టెంపుల్‌ డ్యాన్స్‌ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!

Himansee Katragadda About Templedance Founder, Kuchipudi Dancer and Mentor - Sakshi

గణపురం కోటగుళ్లు .. గండికోట మాధవరాయ ఓరుగళ్లు రామప్ప.. జాకారం శివయ్య ఏ ఊళ్లో చూసినా ‘కొలువై ఉన్నాడే దేవ దేవుడు... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..’ అంటూ ఆనందపరవశంతో తమ నాట్య ప్రయాణాన్ని వివరిస్తుంది హిమాన్సీ కాట్రగడ్డ. నెమలికి నేర్పిన నడకలివీ .. అంటూ తన పాదాల మువ్వలతో అలరిస్తుంది. తెలంగాణలోని వరంగల్లు వాసి అయిన హిమాన్సీ కూచిపూడి నృత్యకారిణి. తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ, వాటిని వీడియోలుగా రూపుకట్టి ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ పేరిట అలనాటి వైభవాన్ని మన కళ్లకు కడుతోంది.


ఆలయ ప్రాంగణంలో నృత్యాన్ని దృశ్యీకరిస్తూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, దేశ వ్యాప్త నృత్య ప్రదర్శనలతో పాటు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోంది హిమాన్సీ. తెలుగులో ఇటీవల సూర్యాస్తమయం, కోలీవుడ్‌లో నవిలా కిన్నరి సినిమాలలో నటించి, నటిగా విమర్శకుల మెప్పు పొందింది.

ఎనిమిదేళ్ల వయసు నుంచి కూచిపూడి నృత్యసాధన చేస్తూ దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న హిమాన్సీ ప్రస్తుతం బి.టెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. టెంపుల్‌ డ్యాన్స్‌ ఆలోచనను, అందుకు తన కృషిని ఇలా వివరించింది.
 
‘‘నేను చేసిన ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ వీడియోలకు కళాతపస్వి విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సప్తపది సినిమా నటీమణి సబిత తమ ప్రశంసలు అందించారు. మా దేవాలయ నృత్యాలను ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలను ఒక్కొక్కటిగా చేరుకోవడం, వాటిని మా నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకురావడం మేం చేయాలనుకున్న పని. నాకు మద్దతుగా మా గురువు సుధీర్‌ గారు నిలవడంతో నా ఆలోచనను అమలులో పెట్టడం మరింత సులువు అయ్యింది.

కట్టిపడేసే మార్మికత
చిన్ననాటి నుంచి చారిత్రక రహస్యాల పట్ల అమితమైన ఆసక్తి. వాటి శోధనల్లో ఉన్నానంటే నన్ను నేను మర్చిపోతాను. వరంగల్‌లో కాకతీయ రాజులు కట్టించిన ఎన్నో గుళ్లు, వాటి వైభవం చూస్తూ పెరిగాను. ఆ శిల్పకళలో ఏదో తెలియని మార్మికత కట్టిపడేస్తుంటుంది. ఎక్కడ ఆలయాన్ని సందర్శించినా నా నాట్యకళతో ముడిపెట్టినట్టుగా అనిపించేది. ప్రతీ ఆలయంలో నాట్య మండపాలు ఉన్నాయంటే, నాడు కళలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో దీనిని బట్టే తెలిసిపోతుంది. కళల ద్వారా విద్యను జనాల్లోకి తీసుకువెళ్లేవారు. వీటన్నింటినీ తెలుసుకుంటూ ఏ ఆలయానికి వెళ్లినా వీడియోలు, ఫొటోలు తీస్తుండేదాన్ని.

కళ ఎప్పటికీ సజీవం
కాకతీయు రాజుల చరిత్ర చదివినప్పుడు, ఆలయ నిర్మాణాల పట్ల వారికున్న దూరదృష్టి నన్ను అమితంగా ఆకర్షించింది. అదే, నన్ను అనేక ఆలయాలను దర్శించేలా చేసింది. మనకు తెలిసినంతవరకు హంపి, ఖజరహో ఆలయాల గురించి, వాటి శిల్ప కళ గురించి గొప్పగా ప్రస్తావిస్తుంటాం. కానీ, ఒక్క తెలంగాణలోనే వెయ్యికి పైగా శివాలయాలున్నాయని, అంతకుమించి శిల్పకళ ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ ఆలయాలు నేడు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకున్నాను. కొన్నింటిని ప్రభుత్వం గుర్తించి, వాటిని బాగు చేసే ప్రయత్నం చేస్తోంది. రేపటి తరాలకు నాటి కళను అందించాల్సిన అవసరం ఉంది.  

సామాజిక మాధ్యమంతో వెలుగులోకి..
ప్రాచీన ఆలయాల గురించి శోధిస్తున్నప్పుడు పుస్తకాల్లో చదివి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాను. అవేవీ దృశ్యరూపంలో లేవని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని మా గురువుగారితో చర్చించి, ‘టెంపుల్‌ డ్యాన్స్‌’ పేరుతో వీడియోలు తీస్తూ, మా నాట్యకళాకారులచేత కూడా ప్రదర్శనలు ఇస్తూ, వాటిని సామాజిక మాధ్యమం ద్వారా జనంలోకి తీసుకువస్తున్నాం. ఇటీవల తెలంగాణలోని కోటగుళ్లు, రామప్ప, వారణాసిలో చేసిన నృత్యాలకు మంచి స్పందన వచ్చింది.

ఏ ఊళ్లో శిథిలావస్థలో ఉన్న గుడి అయినా, వెలుగులోకి రావాలని, తిరిగి ఆ గుడికి కళాకాంతులు తీసుకురావాలన్నది నా తాపత్రయం. అలా వరంగల్‌లోని అన్ని గుళ్ల వద్ద టెంపుల్‌ డ్యాన్స్‌ వీడియోలు చిత్రించాం. మా నాట్య అకాడమీ నుంచి బృందాన్ని తీసుకెళ్లి, తగిన పాటను ఎంపిక చేసుకొని, డ్రెస్సింగ్, వీడియో, ఎడిటింగ్‌.. అన్ని బాధ్యతలు చూసుకుంటాను. ఇది ఒక తపస్సులాగా చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శ్రీనివాస్‌లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ఊరే ముందుకు వచ్చి...
తెలంగాణలోని జాకారం ఊళ్లో శివయ్య ఆలయం చూసి ఆశ్చర్యపోయాం. ఆ ఆలయానికి పై కప్పు ఎప్పుడో పడిపోయింది. లోపలంతా చెత్త పేరుకుపోయింది. అద్భుత కళా సంపద గల ఆ ఆలయం గురించి ఆ ఊరి పెద్దలు ఎన్నో విషయాలు వివరించారు. ఆ గుడిని బాగు చేయడానికి గతంలో ఆ ఊరి వారు చందాలు పోగేశారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన మద్ధతు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఆచరణలోకి రాకుండానే ఆగిపోయింది. మేం అక్కడ ప్రస్తుతం ఉన్న సమస్యను రికార్డ్‌ చేయడంతో పాటు, మా నృత్యరీతులను ప్రదర్శించాం. వాటిని వీడియోగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ గుడిని బాగుచేసే పనులు మళ్లీ మొదలయ్యాయి’’ అని ఆనందంగా వివరించింది హిమాన్సీ.

‘ఆలయంలో ఒక్క దీపమైనా వెలిగించాలని ఎంతోమంది భావిస్తారు. మా నృత్యాల వల్ల ఒక్క ఆలయం బాగు పడినా చాలు’ అంటున్న హిమాన్సీ ఆలోచన జనం గుండెల్లోకి చేరాలని, ప్రాచీన కళావైభవం రేపటి తరాలకు అందాలని కోరుకుందాం.
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top