breaking news
Four sisters
-
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
‘మేం ఇంకా బతికే ఉన్నాం.. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’
అమెరికాలో జాన్సన్ సిస్టర్స్‌గా పేరుగాంచిన ఓ నలుగురు అక్కచెల్లెళ్లు తీవ్ర వృద్ధాప్యంలోనూ ఇటీవల సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు! వారు నెలకొల్పిన రికార్డు కూడా ఆషామాషీదేం కాదు.. ఇప్పట్లో ఎవరూ దాన్ని బద్దలుకొట్టే అవకాశం కూడా లేదు! ఇంతకీ ఆ రికార్డు ఏమిటో తెలుసా? వారు నేటికీ జీవించి ఉండటమే!! అంటే ప్రపంచంలోనే అత్యధిక వయసున్న నలుగురు అక్కచెల్లెళ్లుగా వారు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారన్నమాట. ఆ సోదరీమణుల మొత్తం వయసు ఎంతో తెలుసా. ఏకంగా 389 సంవత్సరాలు! అందరిలో పెద్దామె అర్లోయెన్స్ జాన్సన్ ఓవర్స్కీ వయసు 101 ఏళ్లు కాగా, రెండో సోదరి మార్సిన్ జాన్సన్ స్కల్లీకి 99 ఏళ్లు, మూడో సోదరి డోరిస్ జాన్సన్ గాడినీర్కు 96 ఏళ్లు, చివరి సోదరి జెవెల్ జాన్సన్ బెక్కు 93 ఏళ్లు. 2022 ఆగస్టు 1 నాటికి వారంతా 389 ఏళ్ల 197 రోజులు జీవించి ఎక్కువకాలం జీవించిన అక్కచెల్లెళ్లుగా ఘనత సాధించారు. తద్వారా 383 ఏళ్లతో నలుగురు తోబుట్టువుల పేరిట ఈ ఏడాది తొలినాళ్లలో నమోదైన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టారు. రూత్ల్యాండ్లో జన్మించిన ఈ జాన్సన్ సిస్టర్స్... తరువాత యూఎస్‌లోని వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా... ప్రతి వేసవిలో మాత్రం తప్పక కలుసుకుంటారు. అయితే వయసు పైబడటంతో ఈమధ్య ఫోన్లోనే టచ్‌లో ఉంటున్నట్టు తెలిపారు. గిన్నిస్ రికార్డు కోసం ఎందుకు దరఖాస్తు చేయాలనిపించింది? అని అడిగితే... ‘మేం నలుగురం ఇంకా బతికే ఉన్నాం. ఇది చాలదా మేం పండుగ చేసుకోవడానికి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా! చదవండి: (Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు) -
పెళ్లి కాలేదని నలుగురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
పేదరికం ఓ కుటుంబం పాలిట శాపంగా మారింది. కట్నకానుకలిచ్చి పెళ్లిళ్లు చేసే ఆర్థిక స్థోమత లేదనే ఆవేదనతో ఏకంగా నలుగురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు కొన ఊపిరితో బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం లోద్రాన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బషీర్ అహ్మద్ రాజ్పుట్ అనే నిరుపేద రైతుకు ఏడుగురు ఆడపిల్లలు. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు. మిగిలిన ఐదుగురు కూతుళ్లు అవివాహితులు. వారి వయసు 23-35 మధ్య ఉంటుంది. పేదరికం కారణంగా పెళ్లి కాకపోవడం వారిని కలచివేసింది. ఈ విషయమై తండ్రి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కట్నాలిచ్చే స్థోమత తండ్రికి లేదని భావించిన ఐదుగురు అక్కాచెల్లెల్లు ఓ కాలువలోకి దూకారు. నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని స్థానికులు రక్షించారు. చనిపోయిన వారిని మునీరా, జెనత్, నజియా, ఫయిజాగా గుర్తించారు. తనలా ఎవరూ ఎక్కువమంది ఆడపిల్లల్ని కనరాదంటూ బషీర్ కన్నీటిపర్యంతమయ్యాడు.