చవితి రుచులు చవిచూడాల్సిందే! | Ganesh Chaturthi 2025: Delicious Ganpati Prasad Ideas | Sakshi
Sakshi News home page

చవితి రుచులు చవిచూడాల్సిందే!

Aug 24 2025 12:09 PM | Updated on Aug 24 2025 12:23 PM

Ganesh Chaturthi 2025: Delicious Ganpati Prasad Ideas

వినాయక చవితి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేవి కమ్మని వంటకాలు! ఉండ్రాళ్ళు, పులిహోరా, తాలికలు ఇలా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రుచులతో వేడుక మొదలవుతుంది. మరి మన బొజ్జగణపయ్యకు ఇష్టమయ్యే రుచులను సులభంగా ఇలా చేసుకుందామా?

బెల్లం తాలికలు
కావలసినవి:  చిక్కటి పాలు– ఒక లీటరు, బియ్యప్పిండి– అర కప్పు, నీళ్ళు– ఒకటిన్నర కప్పులు
బెల్లం తురుము– ఒక కప్పు (కావాలంటే పెంచుకోవచ్చు), ఏలకుల పొడి– అర టీస్పూన్‌
నెయ్యి– 2 టీస్పూన్లు, గోధుమపిండి– ఒక టీస్పూన్, బాదం, జీడిపప్పు –కొద్దికొద్దిగా

తయారీ: ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ముద్దలా అయ్యాక, చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, చేతితో సన్నని తాలికల్లా చుట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి, అవి మరుగుతున్నప్పుడు తాలికలను కొద్దికొద్దిగా వేసుకోవాలి. 

తాలికలు విరిగిపోకుండా సున్నితంగా గరిటెతో కలపాలి. తాలికలు పాలలో ఉడికిన తర్వాత, చిన్న గిన్నెలో గోధుమపిండిని కొద్దిగా నీటితో కలిపి, పాలలో వేసి గరిటెతో కలుపుకోవాలి. అనంతరం బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులను కలుపుకుంటే చాలు.

పులిహోర
కావలసినవి:  అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి)
చింతపండు గుజ్జు– 2 టేబుల్‌ స్పూన్లు (నిమ్మరసం కూడా వాడుకోవచ్చు)
పల్లీలు– పావు కప్పు
శనగపప్పు– ఒక టేబుల్‌ స్పూన్‌
మినపప్పు, ఆవాలు– ఒక టీస్పూన్‌ చొప్పున, జీలకర్ర– అర టీస్పూన్‌
ఎండుమిర్చి– 3 (ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 3 (సన్నగా చీల్చినవి), కరివేపాకు– కొద్దిగా
పసుపు– అర టీస్పూన్‌
ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి)
నూనె– తగినంత, ఉప్పు– రుచికి సరిపడా
తయారీ: ముందుగా పెద్ద పాత్ర తీసుకుని అన్నంలో కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. ఈలోపు మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. 

చింతపండుతో అయితే, వేగిన పోపులో చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకోవాల్సి ఉంటుంది. అదే నిమ్మకాయ పులిహోర అయితే, పోపు వేగిన తర్వాత స్టవ్‌ ఆపేసి, అందులో నిమ్మకాయ రసం కలుపుకుని, ఆ పోపు మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.
దద్ధోజనం
కావలసినవి:  అన్నం– రెండున్నర కప్పులు
గడ్డ పెరుగు– రెండు కప్పులు, పాలు– అర కప్పు(కాచి చల్లార్చినవి)
ఉప్పు– సరిపడా, నూనె– ఒక టేబుల్‌ స్పూన్‌
ఆవాలు– ఒక టీస్పూన్, కరివేపాకు– కొద్దిగా
కొత్తిమీర తురుము– కొద్దికొద్దిగా
అల్లం తురుము– అర టీస్పూన్‌

తయారీ: ముందుగా అన్నం వండి, చల్లారనివ్వాలి. చల్లారిన అన్నంలో పాలు, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు దోరగా వేగించాలి.అభిరుచిని బట్టి పప్పులు,  పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకుని వేయించుకోవచ్చు ఇప్పుడు ఆ పోపును పెరుగు అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఉండ్రాళ్ళు
కావలసినవి:  బియ్యప్పిండి–ఒక కప్పు
నీళ్ళు– ఒకటిన్నర కప్పులు
ఉప్పు– సరిపడా
నూనె– 2 టీ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి తురుము, అల్లం తురుము, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు– కొద్దికొద్దిగా
తయారీ: ఒక పాత్రలో నీళ్ళు, ఉప్పు, నూనె వేసి మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలా తయారయ్యాక, స్టవ్‌ ఆపేసి మూత పెట్టి ఐదు నిమిషాలుంచాలి. పిండి కొద్దిగా చల్లారాక, చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఈ ఉండ్రాళ్ళను పెట్టి,  ఆవిరిపై ఉడికించి ప్రసాదంగా పెట్టొచ్చు. 

అభిరుచి బట్టి ఈ ఉండ్రాళ్ళకు తాలింపు కూడా వేసుకోవచ్చు. అదెలా అంటే, స్టవ్‌ ఆన్‌ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన పోపులో ఈ ఉడికించిన ఉండ్రాళ్ళను వేసి సున్నితంగా కలుపుకుని, కొబ్బరితురుమును కూడా కలిపి  స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

(చదవండి: గణేశుడే అలంకరణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement