గురుకులం: వేద విద్యామణులు

Formers Fmily in four sisters studying vedas - Sakshi

నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్‌ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.

‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం.

► ఆడపిల్లలకు వేదాలా..?
వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్‌ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు.

► అన్ని కర్మలు
ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు.

► ఉచిత తరగతులు
మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు.

నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్‌డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

– నిర్మలారెడ్డి
 – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top