
దేశీయంగా రైతు సంఘాల వ్యతిరేకత
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని అంచనా. అందులో డెయిరీ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) ఉత్పత్తులపై నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డెయిరీ అనేది లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న సున్నితమైన పరిశ్రమ. కాబట్టి ఈ డీల్ నుంచి పాడి పరిశ్రమను మినహాయించడానికి యూఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్నకు భారత్‌లో అధిక మార్కెట్‌కు అవకాశం ఉన్నందున అమెరికా ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు సమాచారం.
వాణిజ్య ఒప్పందం నుంచి డెయిరీ పరిశ్రమను దూరంగా ఉంచాలన్న భారత్ డిమాండ్‌పై అమెరికా కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సున్నితత్వాన్ని యూఎస్ అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. పాడి పరిశ్రమ కేవలం వాణిజ్య వ్యవహారం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు జీవనాడిగా ఉంటోందని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సబ్సిడీతో విదేశీ పాల ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు యూస్ ప్రయత్నించింది. దాంతో వ్యతిరేకత నెలకొంది. ఈ డీల్ ముందుకెళితే రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దాన్ని నివారించడానికి బీటీఏ నుంచి డెయిరీని మినహాయించడం ఎంతో సహాయపడుతుంది.
జన్యుమార్పిడి పంటలు
ట్రేడ్ డీల్ చర్చల నుంచి డెయిరీకి ఉపశమనం కలగబోతున్నప్పటికీ, అమెరికా తన జన్యుమార్పిడి పంటలను ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్న పంట ఉత్పత్తులను భారత్‌లోకి ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. యూఎస్ సోయాబీన్, మొక్కజొన్న ఎగుమతుల్లో ఎక్కువ భాగం జన్యుపరంగా మార్పు చెందినవే. కానీ భారతీయ నిబంధనలు ప్రస్తుతం జీఎం ఆహార పంటల దిగుమతిని నిషేధించాయి. ఇది చర్చల్లో ప్రతిష్టంభనను సృష్టిస్తుంది. కొన్ని పండ్లు, కూరగాయలు, కాయలపై రాయితీ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుత ఫ్రేమవర్క్ కింద జీఎం సోయా లేదా మొక్కజొన్న దిగుమతులను అనుమతించడానికి స్పష్టమైన చట్టపరమైన లేదా లాజిస్టిక్ అవకాశాలు లేవు.
చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో..
గతంలో అమెరికన్ సోయాబీన్స్, మొక్కజొన్నలను అత్యధికంగా కొనుగోలు చేసిన చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ సోయాబీన్ ఎగుమతుల్లో 55 శాతం, మొక్కజొన్న ఎగుమతుల్లో 26 శాతం చైనా వాటా కలిగి ఉంది. పరస్పర టారిఫ్‌ల వల్ల ఆ మార్కెట్ కుంచించుకుపోవడంతో యూఎస్ తన వ్యవసాయ ఎగుమతులను వైవిధ్యపరచాలని చూస్తోంది. దాంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది.
పెరుగుతున్న ఎగుమతులు
అమెరికాకు భారత వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయి. 2024-25లో ఇవి 6.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశానికి యూఎస్ వ్యవసాయ ఎగుమతులు 2023లో 373 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు మొత్తం 86.51 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా నుంచి దిగుమతులు 45.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దాంతో భారత్‌లో మరింత వాణిజ్యం సాగించేందుకు యూఎస్ పావులు కదుపుతోంది.
ఇదీ చదవండి: ఉద్యోగిని తొలగించారు సరే.. ఆధారాలేవి?
జీఎం పంటలపై వ్యతిరేకత
జీఎం పంట దిగుమతులపై భారత్‌లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇరు దేశాల వాణిజ్య చర్చల్లో భాగంగా జీఎం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుండడంపట్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం ముసుగులో జీఎం సోయాబీన్, మొక్కజొన్నలను భారత్‌లోకి నెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తెలియజేస్తున్నాయి.