వ్యక్తం... అవ్యక్తం

Estimate the value of the work done is due to lack of understanding - Sakshi

మంచిమాట

పైకి పచ్చగా కనిపించే చెట్టు ఎంత విస్తరించి ఉన్నదో అంత కన్న ఎక్కువగా దాని వేళ్ళు నేలలో పాతుకుని పోయి ఉంటాయి. చెట్టు అంటే పైకి కనిపించే కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటో తెలుస్తోంది కదా. అదే విధంగా మనకి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. కనపడేది ఒక వంతు మాత్రమే... మూలమైనది మూడు వంతులు అని మన ఋషులు దర్శించి తెలియ చేశారు.

ఒక వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన నాలుగు మాటలు చకచక రాయటం చూసి, ఈ మాత్రానికే రూ. 500 తీసుకున్నాడు అని వాపోతారు. కాని, ఆ నాలుగు మాటలు, అంటే మందుల పేర్లు రాయటానికి ఆయన ఎంత కాలం కృషి చేసి ఉంటారో . ఒకసారి ఒక యంత్రం హఠాత్తుగా ఆగిపోయిందట. అందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ అది మొండికేసింది.

ఒక ఇంజినీర్‌ని పిలిచారు. ఆయన వచ్చి అటు ఇటు పరిశీలించి సుత్తి తీసుకుని సున్నితంగా ఒక దెబ్బ వెయ్యగానే అది పని చెయ్యటం మొదలు పెట్టింది. తన ఫీజు అడగగానే ఒక సుత్తిదెబ్బ ఇంత ఖరీదా? అని అడిగాడట యజమాని. దానికి ఆ ఇంజినీరు సుత్తి దెబ్బకి ఒక రూపాయే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎట్లా కొట్టాలో తెలుసుకున్నందుకు మిగిలినది అన్నాడట. నిజమే కదా. సుత్తిదెబ్బ అయితే ఎవరైనా కొట్టి ఉండ వచ్చుగా.

ఇంజినీరు ని పిలవటం ఎందుకు? పైకి కనిపించే పని వెనక ఉన్న కృషే పనిలో నైపుణ్యానికి కారణం. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్‌ దివి’’ అంది పురుష సూక్తం. అది అర్థం కావటానికి మానవుడు స్వయంగా ఇతర ప్రమేయం లేకుండా తయారు చెయ్యగల ఒకే ఒక్కమాట ని ఉదాహరణగా తీసుకోవచ్చు.‘‘త్రీణి నిహితా గుహాని తాని విదుర్ర్‌బాహ్మణా మనీషిణః నేంగయన్తి తురీయమ్‌ వాచో మనుష్యా వదంతి’’పరా, పశ్యంతి, మాధ్య మా అనే మూడుస్థాయుల ప్రయత్నం తరువాత వైఖరి అనబడే అందరికి వినపడే వాక్కు వెలువడుతుంది.

మనకి తెలియకుండానే ఇంత ప్రయత్నం జరిగిపోతోంది. ఇది అర్థం చేసుకోగలిగితే సృష్టి రహస్యం చాలా వరకు తెలిసినట్టే. దృశ్యమాన జగత్తుకి కారణమైన అదృశ్యంగా ఉన్న దానిని కనీసం ఊహించగలుగుతాం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక నాటక ప్రదర్శననో, చలనచిత్రాన్నో చూడండి. రంగస్థలం మీద ఒక గంటో, రెండుగంటలో ప్రదర్శించే నాటకానికి పూర్వరంగం అంటే ముందు చేసే ప్రయత్నం ఎంతో.

తెరమీద కనపడే ఒక దృశ్యాన్ని చిత్రీకరించటానికి ఎంతమంది ఎన్నిరోజులు శ్రమించి ఉంటారో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తూనే ఉన్నారుగా. ఒక గంట పాట కచేరీకి ఇన్ని వేలా? అని ప్రశ్నించే వారికి సమాధానం అది ఆ గంట కచేరీకి కాదు, దానికి ముందు చేసిన సాధనకి అని. ఒక మేథావి ఇచ్చిన గంట ఉపన్యాసం వింటే వంద గ్రంథాలు చదివినట్టే అనేది అందుకనే. ఒక్క గంట మాట్లాడటానికి వాళ్ళు అప్పటికి కొన్ని గ్రంథాలు చదువుతారు. అంతకుముందే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. దానికి వారి అనుభవం, విశ్లేషణ జోడించబడతాయి. ఈ దృష్టి అలవరచుకుంటే వ్యక్తం నుండి అవ్యక్తానికి ప్రస్థానం ప్రారంభమైనట్టే.

ఒక చెట్టుని కొట్టటానికి గంట పట్టింది. ఎంత తేలిగ్గా అయిపోయిందో అని చూసే వాళ్ళు అనుకుంటారు. కాని, గంట సమయంలో కొట్టటానికి గాను గొడ్డలికి తగినంత పదును పెట్టటానికి కనీసం పది గంటలు పట్టి ఉంటుంది. కనపడే పని వెనక కనపడకుండా ఉన్న సంసిద్ధత కోసం చేసిన ప్రయత్నం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటే పని సమయాన్ని సరిగా అంచనా వేసినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో చేసే పని విలువని సరిగా అంచనా వెయ్యలేకపోవటానికి ఇటువంటి అవగాహనాలోపమే కారణం.

– డా. ఎన్‌.అనంత లక్ష్మి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top