
నేను బీటెక్, ఎం. బి.ఎ. చేశాను. చదువులో మొదట్నుంచి టాప్! ఈ మధ్య చాలా చోట్ల నుండి – ఇంటర్వ్యూలు వస్తున్నాయి. కానీ ఇంటర్వ్యూ కెళ్ళాలంటేనే దడ పుట్టుకొస్తుంది. ఆ మధ్య హైద్రాబాద్‌లో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకెళితే, వెయిటింగ్ హాల్లో వొళ్ళంతా వణుకుడు, చెమటలు పట్టి విపరీతమైన భయం వేసి శ్వాస కూడా ఆడలేదు. చివరికి లోపలికి వెళ్ళిన తరువాత వారడిగే ప్రశ్నలకు సమాధానాలు తెల్సినా, టెన్షన్, మాట తడబడటం, మైండ్ల్‌బ్లాక్ కావడంతోఒక్క ప్రశ్నకు కూడా సరిగా ఆన్సర్ చెప్పలేక పోయాను. చదువులో అంత టాప్‌లో ఉన్న నాకు ఇంటర్వ్యూ విషయానికొచ్చేసరికి ఎందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. ఈ భయం వల్ల మంచి ఆఫర్స్ కూడా చేతులారా పోగొట్టుకుంటున్నాను. అందరి లాగా నేను కూడా ఇంటర్వ్యూలు ధైర్యంగా ఫేస్ చేయగలనంటారా?
– రవిచంద్ర, కాకినాడ
చదువులో టాప్‌లో ఉండి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల వచ్చిన ఆఫర్స్ పోగొట్టుకుంటున్నారన్న విషయం బాధాకరమైందే. మంచి తెలివి తేటలు, క్వాలిఫికేషన్స్ ఉండి కూడా కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల ఇలా వెనకబడిపోతున్నారు.
‘సోషల్ యాంక్సైటీ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన వారిలో ఇలాంటి భయాలుంటాయి. కొందరికి నలుగురిలో కలవాలంటే భయం. మరికొందరికి స్టేజి మీద మాట్లాడాలన్నా, గుంపులో కలవాలన్నా అమితమైన భయం, సిగ్గు, మొహమాటం. ముడుచుకు΄ోయి ఒక మూలగా ఒంటరిగా ఉండటం ఇవన్నీ ఈ సోషల్ యాంక్సైటీ లక్షణాలే! వారసత్వం వల్ల కొందరు, కుటుంబ వాతావరణం వల్ల మరి కొందరు ఈ మానసిక రుగ్మతకు లోనయ్యే అవకాశముంది.
దీనివల్ల ఎంత మెరిట్ ఉన్నా, ఉద్యోగంలో, జీవితంలో నెగ్గుకు రాలేరు. మరికొందరు అన్నింటిలో యావరేజ్‌లో ఉన్నా ఇలాంటి భయాలేం లేకుండా ఆత్మవిశ్వాసంతో అన్నింటిలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అన్న విషయం తెలియక చాలామంది అలాగే ఉండిపోతున్నారు.
ఈ సమస్యను కొన్ని మానసిక చికిత్స పద్ధతుల ద్వారా, మరి కొన్ని మంచి మందుల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. జాకబ్‌సక్సెస్ రిలాక్సేషన్, ‘డీసెన్సిటైజేషన్, మైండ్ ఫుల్ నెస్, ‘వర్చువల్ రియాలిటీ’ అనే ఆధునిక పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని పూర్తిగా ఈ సమస్య నుండి పూర్తి బయట పడవేయవచ్చు. వెంటనే సైకియాట్రిస్టుని సంప్రదించండి.
ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్, విజయవాడ, మీ సమస్యలు, సందేహాల కోసం పంపవల్సిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com
(చదవండి: హీరో శింబు ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..)