ద్వివిధుడి వధ

Dvivida Killed By Balarama - Sakshi

భక్త విజయం

ద్వివిధుడనే వానరుడు నరకాసురుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవాడు. కృష్ణుడి చేతిలో నరకుడు హతమైపోయాక, తన మిత్రుణ్ణి చంపిన కృష్ణుడి మీద, అతడి పరివారమైన యాదవుల మీద పగబట్టాడు. కృష్ణుడి ఆనర్త దేశంలో అడపా దడపా నానా బీభత్సం సృష్టించేవాడు. పొలాల మీద పడి పంటలు నాశనం చేసేవాడు. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టేవాడు. ఉద్యానవనాల్లోకి చొరబడి వాటిని ధ్వంసం చేసేవాడు. ద్వారక మీదకు రాళ్లు రువ్వేవాడు. ఆలమందలను చెదరగొట్టేవాడు. ఇలా నానా ఆగడం చేసి, చెట్ల మీద నుంచి గెంతుతూ ఎవరకీ దొరక్కుండా క్షణాల్లో పారిపోయేవాడు.

ఇలా ఉండగా, ఒకసారి బలరాముడు ప్రియురాళ్లతోను, వాళ్ల చెలికత్తెలతోను కలసి రైవత పర్వతం మీదకు వనవిహారానికి వెళ్లాడు. సముద్రం మీద నుంచి వీచే చల్లగాలి హాయిగొలుపుతుండగా, అందరూ కొండ మీద చదునైన చోట కూర్చుని సేదదీరసాగారు. బలరాముడు హాయిగా మధువు తాగుతూ, ఆ తన్మయత్వంలో పాటలు పాడసాగాడు. బలరాముడి సంగీతానికి అనుగుణంగా ప్రియురాళ్లు నాట్యం చేయసాగారు.

వారి వినోద కాలక్షేపం పాన గానాలతో ఆహ్లాదభరితంగా సాగుతుండగా, ఎక్కడి నుంచి చూశాడో ద్వివిధుడు చెట్ల మీద నుంచి దూకుతూ రైవత పర్వతం మీదకు చేరుకున్నాడు. కొండ మీదనున్న చెట్లపై వేలాడుతూ, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ కోతిచేష్టలు మొదలుపెట్టాడు. చెట్లను బలంగా ఊపుతూ, వాటికి ఉన్న పండ్లను దులిపేశాడు. పూలను రాల్చేశాడు. ఆడవాళ్ల ఎదుటికొచ్చి చిందులు వేశాడు. వాళ్లు అతణ్ణి వింతగా చూశారు. కొందరు నవ్వారు. ఇంత జరుగుతున్నా బలరాముడు తన మైకంలో, తన లోకంలో తానుండి హాయిగా గానాలాపన సాగిస్తూనే ఉన్నాడు.

తాను ఎంత ఆగడం చేస్తున్నా, బలరాముడు చలించకపోవడంతో ద్వివిధుడు చిర్రెత్తిపోయాడు. ఏకంగా బలరాముడి ఎదుటికే వచ్చి, జబ్బలు చరుచుకుని రంకెలు వేశాడు. కాళ్లు నేలకు తాటిస్తూ, కయ్యానికి కాలు దువ్వాడు. ఈ చేష్టలను బలరాముడు అరమూత కళ్లతో ఒకసారి చూసి, తన మానాన పాడుకోసాగాడు. ద్వివిధుడు మరింతగా కోపంతో పెట్రేగి ఊగిపోయాడు. పళ్లు పటపట కొరికాడు. బలరాముడి ముందున్న మధుపాత్రను పైకెత్తి నేలకేసి కొట్టాడు. మధుపాత్ర పగిలి, మధువు నేలపాలైంది. ఏదో ఘనకార్యం చేసినట్టు వికటాట్టహాసం చేశాడు. రెప్పలెత్తి చూశాడు బలరాముడు. మామూలు కోతిని అదిలించినట్లుగానే, పక్కనే ఉన్న ఒక చిన్నరాయిని తీసుకుని అదిలించాడు.

