
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది.
కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి
జాతీయ పురస్కార గ్రహీతగా..
‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్‌ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు.
వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్‌గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్‌కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్‌తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు.
(చదవండి: స్త్రీ వాణి రాణించింది..!)