
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కుదుర్చుకోవాలని, అందుకోసం చర్చలను త్వరగా ముగించాలని భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించుకున్నా యి. ప్రధాని మోదీ గురువారం 27 దేశాల ఈయూ కూటమి ముఖ్యనేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
అమెరికా భారీ టారిఫ్‌ల నేపథ్యంలో నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం పాత్ర కీలకమని మోదీ, ఆంటోనియో కోస్టా, ఉర్సు లా వాన్ డెర్ లెయన్ నిర్ణయానికొచ్చారు. త్వరలో ఇండియాలో జరుగను న్న ఇండియా– ఈయూ సదస్సు గురించి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆంటోనియో కోస్టా, ఉర్సులాను మోదీ ఆహ్వానించారు.