బలరాముడి ధోరణికి ద్వివిధుడు బాగా రెచ్చిపోయాడు. ఈసారి ఆడవాళ్ల గుంపులోకి దూకాడు. వాళ్లను మిర్రి మిర్రి చూస్తూ కిచకిచలాడాడు. బెదిరిస్తున్నట్లుగా పైపైకి వచ్చాడు. గంతులు వేశాడు. వాళ్లు ఇదంతా వినోదంగా అనుకుంటున్నంతలోనే ఒక్కసారిగా వాళ్ల జడలు గుంజి, చీరలు చించేశాడు. మీదపడి దొరికిన వాళ్లను దొరికినట్లుగా గోళ్లతో రక్కాడు. వానరం ఆగడం మితిమీరడంతో వాళ్లంతా హాహాకారాలు చేస్తూ, ఏడుపు మొదలుపెట్టారు.

అప్పుడు వాణ్ణి తేరిపార చూశాడు బలరాముడు. దేశంలో ఆగడాలు సాగిస్తున్న వానరుడు వీడేనని గుర్తించాడు. ఆడవాళ్ల మీద ఆగడం సాగిస్తుండటంతో ఏమాత్రం సహించలేకపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా, ఒక చేత నాగలి, మరో చేత ముసలం పట్టుకుని పైకి లేచాడు. బలరాముడు ఆయుధాలతో పైకి లేవడం గమనించిన ద్వివిధుడు, ఒక భారీ గుగ్గిలం చెట్టును పెరికి, బలరాముడి మీదకు విసిరాడు. ఎడమచేత్తో దాన్ని అడ్డుకున్నాడు బలరాముడు. ఒక మద్దిచెట్టును విసిరాడు. దాన్ని ముసలంతో నేలకూల్చేశాడు బలరాముడు.

ఒక్క ఊపుతో ముందుకు దూసుకొచ్చాడు ద్వివిధుడు. ముసలంతో చాచిపెట్టి వాడి నెత్తి మీద కొట్టాడు బలరాముడు. వాడి తల పగిలి నెత్తురోడసాగింది. అయినా లక్ష్యపెట్టలేదు వాడు. భయంకరంగా పెడబొబ్బలు పెడుతూ, చెట్టు మీద చెట్టు పెరికి బలరాముడి మీదకు దండెత్తాడు. చుట్టు పక్కల చెట్లన్నీ ఖాళీ అయిపోయాక, పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి ఊపిరాడనివ్వకుండా చేశాడు. అంతటితో ఆగకుండా బలరాముడి మీదకు దూకి, నేలకేసి అదిమి పిడిగుద్దులు కురిపించాడు. 

ఉపేక్షిస్తున్న కొద్దీ వానరం రెచ్చిపోతుండటంతో బలరాముడికి కోపం తలకెక్కింది. ఆగ్రహంతో కళ్లెర్రచేసి, కాలసర్పంలా బుసకొట్టాడు. ద్వివిధుడి మీద పిడుగుల్లా పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ కచాకచీ బాహాబాహీ ఒకరితో ఒకరు తలపడ్డారు. రైవతపర్వతం అదిరిపోయేలా రంకెలు వేస్తూ భీకరంగా ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు నేలపైకి పడదోసుకుంటూ యుద్ధం సాగించారు. ఒకరినొకరు తన్నుకుంటూ, చరుచుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ కలియబడ్డారు. అదను చూసుకుని బలరాముడు ద్వివిధుణ్ణి ఒడుపుగా పట్టుకుని, నేలకేసి తోశాడు.

పైకి లేచేలోగానే అతడిపై కలబడ్డాడు. అతడి గుండెల మీద కూర్చుని, లేవనివ్వకుండా అతణ్ణి కట్టడి చేశాడు. ప్రతిఘటించేలోపే వ్యవధినివ్వకుండా పిడిగుద్దులు కురిపించాడు. గుండెల మీద పిడుగులాంటి పోటు పిడికిటితో పొడిచాడు. దెబ్బకు నెత్తురు కక్కుకుంటూ, భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు ద్వివిధుడు. బలరాముడి చేతిలో వానరం హతమవడంతో అతడితో కొండ మీదకు వచ్చిన ఆడవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. బలరాముడిని పొగుడుతూ ఆనందంతో పాటలు పాడారు. యుద్ధంలో అలసిపోయిన బలరాముడికి సపర్యలు చేశారు. కొండ మీద కాసేపు సేదదీరాక, తిరిగి ద్వారకకు మళ్లారు. -సాంఖ్యాయన
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top