రాత్రికి రాత్రే డబ్బులు మాయం..

Fake apps online scam about Ate the money overnight - Sakshi

సైబర్‌ క్రైమ్‌

మార్గాలు వేరు.. గమ్యం ఒకటే!
చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్‌ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్‌ యాప్‌లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్‌ అప్లికేషన్స్‌ను సెండ్‌ చేస్తుంటారు. ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం.

రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్‌ యాప్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది.  ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది...

‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్‌ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్‌ యాప్‌ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాను. మన బదులుగా యాప్‌ వాళ్లే గేమ్‌ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్‌ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్‌ అవాలంటే ఆ యాప్‌లోనే ముందు రూ. 10,000తో అకౌంట్‌ ప్రారంభించాలి.

ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్‌ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్‌లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్‌ చేయమనే సూచనలు యాప్‌లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్‌ అకౌంట్‌లో మెంబర్‌గా ఉన్నాను. నా ఫ్రెండ్స్‌ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్‌ పోర్టల్‌ వారే కమిషన్‌ రూపేణా కట్‌ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్‌ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్‌లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు.
∙∙
రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను.  రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్‌ లో వేసే సమయానికి అమౌంట్‌ మైనస్‌లోకి వెళ్లింది. ప్లస్‌లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్‌ మైనస్‌ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా కూడా గ్రూప్‌లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్‌ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్‌ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్‌ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్‌ కార్డుల నుంచి యాప్‌ అకౌంట్‌లో వేశాను.

నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్‌లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్‌లో చూపించింది, కానీ విత్‌డ్రా ఆప్షన్‌ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్‌ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్‌డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్‌ చూస్తే జీరో బ్యాలెన్స్‌ ఉంది. టెలిగ్రామ్‌ గ్రూప్‌ నుంచి యాప్‌ పోర్టల్‌ వాళ్లు ఎగ్జిట్‌ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్‌లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక.                    

ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్‌
సోషల్‌మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్‌కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్‌కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్‌ చేస్తారు. సోషల్‌మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే..

► ఏదైనా లింక్‌ ద్వారా ఏ అప్లికేషన్‌ మనకు వచ్చినా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. ∙
► యాప్‌ స్టోర్, ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
► ఆండ్రాయిడ్‌లో వచ్చే అప్లికేషన్స్‌ అన్నీ ఎపికె ఫైల్స్‌ అంటారు. ఐఒఎస్‌లో వచ్చే ఫైల్స్‌ అన్నీ డిఎమ్‌జెడ్‌ ఫైల్స్‌ అంటారు. ఈ ఫైల్స్‌ని లింక్స్‌ ద్వారా పంపిస్తారు. సోషల్‌ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్‌ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటారు.

ఆ యాప్స్‌లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్‌లో అకౌంట్‌ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్‌ వాట్సప్‌ కన్నా టెలీగ్రామ్‌ గ్రూప్‌ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్‌లో ఎక్కువమందిని గ్రూప్‌గా యాడ్‌ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌

ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top