భారత్‌-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా? | India and the US are on the brink of finalizing a significant interim trade deal | Sakshi
Sakshi News home page

భారత్‌-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా?

Jul 1 2025 3:06 PM | Updated on Jul 1 2025 3:28 PM

India and the US are on the brink of finalizing a significant interim trade deal

అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఈ వారంలోనే ఖరారు చేసేందుకు భారత్ చొరవ చూపుతోంది. ఈమేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ డీల్‌ పూర్తయితే ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికా-ఇండియా మధ్య కుదిరే తొలి కీలక ఒప్పందం అవుతుంది. ఇప్పటికే యూఎస్‌ చైనాతో వాణిజ్యం ఒప్పందంపై ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు  వార్తలొస్తున్నాయి. ఇండియా- యూఎస్ మధ్య చర్చలు కీలక దశలో ఉన్నందున భారత సంధానకర్తలు జూన్ 27న ముగిసిన రెండు రోజుల పర్యటనను మరింతకాలం పొడిగించినట్లు తెలుస్తుంది.

భారత వస్తువులపై అమెరికా 26% పరస్పర సుంకం విధించనున్న నేపథ్యంలో జులై 9 లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు పక్షాలు చూస్తున్నాయి. ఈ సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్‌లో మొదట ప్రకటించి 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే ఒప్పందంపై అనేక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ కీలకంగా కొన్నింటిపై విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. వ్యవసాయం, జన్యుమార్పిడి (జీఎం) పంటలు, పాల ఉత్పత్తుల్లో మార్కెట్ యాక్సెస్ సహా కొన్ని సున్నితమైన రంగాలపై రాజీపడే ప్రసక్తే లేదని భారత అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ‘ఇండియాలో సమయం విలువ తెలియని వారే ఎక్కువ’

ఈ అంశాలు భారతీయ రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. వీరిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. భారత్‌కు భారీ నష్టం వాటిల్లే పనులు అధికారులు చేయబోరని, ఈ అంశాల్లో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జన్యుమార్పిడి పంటలు, పశువుల దాణా, పాడి, వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిలో భారత మరింత వెసులుబాటు కల్పించాలని యూఎస్‌ ఒత్తిడి తెస్తోంది. పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోకెమికల్స్, వైన్‌లపై సుంకాలను తగ్గించాలని అమెరికా కోరుతోంది.

లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు ఉపశమనం

మరోవైపు టెక్స్‌టైల్స్‌, లెదర్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, కెమికల్స్, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటి వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం రాయితీల కోసం భారత్ చర్చలు జరుపుతోంది. ట్రంప్ ప్రకటించిన అదనపు 26% సుంకాల నుంచి పూర్తి మినహాయింపు కోసం భారతదేశం ఒత్తిడి తెస్తోంది. అయినప్పటికీ బేస్‌లైన్‌ 10% సుంకం అమలులో ఉంది. విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)లో భాగంగా తొలి విడత బహుళ రంగాలను కవర్ చేయాలని భావిస్తున్నారు. మరింత వివరణాత్మక చర్చలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో మధ్యంతర ఒప్పందాన్ని దశలవారీగా రూపొందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement