి; ఆయిల్‌: డీప్‌ఫ్రైకి సరిపడా , ఉప్పు: రుచికి సరిపడా.

మ్యారినేషన్‌ కోసం... టేబుల్‌ స్పూన్‌ కారం, టేబుల్‌ స్పూన్‌ పసుపు, టీస్పూను మిరియాలపొడి, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు: నిమ్మరసం: రెండు టేబుల్‌ స్పూన్లు

మసాలా కోటింగ్‌... వంద గ్రాముల బ్రెడ్‌ ముక్కల పొడి, టీస్పూను కారం, టీ స్పూను పసుపు, టీ స్పూను జీలకర్ర పొడి, టీస్పూను ధనియాలపొడి, టీస్పూను మిరియాల పొడి, రెండు గుడ్ల తెల్లసొన.

తయారీ:
చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి మ్యారినేషన్‌ కోసం తీసుకున్న పదార్థాలు, టేబుల్‌ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఒక గంటపాటు మ్యారినేట్‌ చేయాలి.

► మసాలా కోటింగ్‌ కోసం తీసుకున్న పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  

► డీప్‌ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్‌ కాగాక...మ్యారినేట్‌ అయిన చికెన్‌ ముక్కలను ఒక్కోటి తీసుకుని ముందుగా గుడ్ల తెల్ల సొనలో ముంచి తరువాత మసాలా కోటింగ్‌ మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసి వేయించాలి.

► ముక్కలు గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వస్తే చికెన్‌ పాప్‌కార్న్‌ రెడీ అయినట్లే. వేడివేడిగా మీకిష్టమైన సాస్‌తో కలిపి తింటే చికెన్‌ పాప్‌కార్న్‌ రుచి అద్భుతంగా ఉంటుంది. 


క్రిస్పి బేక్డ్‌ చికెన్‌ స్ట్రిప్స్‌

కావలసినవి:  చికెన్‌ స్ట్రిప్స్‌ – పావు కేజి, గుడ్లు–  రెండు, బ్రెడ్‌ తరుగు – కప్పు, మైదా – అరకప్పు, బటర్‌ – టేబుల్‌స్పూన్, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్ర పొడి– అర టీస్పూను, గరం మసాల – అరటీస్పూన్, కారం – టీస్పూను, కొత్తిమీర, పుదీనా తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు తగినంత. 

తయారీ: 
బ్రెడ్‌ముక్కల తరుగును ఒక గిన్నెలో తీసుకుని దానిలో బటర్, పుదీనా, కొత్తిమీర తరుగు, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల సొనను మరోగిన్నెలో గిలకొట్టి పెట్టుకోవాలి.

► చికెన్‌స్ట్రిప్‌లను ఒకగిన్నెలో వేసి జీలకర్ర పొడి, గరం మసాల, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్‌కు పట్టేలా బాగా కలపాలి.

► చికెన్‌స్ట్రిప్స్‌ను బ్రెడ్‌ ముక్కల తరుగు కలిపిన మిశ్రమంలో ముంచి తరువాత గుడ్ల సొనలో ముంచి ఆయిల్‌లో వేసి డీప్‌ ఫ్రై చేయాలి.

► డీప్‌ ఫ్రై అయిన చికెన్‌స్ట్రిప్‌లను పదినిమిషాలు చల్లారనిచ్చి, తరువాత అవెన్‌లో ఏడు నిమిషాలు ఉంచి తీస్తే, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్‌ స్ట్రిప్స్‌ రెడీ అయినట్లే. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top