గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు.. గ్రేటర్ నగరానికే వన్నె తెచ్చాయి. వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్‌హౌస్, ఏసీ జిమ్, స్విమ్మింగ్‌పూల్ వంటి సౌకర్యాల్ని సక్రమంగా నిర్వహించడం కత్తిమీద సామే. అయితే నగరానికి చెందిన కొన్ని నిర్మాణ సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా నిర్వహిస్తే.. మరికొన్నేమో.. సదుపాయాల నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. నిర్వహణ పక్కాగా ఉండటం వల్ల ఫ్లాట్ల రేట్లు రెట్టింపవుతున్నాయి.
నెలసరి నిర్వహణ సక్రమంగా ఉంటేనే ఫ్లాటు విలువ పెరుగుతుంది. క్లబ్‌హౌస్‌లోని జిమ్, టెన్నిస్ వంటి సదుపాయాల కోసం విడిగా రుసుముల్ని చెల్లించాలి. హౌస్‌కీపింగ్, భద్రత, పార్కింగ్, కామన్ ఏరియాలు, విద్యుత్తు, లిఫ్టులు, తాగునీరు వంటి నిర్వహణ పనుల్ని నిర్వహణ సంస్థలే నిర్వహిస్తాయి.
ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు, పెద్దలు, మహిళలు, అందరికీ కావల్సిన అన్ని సౌకర్యాల్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. 2006లో జీవో నం.86 అందుబాటులోకి వచ్చాక నగరంలో ఆకాశహర్మ్యాల సంఖ్య పెరిగింది. ఇవి పూర్తవ్వడానికి మరో మూడేళ్లు పట్టింది.
కొన్ని ప్రాజెక్టుల్లో ఆయా సంస్థలు సదుపాయాలు, సౌకర్యాల నిర్వహణను చూసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నగరంలో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవల్ని పక్కగా అందించే సంస్థలు పెద్దగా లేకపోవడమే. అయితే ఇలాంటి సంస్థలకు నిర్వహణ బాధ్యతను అప్పచెబితే నివాసితులపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది బిల్డర్లే నిర్వహణ బాధ్యతల్ని చేపట్టారు.


