Diary Writing Benefits: ఇలా చేస్తే చికాకు దానంతట అదే దూరమవుతుంది..!

Daily Diary Writing Habit May Get Rid Of Irritation Says Studies - Sakshi

డైలీ డైరీ

పగలు జరిగిన విషయాలను మెదడులో నిల్వ చేసుకోవడం మంచిదా? కాగితం మీద పెట్టడం మంచిదా? తీపి జ్ఞాపకాలైతే మెదడు సంతోషంగానే నిక్షిప్తం చేసుకుంటుంది. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మది మురిసిపోతుంటుంది. అలా కాకుండా ఆ రోజు చేసిన పనులు, చికాకులు చిరాకు పెడుతుంటే మాత్రం వాటిని మెదడులో మోయాల్సిన పని లేదు. బుర్ర మీద అంత బరువు పెట్టవద్దు, ఏ రోజుకారోజు తేలిక పరుచుకోవాలి. కందిరీగల్లా తిరుగుతున్న విషయాలన్నింటినీ బుర్రలో నుంచి ఒక కాగితం మీదకు బదలాయించండి. బ్రెయిన్‌ డంప్‌ చేయడం అన్నమాట. చికాకు దానంతట అదే దూరమవుతుంది. మెదుడు హాయిగా విశ్రాంతిలోకి వెళ్తుంది. మనమూ మంచి నిద్రలోకి జారుకుంటాం. ఉదయం తాజాగా రోజును మొదలుపెట్టవచ్చు. అలా చేయనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?

మంచి–చెడుల పట్టిక 
రోజంతా పని చేసిన తర్వాత దేహం అలసిపోయి ఉంటుంది. కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద పని చేసిన వాళ్లకు ఆ పని ఆపేసిన తర్వాత కనీసం రెండు గంటల సేపు నిద్రరాదు. పదకొండుకో, పన్నెండుకో నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ నిద్రలో మెదడు విశ్రాంతి దశకు చేరదు. పగలు జరిగిన పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ లోగా తెల్లవారు జామున మూడింటికి మెలకువ వచ్చేస్తుంది. ఇక మెదడు ఆ రోజు చేయాల్సిన పనులను గుర్తు చేస్తుంటుంది. ఎలా చేయాలో సూచనలు చేస్తుంటుంది. మెదడు అప్పటికి రిలాక్స్‌ అయి తెల్లవారు జామున  విశ్రాంతికి సిద్ధమవుతుంటుంది.

ముంచుకు వచ్చే నిద్రను వదిలించుకుని బలవంతంగా రోజు మొదలు పెట్టినా సరే... ఆఫీస్‌లో పనిగంటల్లో మెదడు మొరాయిస్తుంటుంది. ఇన్ని అసౌకర్యాలను సున్నితంగా తుడిచివేసే పరిష్కారమే బ్రెయిన్‌ డంప్‌. వెల్‌బీయింగ్‌ గురించి యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నిర్వహించిన ఓ సదస్సులో ఒక సైంటిస్ట్‌ ఈ అంశం మీదనే పేపర్‌ ప్రెజెంట్‌ చేశారు. బ్రెయిన్‌ డంప్‌ అనే పదం కూడా సైంటిస్ట్‌ సూచించినదే. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పేపర్‌ మీద ఆ రోజు జరిగిన మంచి పనులు, సంతోషాన్నిచ్చిన విషయాలు రాసుకోవాలి.

అలాగే బాధ కలిగించిన విషయాలను ఒక కేటగిరీలో, ఒత్తిడి, చికాకు  కలిగించిన వాటిని ఒక కేటగిరీగానూ, వాటికి పరిష్కారాలను మరో కాలమ్‌లోనూ రాసుకోవాలి. వాటన్నింటినీ ఒకసారి చూసుకుని రేపటి రోజున చేయాల్సిన పనులను కూడా నోట్‌ చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... డైరీ రాసుకున్నట్లేనన్నమాట. ఇలా రాయడం వల్ల మెదడు తేలికపడుతుంది. స్మార్ట్‌ ఫోన్‌లో వచ్చి పడిన మంచి–చెడు, అవసరం ఉన్న– అవసరం లేని మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను వర్గీకరించుకుని డిలీట్‌ చేస్తూ ఫోన్‌ మెమరీ బరువు తగ్గించుకున్నట్లే ఇది కూడా.
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top