ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు

Diabetes Symptoms And Simple Remedies And Tips In Telugu - Sakshi

ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్‌ వ్యాధి మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు నూనెలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది ఇన్సులిన్‌ నిరోధకత, మధుమేహానికి దారితీస్తుంది.

లక్షణాలు
తరచు మూత్ర విసర్జన, పొడి గొంతు లేదా తరచు దాహం వెయ్యడం, కంటి చూపు మందగించడం, కారణం లేకుండా ఆకస్మికంగా బరువు పెరగటం లేదా తగ్గడం, ఒక్కసారిగా నీరసంగా లేదా అలసటగా అనిపించడం, అధికంగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తే సుగర్‌ వ్యాధికి సంకేతాలుగా గుర్తించి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ప్రీ డయాబెటిక్‌ అంటే బార్డర్‌లో ఉన్నట్లయితే కొన్ని ఎక్సర్‌సైజులు, ఆహార నియమాలు పాటించడం ద్వారా షుగర్‌ వ్యాధిని కొంతకాలంపాటు వాయిదా వేయవచ్చు.

మధుమేహం ఉన్న వ్యక్తులకు నడక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే రాత్రి వేళల్లో నడిస్తే వారికి మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఆహారాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్‌. ఆ వివరాలు తెలుసుకుందాం.

ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ భారీగా తగ్గుతాయని గుర్తించారు. ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్‌ షుగర్‌ స్థాయులు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

టైప్‌ 2 డయాబెటిస్‌ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ పరిశోధన ప్రకారం.. అలా నడిచిన వారి బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పరిశోధకులు కొలిచారు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్‌ పేషెంట్ల రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలకు మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ 12 శాతం అధికంగా తగ్గిపోయాయి.

ఇక రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్‌ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు తెలిపారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top