
వాతావరణం మారుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన కిచెన్ కూడా తనను తాను మార్చుకుంటుంది. వంట పాత్రలు కూడా మారాలంటున్నాయి అధ్యయనాలు. పదార్థాలు ఎక్కువ సేపు నిలవ ఉండాలంటే, పోషకాలను కోల్పోకుండా, రుచి మారకుండా ఉంచే పాత్రల్లోనే వండాలి. ఈ గుణాలున్నవి మట్టి పాత్రలే. వండడానికి మాత్రమే కాదు, భోజనాల తర్వాత మిగిలిన పదార్థాలను మరుసటి రోజుకు నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలను మించిన పాత్ర మరొకటి ఉండదని తాజా పరిశోధన. మట్టి మంచిదేనంటున్నాయి అధ్యయనాలు.
స్టీలు, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్థాలు ఆవిరిపట్టడం, అనారోగ్యకరమైన రసాయన చర్యలకు లోనుకావడం సహజం. మట్టిపాత్రలకు ఉండే సహజమైన రంధ్రాల ద్వారా గాలి ప్రసరిస్తుంది. పదార్థాలు ఎటువంటి మార్పులకూ లోనుకావని ఈజిప్టు పరిశోధన బృందం వెల్లడించింది. పైగా మట్టి సహజంగానే క్షారగుణం ఉంటుంది. ఇది ఆహారపదార్థాల్లోని ఆమ్లగుణాలను క్రమబద్ధీకరిస్తుంది. పీహెచ్ స్థాయులు జీర్ణక్రియకు తగిన మోతాదులో ఉండేలా మారుస్తుంది మట్టిపాత్ర. దీంతో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ కోసం ప్రపంచం పరిశోధనలు చేస్తోంది. మన సంప్రదాయ జీవనశైలి గట్ హెల్త్‌ను పరిరక్షించేదని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. మట్టిపాత్రల్లో వండడం వల్ల మట్టిలో సహజంగా ఉండే మినరల్స్ పదార్థాలకు తోడవుతాయి. ‘మట్టిపాత్ర టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్’ అనే ట్యాగ్ లైన్‌తో మోడరన్ కిచెన్, డైనింగ్ టేబుల్ మీద మట్టిపాత్రలు రాజ్యమేలనున్నాయి.
మంచినీటి కోసం మట్టికుండలు మోడరన్ కిచెన్‌లోకి మట్టికుండలు వచ్చాయి. తాజా అధ్యయనం ప్రకారం పదార్థాలను మట్టిపాత్రల్లో నిల్వ చేస్తే ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఫ్రిజ్ ఇంట్లో అలంకార వస్తువుగా మారే రోజు కూడా రావచ్చు. ఆయుర్వేదం– ఆధునిక శాస్త్రం రెండూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయమిది.
(Health Tip ఫ్యాటీ లివర్‌కు బొప్పాయితో చెక్)
మృణ్మయం– ఆరోగ్యమయం
పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశము’ ఇవి పంచమహాభూతాలు. వీటిలో భూమిదే ప్రథమస్థానం. చరాచర జీవరాశులకివే ఆయువుపట్టు. భూమి అంటేనే మట్టిమయం. కణాల పరిమాణాన్ని బట్టి ఇది ప్రధానంగా మూడు రకాలు. ఇసుక, ఒండ్రు, బంకమట్టి. మనం వాడే మట్టి పాత్రలకు ప్రధాన భూమిక ఒండ్రుమట్టి. అనాదిగా వస్తున్న ఆయుర్వేద శాస్త్రంలో మట్టి పాత్రల వాడకానికి మంచి విశిష్టత ఉంది. త్రాగునీరు సహజసిద్ధంగా చల్లబడాలన్నా, ఔషధాలు తయారు చేయాలన్నా, పుటాలు పెట్టాలన్నా, ఆహార ద్రవ్యాలు నిల్వ చేయాలన్నా కుండలు, మూకుడు వంటి మూతలు, వివిధ రూ పాల్లో తయారు చేసిన మట్టిపాత్రలనే వాడేవారు. ఇవి నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడతాయి. మట్టిలో సహజంగా నిక్షిప్తమైన ఖనిజాలు కొన్ని రకాల సూక్ష్మ క్రిములు మనిషి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. వండిన పదార్థాలను పూర్వీకులు ‘ఉట్టి’లో పెట్టి వేలాడ దీసేవారు. ఆ ఉట్టిలో మట్టి పాత్రలను పెట్టేవారు. ఈ పాత్రల ఉపరితలంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా పర్యావరణంతో అనుబంధమై వాటిలో ఉంచిన పదార్థాలుపాడవకుండా సహజస్థితిలోనే ఉంటాయి. ఇప్పటికీ ఉత్తరాదిలో మట్టి పాత్రలలో తేనీరు తాగే ఆచారం ఉంది. నేటి సమాజం మరలా నాటి సంప్రదాయాలకు మొగ్గుచూపడం హర్షణీయం.
ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి