కోటీశ్వరుడు ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తాడనేది ఊహకు కూడా అందదు. అయితే కొన్ని వాస్తవాలు ఊహాప్రపంచానికి కూడా అందవని చెబుతుంది ఈ వైరల్ వీడియో. ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ నవ్ షా ఇటీవల ఫిజీకి వెళ్లాడు. ఉబర్‌లో ప్రయాణిస్తున్న షా 86 ఏళ్ల డ్రైవర్‌తో మాటలు కలిపాడు.‘ఈ వయసులో పనిచేస్తున్నారు. డబ్బులకు ఇబ్బందిగా ఉందా?’ అని అడిగాడు.ఆ డ్రైవర్ పెద్దగా నవ్వి... ‘అయ్యా! నేను కోటీశ్వరుడిని. గత దశాబ్ద కాలంగా ప్రతి సంవత్సరం 24 మంది అమ్మాయిలను చదివిస్తున్నాను. డ్రైవింగ్ ద్వారా వచ్చిన డబ్బును వారి చదువు కోసం వెచ్చిస్తున్నాను.
నాకు ముగ్గురు ఆడపిల్లలు. బాగా చదివించాను. పేదింటి బిడ్డలు కూడా వారిలా చదువుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు.అప్పుడెప్పుడో తన తండ్రి మొదలుపెట్టిన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు ఈ పెద్దాయన. ఈయనకు 13 జువెలరీ షాప్‌లు, ఆరు రెస్టారెంట్లు, నాలుగు సూపర్‌మార్కెట్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతలు కూతుళ్లు చూస్తున్నారు.‘నిజమైన విజయం అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగారనేదాని మీద ఆధారపడదు. ఎంతమందికి మీరు సహాయం చేశారు అనేదాని మీదే ఆధారపడి ఉంటుంది’ అనే కామెంట్‌తో వీడియో అప్‌లోడ్ చేశాడు నవ్ షా.


