కోవిడ్‌ లోనూ క్రిస్మస్‌ ఆనందం!!

Doctor TA Prabhu Kiran Jesus Christ Suvartha On Christmas - Sakshi

లోకపరమైన అభ్యున్నతిని ఆశీర్వాదంగా భావించవద్దు. అవసరాలకు మించిన డబ్బు, సంపదలు, గిడ్డంగుల నిండా ఆహారముండటమే గొప్ప జీవితమైతే, అత్యంత హేయమైన సంస్కృతులకు నిలయంగా ఉన్న బబులోను సామ్రాజ్యంలో కూడా అవన్నీ ఉన్నాయని, దేవుడు తన ప్రజల జీవితాల్లో కోరుకునేది ధర్మశాస్త్రబద్ధమైన నీతి, నియమాలు, మౌలిక విలువలు, దైవభయంతో కూడిన పరిశుద్ధజీవితమని యెషయాప్రవక్త హెచ్చరించాడు (యెషయా 1:2–31). మితిమీరిన సంపదలు, అహంకారంతో, అంధత్వంలో కూరుకుపోయిన ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికలు చెవికెక్కలేదు, వాళ్ళ జీవితాలు మారలేదు. అనూహ్యంగా, బబులోను సైన్యాలు చేసిన దాడిలో ఒక్క రోజులోనే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి.

తాము పరలోకపు రాజధానిగా భావించిన యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు ధ్వంసం చేసి పాడుదిబ్బగా మార్చారు, సుందరమైన ఆలయాన్ని కొల్లగొట్టి, దానిలోని బంగారాన్నంతా దోచుకుపోయారు. తాము తిరుగులేని శూరులము, మేధావులమనుకున్న చాలామందిని బబులోనుకు బానిసలుగా చెరపట్టుకొని వెళ్లారు. వాళ్ళ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రకాశవంతమైన వాళ్ళ దేశం కాస్తా చీకటికూపంగా మారింది. అయితే దేవుడు వాళ్ళను 70 ఏళ్ళ చెర తర్వాత మళ్ళీ వెనక్కు తెచ్చినా, పూర్వవైభవం మాత్రం వాళ్లకు మళ్ళీ దక్కలేదు. ఈ సారి రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన వారిని యెరూషలేములోనే మరింత అణిచివేసింది.

అంధకారంలో ఉన్నవాళ్లు వెలుగు కోసం, ఆపదలో కూరుకుపోయినవాళ్లు సహాయకుని కోసం, బానిసత్వం లో మగ్గిన ప్రజలు స్వాతంత్య్రం, ఆత్మగౌరవాన్ని ప్రసాదించే విమోచకుని కోసం ఎదురు చూస్తారు. అందుకే బాధిత ప్రజల ఆక్రందనలకు జవాబుగా మానవచరిత్రనంతటినీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుశకం అనే రెండు భాగాలుగా విడదీస్తూ, రెండువేల ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగును, కృపామయుడైన సహాయకుణ్ణి, మహా విమోచకుణ్ణి, ‘దేవుని రాజ్యం’ అనే ఒక నవలోకనిర్మాతను లోకం కనుగొంది. దేవుని అద్వితీయ కుమారుడైన దైవలోకనిత్యపాలకుడే, ‘యేసుక్రీస్తు’ నామధారిగా, అతిసామాన్యమైన మానవరూపిగా, బేత్లెహేమనే కుగ్రామంలో, ఒక పశువుల శాలలో శిశువుగా ఈ భూగ్రహంపైన పాదం మోపాడు.

మెస్సీయాగా దైవకుమారుడు ఈ లోకానికి వస్తాడని బైబిల్‌ చెబితే, మేధావులు, సంపన్నులు, పాలకుల భవంతుల్లో ఆయన జననం, ఆగమనం కోసం ఎదురుచూసిన ఆత్మీయ అజ్ఞానులైన యూదులు, ఒక నిరుపేదగా, సాదాసీదాగా జన్మించిన రక్షకుని గుర్తించలేకపోయారు. అయితే వాళ్ళు పోగొట్టుకున్నదే, సర్వలోకానికి మహా భాగ్యమైంది. ఈసారి ప్రభువు యూదులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి వరప్రదాత, సార్వజనిక విమోచకుడయ్యాడు. కటిక చీకట్లో కూడా తప్పక ఒక కాంతిరేఖ ఉద్భవిస్తుందన్న ‘ఆశల్ని’ రేకెత్తిస్తూ, విమోచకుని రాకను మరోసారి గుర్తు చేస్తూ ఈ కోవిడ్‌–19 విపత్తులో ‘క్రిస్మస్‌’ మళ్ళీ రానే వచ్చింది. దీన్ని డబ్బు దండగ చేసుకునే పండుగలా కాదు, ఆడంబరాల కోసం కాదు, దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తుచేసే ఒక శుభప్రదమైన ఘడియగా గుర్తించి పదిమందికీ సాయం చేసి దేవుని ప్రేమను ప్రకటిద్దాం, ఆత్మీయానందాన్ని పొందుదాం, దేవుని ప్రేమతత్వాన్ని మనసారా అనుభవిద్దాం. 
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top