
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.
నిధి నిజానికి హైదరాబాద్‌లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.
తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.
తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.
పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.
ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!
బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్‌బుక్‌లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.
కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట!