
మరెన్నో దేశాలతో సంప్రదింపులు
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
అమెరికా సహా పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం చర్చలు కొనసాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూజిలాండ్, ఒమన్, పెరూ, చిలీ, ఐరోపా సమాఖ్య (ఈయూ) ఇందులో ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్ సైతం భారత్‌తో వాణిజ్య ఒప్పందాల పట్ల సుముఖంగా ఉన్నట్టు గోయల్ చెప్పారు. ఆగస్ట్‌లో ఆర్మీనియా, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యాతో కూడిన యూరేషియన్ ఎకనమిక్ యూనియన్ (ఈఏఈయూ) భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులకు వీలు గా షరతుల కార్యాచరణపై సంతకం చేయడం గమనార్హం. నోయిడాలో జరిగిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సందర్భంగా గోయల్ దీనిపై మాట్లాడారు.
1 నుంచి ఈఎఫ్‌టీఏతో ఒప్పందం అమలు
నాలుగు ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ)తో కుదిరిన వాణిజ్య, ఆర్థిక ఒప్పందం (టెపా) అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని గోయల్ చెప్పారు. ఈ ఒప్పందం భారత వర్తకులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. దీని కింద 15 ఏళ్లలో భారత్‌కు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నట్టు పేర్కొన్నారు. గత వారం మంత్రి గోయల్ ఆధ్వర్యంలో అధికారిక బృందం చర్చల కోసం న్యూయార్క్‌కు వెళ్లి రావడం తెలిసిందే. అక్టోబర్–నవంబర్ నాటికి మొదటి దశ ఒప్పందం కోసం రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు దశల చర్చలు నడిచాయి.
2024–25లో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులతో వరుసగా నాలుగో ఏడాది భారత్‌కు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. రెండు దేశాల మధ్య 132 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం, ముఖ్యంగా భారత్‌కు ప్రయోజనం కలిగించనుంది. రష్యాపై చమురు కొంటుందన్న కారణంతో విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌లు తొలగిపోతాయి.
ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి