
తృణం
గురుకులంలో గురువుగారు శిష్యులకు ‘చాణక్య నీతి’ పాఠం చెప్తున్నారు. ‘తృణం బ్రహ్మవిదః స్వర్గం,/ తృణం శూరస్య జీవితం,/ జితాక్షస్య తృణం నారీ,/ నిరీహస్య తృణం జగత్’ – అన్న శ్లోకం చదివారు. ‘బ్రహ్మవేత్తకు స్వర్గ సుఖాదులు తృణప్రాయం. శూరుడికి ప్రాణాలు లెక్కలోనివి కావు. జితేంద్రియుడికి అందాల అప్సరసయినా గడ్డిపరక పాటిగా కనిపిస్తుంది. కోరికలు లేని విరాగికి ఈ జగత్తే ఒక గడ్డిపోచతో సమానం’ అని అర్థం చెప్పారు.
‘గురుదేవా! ఈ ప్రపంచంలో అన్నిటికంటే నిరర్థకమైనది గడ్డిపోచ అన్న అర్థం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది కదా?’ అని అడిగాడొక కొంటె శిష్యుడు.
‘పిచ్చితండ్రీ! అలాంటి అర్థాలనే పెడర్థాలు అంటారు. తృణం నిరర్థకం కాదు. బ్రహ్మవేత్తకూ, విరాగికీ దాని వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతవరకే! ఆ మాటకొస్తే గడ్డిపోచకు యతీంద్రుడి వల్ల ప్రయోజనం లేదు. అంతమాత్రాన ఆయన నిరర్థకుడవు తాడా? మాట వరసకు చెప్పిన మాటకు పెడర్థాలు తీయకూడదు.
తృణం వల్ల చాలా ప్రయోజనం ఉంది. దాని ఆయుష్షు స్వల్ప కాలం. ఆ స్వల్పకాలం పొడుగునా అది తన ముగ్ధమైన అందాన్ని ప్రదర్శిస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది. అవకాశముంటే, ఒక బుజ్జి పువ్వు కూడా పూసి, లోకాన్ని మురిపిస్తుంది. ఆఖరికి, ఏ గోమాతకో ఆహారంగా తనను తాను సమర్పించుకొని, ధన్యమౌతుంది. గడ్డిపరక తేలికయిన పదార్థమే కానీ, తేలిక చేయవలసిన పదార్థం కాదు. సృష్టిలో ఏ పదార్థమూ నిష్ప్రయోజనం కాదు. ప్రయోజనం అనేది వాడుకొనే వారిని బట్టి కూడా ఉంటుంది.
మరొక విశేషం గమనించు. గడ్డిపోచను ఆవు ఆహారంగా తీసుకొంటే, ఆ ఆహారం ఆవు శరీరంలో పవిత్రమైన గోక్షీరంగా పరిణమించగలదు. అవునా? గోక్షీరాన్ని పాముకు ఆహారంగా పోస్తే, ఆ ఆహారం పాముశరీరంలో భయంకరమైన విషంగా మారుతున్నది. అలాంటప్పుడు, గంగి గోవు పాలు ఘనమైనవనీ, పచ్చగడ్డి పనికిమాలినదనీ భావించటం భావ్యంగా ఉంటుందా?
ఈ సృష్టిలో ప్రతి పదార్థమూ ప్రత్యేకమే, విశేషమే! ప్రతి ప్రక్రియా ఈశ్వర విలాసమే. ఈశ్వర విలాసం మనకు పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు. కారణం, అందుకు మనకున్న గ్రహణశక్తి సరిపోదు. తన మేధ పరిమితి ఏమిటో తెలియని అమాయకుడు మాత్రమే తనకు అన్నీ తెలుసుననీ,తను సర్వమూ తెలుసుకోగలననీ మిడిసి పడుతుంటాడు. అందుకేఅలాంటి వారి జ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. అది సంపూర్ణ జ్ఞానం కాదు. సర్వజ్ఞత్వ లక్షణం కలవాడు సాంబమూర్తి ఒక్కడే!’ అని గురువు సమాధానం చెప్పారు.
– ఎం. మారుతి శాస్త్రి