సవాళ్లు, సమస్యలు అందరి జీవితాల్లో సహజం. కానీ, కొందరు మాత్రమే వాటిని తమ విజయానికి పునాదులుగా మార్చుకుంటారు. సరిగ్గా అదే పని చేసి చూపించారు హరిణి శివకుమార్. ఆరోగ్యం బాగోలేని తన బాబు కోసం బ్యాంకింగ్ కెరీర్‌ని వదులుకున్న హరిణి.. తిరిగి అదే బాబు సంరక్షణ కోసం వచ్చిన ఆలోచనతో పర్సనల్ కేర్ రంగంలో ‘ఎర్త్ రిథమ్’ అనే బ్రాండ్‌ను సృష్టించి రూ. 200 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి సక్సెస్‌ఫుల్ సీఈవోగా నిలిచారు.
దక్షిణ భారతదేశంలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన హరిణికి.. బ్యాంకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని కోరికగా ఉండేది. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే కష్టపడి చదువుకుని, నార్తాంప్టన్ విశ్వవిద్యాలయం నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఎంఏ పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం కూడా సంపాదించింది. జీవితం అంతా సాఫీగా సాగి పోతున్న సమయంలో, 22 ఏళ్ల వయస్సులో ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బాబు ‘డౌన్స్ సిండ్రోమ్’ అనే ఆరోగ్య సమస్యతో జన్మించడం వల్ల.. తన బిడ్డను చూసుకోవడం కోసం హరిణి చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేయాల్సి
వచ్చింది.
బాబు కోసం మొదలైన అన్వేషణ..
హరిణి తన బాబుకు సురక్షితమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలని భావించారు. అయితే మార్కెట్లో లభించే కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఆమెకు సంతృప్తినివ్వలేదు. సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ కోసం ఆమె చేసిన అన్వేషణే ఆమెలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. తానే స్వయంగా ఇలాంటి సురక్షితమైన ఉత్పత్తులను ఎందుకు తయారు చేయకూడదు? అనే ప్రశ్న ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది.
ఎర్త్ రిథమ్‌కు నాంది..
ముందుగా హరిణి తన ఇంట్లోనే తయారు చేసిన ప్రొడక్ట్స్‌తో గేటెడ్ కమ్యూనిటీలు, చిన్నపాటి ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత తన ఇంటి నుంచే సోప్‌వర్క్స్ ఇండియా అనే పేరుతో చిన్నగా వ్యాపారాన్ని అధికారికంగా ప్రారంభించారు. తయారీ, ΄్యాకింగ్, డెలివరీ.. ఇలా అన్ని పనులనూ ఆమె ఒక్కరే చూసుకునేవారు. ఆ తరువాత తన తండ్రి సహకారంతో వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేశారు.
తండ్రీకూతుళ్లు కలిసి పర్యావరణ హితమైన బ్రాండ్‌గా మార్చాలనే ఉద్దేశంతో కంపెనీని ఎర్త్ రిథమ్‌గా రీబ్రాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, గుర్గావ్‌లో సొంత ప్రొడక్షన్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలా కేవలం 8 మంది మహిళలతో ఒక చిన్న ఆఫీసులో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు ఈ సంస్థలో వెనుకబడిన వర్గాల మహిళలకు, వైకల్యాలున్న వారికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రూ. 200 కోట్ల సామ్రాజ్యం..
2022 నాటికి ఎర్త్ రిథమ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 10 రెట్లు పెరిగింది. వ్యాపారం కూడా 500 రెట్లు విస్తరించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ వెబ్‌సైట్ ద్వారా దాదాపు 160కి పైగా ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నారు. ఇందులో ΄్లాస్టిక్ రహిత ΄్యాకేజింగ్‌తో వచ్చే షాంపూ బార్ అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టింది. సమస్యలను చూసి కుంగి పోకుండా, దాన్నే ఒక అవకాశంగా మార్చుకుని అద్భుతాలు సృష్టించిన హరిణి శివకుమార్ ప్రయాణం.. ప్రతి ఒక్క మహిళకూ ఒక గొప్ప ఇన్‌స్పిరేషన్!
మీరూ సాధించవచ్చు!
చాలా కాలం పాటు ఇల్లు దాటని, ఎటువంటి బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేని నాలాంటి ఒక సాధారణ మహిళే రూ. 200 కోట్ల బ్రాండ్‌ను విజయవంతంగా నడపగలిగినప్పుడు.. మీరెందుకు సాధించలేరు? అందుకు కావాల్సినవి అచంచలమైన విశ్వాసం, పట్టువదలని ప్రయత్నమే. మీపై మీకు నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా
దాటవచ్చు.
– హరిణి శివకుమార్


