Grammy Award 2023: Indian Music Composer Ricky Kej Wins 3rd Grammy For Divine Tides - Sakshi
Sakshi News home page

Grammy Awards 2023: నవరాగాల తేజం..రిక్కీ కేజ్‌

Published Tue, Feb 7 2023 1:28 AM

Grammy Awards 2023: Indian music composer Ricky Kej clinches third Grammy Award - Sakshi

గత సంవత్సరం గ్రామీ గెలుచుకున్న తరువాత లాస్‌ వేగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్‌ మార్క్యు బాల్‌రూమ్‌లో భారతీయత ఉట్టిపడేలా ‘నమస్తే’ అంటూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు మ్యూజిక్‌ కంపోజర్‌ రిక్కీ కేజ్‌. భారతీయత అతడి బలం. తనను ముందుకు నడిపించే ఇంధనం.

లాస్‌ ఏంజెల్స్‌(యూఎస్‌) మైక్రోసాఫ్ట్‌ థియేటర్‌లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన 65 వ గ్రామీ పురస్కార ప్రదానోత్సవంలో రాక్‌ లెజెండ్‌ స్టీవర్డ్‌ కోప్లాండ్‌తో కలిసి ‘గ్రామీ’ అవార్డ్‌ను అందుకున్నాడు రిక్కీ కేజ్‌. స్టీవర్డ్‌ కోప్లాండ్‌తో కలిసి చేసిన ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు బెస్ట్‌ ఇమాసివ్‌ ఆడియో ఆల్బమ్‌ విభాగంలో గ్రామీ దక్కింది. రిక్కీకి కెరీర్‌లో ఇది మూడో గ్రామీ...

సంగీతరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్‌ను ముచ్చటగా మూడోసారీ సొంతం చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ రిక్కీ కేజ్‌.
2015లో అమెరికన్‌ రాక్‌ లెజెండ్‌ స్టీవర్డ్‌ కోప్లాండ్‌తో కలిసి చేసిన ‘విండ్స్‌ ఆఫ్‌ సంసార’ ఆల్బమ్‌కు తొలిసారిగా గ్రామీ అవార్డ్‌ దక్కింది.

స్టీవర్డ్‌ కోప్లాండ్‌తో కలిసి చేసిన ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు మూడోసారి గ్రామీ అవార్డ్‌ (బెస్ట్‌ ఇమాసివ్‌ ఆడియో ఆల్బమ్‌ విభాగం)లో అందుకున్నాడు రిక్కీ. గత సంవత్సరం ఇదే ఆల్బమ్‌ ‘బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌’ విభాగంలో రెండోసారి గ్రామీ దక్కింది.

డివైన్‌ టైడ్స్‌... ప్రకృతి ప్రపంచానికి నివాళి.
ఈ ఆల్బమ్‌లో తొమ్మిది పాటలు ఉన్నాయి. మన హిమాలయాల అందాల నుంచి స్పెయిన్‌ అరణ్యాల అందాల వరకు మ్యూజిక్‌ వీడియోల్లో కనువిందు చేస్తాయి.
‘నా సంగీతంలో భిన్న సంస్కృతుల ప్రభావం కనిపించినప్పటికీ నా మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి’ అంటాడు రిక్కీ కేజ్‌.

మూడోసారి ‘గ్రామీ’ వరించిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోప్లాండ్‌తో ఉన్న ఫోటో పోస్ట్‌ చేసి ‘సూపర్‌ గ్రేట్‌ఫుల్, మై థర్డ్‌ గ్రామీ అవార్డ్‌’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు రిక్కీ కేజ్‌.
నార్త్‌ కరోలినా (యూఎస్‌)లో జన్మించాడు రిక్కీ. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి తల్లిదండ్రులతో పాటు  బెంగళూరులో ఉంటున్నాడు. స్థానిక బిషప్‌ కాటన్‌ స్కూల్‌లో చదువుకున్నాడు.

ఆక్స్‌ఫర్డ్‌ డెంటల్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో సంగీతంలోనే కెరీర్‌ వెదుక్కుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ఇలా చెప్పడం తండ్రికి నచ్చలేదు.
 ఆ తరువాత మాత్రం ఆయన కాస్త మెత్తబడ్డాడు. డెంటల్‌ సర్జరీలో డిగ్రీలో పూర్తి చేసిన తరువాత, పట్టా తండ్రి చేతికి ఇచ్చి తనకు ఇష్టమైన సంగీతపు దారిలో ప్రయాణం ప్రారంభించాడు.
టీవీలోని మ్యూజిక్‌ షోల ద్వారా చిన్నప్పుడే రిక్కీకి సంగీతంపై ఆసక్తి మొదలైంది. ఇంట్లో పెద్ద మ్యూజిక్‌ కలెక్షన్‌ ఉండేది.

రాక్‌ బాండ్‌ ‘ఏంజెల్‌ డస్ట్‌’లో గిటార్‌ ప్లేయర్‌గా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిక్కీ ఆ తరువాత ఫుల్‌టైమ్‌ కంపోజర్‌గా మారాడు. నస్రత్‌ ఫతే అలీఖాన్, పండిట్‌ రవిశంకర్, పీటర్‌ గాబ్రియెల్‌ తనకు ఇష్టమైన సంగీతకారులు.

జింగిల్స్‌ చేయడం అంటే రిక్కీకి చాలా ఇష్టం. జింగిల్స్‌ చేయడం అంటే తన దృష్టిలో రోజూ వ్యాయామం చేయడం లాంటిది. సృజనాత్మక పరిధిని పెంచుకోవడంలాంటిది. ఎన్నో భాషల్లో, ఎన్నో జానర్స్‌లో జింగిల్స్‌ చేస్తున్నప్పుడల్లా తనలో అదనపు శక్తి వచ్చినట్లుగా భావిస్తాడు. ఇప్పటివరకు మూడువేలకు పైగా జింగిల్స్‌ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వంద మ్యూజిక్‌ అవార్డ్‌లు గెలుచుకున్నాడు. రిక్కీకి నచ్చిన పుస్తకం రిచర్డ్‌ డాకిన్స్‌ ది గాడ్‌ డిలూజన్‌. నిజానికి రిక్కీ తండ్రి, తాతతో సహా బంధువుల్లో చాలామంది వైద్యులుగా పనిచేశారు.

‘రిక్కీలో ఆర్టిస్టి్టక్‌ జీన్స్‌ తాత నుంచి వచ్చాయి’ అని మురిసిపోతుంది తల్లి పమ్మి. తాత జానకిదాస్‌ నటుడు, భావుకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. 2014లో తన గర్ల్‌ఫ్రెండ్‌ వర్షను వివాహం చేసుకున్నాడు రిక్కీ కేజ్‌.
 
నవ రత్నాలు
‘డివైన్‌ టైడ్స్‌’ విడుదల అయిన కొత్తలో ఈ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డ్‌ గెలుచుకునే సంపూర్ణ అర్హతలు ఉన్నాయని కితాబు ఇచ్చారు సంగీత విశ్లేషకులు. వారి మాట నిజమైంది. ‘డివైన్‌ టైడ్స్‌’ లోని వండర్స్‌ ఆఫ్‌ లైఫ్, హిమాలయాస్, అవర్‌హోమ్, ఆర్డ్‌ ఆఫ్‌ డివోషన్, పాస్టోరల్‌ ఇండియా, ఐయామ్‌ ఛేంజ్, ఏ ప్రేయర్, గాంధీ, మదర్‌ ఎర్త్‌... తొమ్మిది ట్రాక్స్‌ నవరత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆల్బమ్‌లో మూలసూత్రం ఏమిటి?

మనతో మనం... అంటే ఎవరికి వారు తమ వ్యక్తిగత ప్రంచంలోకి వెళ్లి తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడం. తమను తాము విశ్లేషించుకోవడం, విశ్లేషణ ఫలితాలను ఆచరణలోకి తీసుకురావడం.

కాలంతో పాటు మనం... కాలంపై మనదైన సంతకం ఉండాలి. కాలం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. కాలం విసిరే ప్రశ్నలకు జవాబు వెదుక్కోవాలి. కాలం విసిరే సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలి.

మన గ్రహంతో మనం... భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీరేది కాదు. మనం చేయాల్సిందల్లా చెట్టును కాపాడుకోవాలి. చెట్టుపైన పిట్టను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ నినాదం మన శ్వాసలో భాగం కావాలి.

వ్యక్తిత్వ నిర్మాణంలో నేస్తం
ఆసక్తిగా మొదలై, అభిరుచిగా మారి రిక్కీ జీవితంలోకి వచ్చిన సంగీతం ‘సంగీతమే నా వ్యక్తిత్వం’ అనే స్థాయికి చేరుకుంది. అదే శ్వాస అయింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సంగీతంలో కెరీర్‌ను వెదుక్కోవడానికి ఇష్టంగా లేరు. దీని గురించి ప్రస్తావిస్తూ ‘మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను పాషన్‌పై కాకుండా భయంపై తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.

ఆర్థికకోణాన్ని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ను ఎంచుకోవడం కాకుండా ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాలి. సంప్రదాయ వృత్తులకు దూరంగా తాము ఎంచుకున్న మార్గం ద్వారా మీ పిల్లలు పెద్దగా డబ్బు సంపాదించలేకపోవచ్చు. అయితే డబ్బు కంటే విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు’ అంటాడు రిక్కీ కేజ్‌. గ్రామీ అవార్డ్‌ అందుకున్న యంగెస్ట్‌ ఇండియన్, మూడు గ్రామీలు అందుకున్న ‘వోన్లీ ఇండియన్‌’గా తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న రిక్కీ కేజ్‌ (41)...

‘సంగీతం అనేది హాయిగా విని ఆస్వాదించడానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వ నిర్మాణంలో సహాయపడుతుంది. మన పాటలలో ఎక్కువగా ప్రేమ, శాంతి, మంచితనం చుట్టూ అల్లుకున్నవే’  అంటాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement