సూపర్‌ మామ్‌ ముందు.. కాప్‌ ఎంత? | CBI SP Nirmala Devi Special Story In Family | Sakshi
Sakshi News home page

ఎస్పీ నిర్మలాదేవి డాటర్‌ ఆఫ్‌ లక్ష్మీసుందరం

Nov 17 2020 9:24 AM | Updated on Nov 17 2020 10:22 AM

CBI SP Nirmala Devi Special Story In Family - Sakshi

సీబీఐలో పెద్ద ఆఫీసర్‌ నిర్మల. డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌ కాప్‌. ‘కావచ్చు కానీ.. నేనైతే డాటర్‌ ఆఫ్‌ లక్ష్మీ సుందరం’ అంటారు ఆమె.  అదే ఆమె కోరుకునే పెద్ద హోదా.. గౌరవం, గుర్తింపు.. అన్నీ!  ‘‘మా అమ్మే నన్నింత చేసింది. ఆ సూపర్‌ మామ్‌ ముందు..ఈ సూపర్‌ కాప్‌ ఎంత? అని.. నవ్వుతూ అంటున్నారు నిర్మల. 

‘‘మా అమ్మ సూపర్‌ మామ్‌. అంతేకాదు సూపర్‌ ఉమన్‌ కూడా. నా ఈ యూనిఫామ్‌ వెనుక మా అమ్మ పోరాటం ఉంది. నన్ను ఇలా తీర్చిదిద్దే క్రమంలో ఆమె ఎన్నో సామాజిక అడ్డంకులను ఛేదించింది. తనకోసం తను కూడా అమ్మమ్మ తాతయ్యలతో పోరాడింది. ఉన్నత చదువులు చదవాలని ఎంతో ఆశ పడింది. కానీ అప్పట్లో మా అమ్మమ్మ, తాతయ్య సామాజిక ఒత్తిడికి తలొగ్గి అమ్మకు పదిహేడేళ్లకే పెళ్లి చేశారు. మా నాన్న రైతు. నేను పుట్టిన తర్వాత ఏడాదిన్నరకే నాన్న ఈ లోకాన్ని వదిలాడు. ఊహ తెలిసేటప్పటికి నాకు తెలిసిన మా కుటుంబం... అమ్మ, అన్నయ్య, నేను. అమ్మ తన గురించి తాను ఎలా కలలు కన్నదో అలా నన్ను తీర్చిదిద్దింది. యూపీఎస్సీ పరీక్షను నేను ఒకటి, రెండు కాదు... నాలుగో ప్రయత్నంలో పూర్తి చేశాను. యూనిఫామ్‌ నా ఒంటిమీదకు వచ్చి పద్నాలుగేళ్లయింది’’ అని తల్లి లక్ష్మీ సుందరంను గుర్తు చేసుకున్నారు ఐపీఎస్‌ ఆఫీసర్‌ నిర్మలాదేవి.

రాత్రిళ్లలో పొలానికి నీరు
నిర్మలాదేవిది కోయంబత్తూరులోని అలందురై గ్రామం. ఇప్పుడామె నాగపూర్‌లో సీబీఐ విభాగంలో ఎస్పీ. ‘‘తల్లిని తలుచుకోవడానికి మదర్స్‌డే వంటి ఏడాదికి ఒక రోజు కాదు, మా అమ్మ మాకు రోజూ తలుచుకోవాల్సినన్ని జ్ఞాపకాలను మిగిల్చింది’’ అన్నారామె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. ‘‘అమ్మ తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటి పనులు, వంట పూర్తి చేసి అన్నయ్యను, నన్ను స్కూల్‌కి సిద్ధం చేసేది. ఆ తర్వాత తాను చెరకు పొలానికి వెళ్లి పని చేసేది. హోమ్‌వర్క్‌ చేయడంలో మాకు సహాయం చేసేది. రాత్రి ఎప్పుడు పడుకునేదో తెలియదు. మళ్లీ మేము నిద్రలేచేటప్పటికి పనుల్లో కనిపించేది. మాకు గ్రామాల్లో రోజంతా కరెంటు కష్టం. మోటార్లు పని చేయడానికి అనువుగా మూడు ఫేజ్‌ల సప్లయ్‌ రోజులో కొద్ది గంటలు మాత్రమే ఉండేది. కొద్ది రోజులు త్రీ ఫేజ్‌ కరెంటు రాత్రిళ్లు ఇచ్చేవారు. అలాంటప్పుడు పొలానికి నీరు పెట్టడానికి రాత్రి పూట వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ చేస్తూనే మా ఊరి మహిళలకు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయడంలో మార్గదర్శనం చేసేది. దరఖాస్తు ఫారాలు నింపి పెట్టేది. తొంబైలలో ట్రాక్టర్‌ నడిపిన సూపర్‌ ఉమన్‌ మా అమ్మ. అప్పట్లో మాకు అ పనులన్నీ అవసరమై చేసినవే. సరదాగా ప్రతి సంఘటనను ఫొటో తీసి పెట్టుకోవడం తెలియదు. ఇప్పట్లాగ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న రోజులు కావవి. 

పది మందికి న్యాయం
నాకు డిగ్రీ పూర్తవగానే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అమ్మకు ఆర్థికంగా సహాయంగా నిలవగలిగాను. అన్నయ్య డిగ్రీ చేశాడు, కానీ అమ్మకు సహాయంగా వ్యవసాయంలోనే స్థిరపడ్డాడు. అమ్మ మాకు చిన్నప్పటి నుంచి పదిమందికి సహాయం చేసే ఉద్యోగం చేయమని చెప్తుండేది. అన్యాయానికి గురయ్యి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కేవాళ్లు, ఇంటి స్థలం ఇప్పించమని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసేవాళ్లు కొల్లలు. ఆ సర్వీసులు ప్రజలకు నేరుగా సహాయం చేయగలిగిన రంగాలనేది అమ్మ. నా బ్యాంకు ఉద్యోగం అమ్మకు సంతృప్తినివ్వలేదు. దాంతో యూపీఎస్సీ మీద దృష్టి పెట్టాను. ఉద్యోగం చేస్తూ రాసిన పరీక్ష ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత సొంతంగా లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని ప్రిపేరవుతున్న సమయంలో... కోయంబత్తూరులో ఉచితంగా సివిల్స్‌కి కోచింగ్‌ ఇస్తున్న విద్యాసంస్థ వివరాలను వార్తా పత్రికలో గమనించింది అమ్మ. ఆ విద్యాసంస్థలో చేరాను. పుస్తకాలన్నీ కొనడం కష్టమయ్యేది.

దాంతో మా బ్యాచ్‌మేట్‌ కొన్న పుస్తకాలను ఫొటోకాపీలు తీసుకుని చదువుకున్నాను. నాలుగో ప్రయత్నంలో 272వ ర్యాంకు వచ్చింది. అలా 2008లో ఈ యూనిఫామ్‌కు అర్హత సాధించగలిగాను. నన్నిలా చూడాలని అమ్మ పాతికేళ్ల పాటు ఎదురు చూసింది. ఎనిమిదేళ్లు చూడగలిగింది. 2016లో మాకు దూరమైంది. ఆమె వరకు ఆమె ఎటువంటి అసంతృప్తి లేకుండా సంతృప్తిగానే మాకు దూరమైంది. కానీ అప్పటి నుంచే అన్నయ్యకు, నాకు వెలితి మొదలైంది. అమ్మను రోజూ తలుచుకుంటాం. మన సమాజంలో ఉండే అనేక అర్థం లేని నియమాలను ఎదుర్కొంటూ, ఏ దశలోనూ అధైర్యపడకుండా, సింగిల్‌ ఉమన్‌గా అనేక కష్టనష్టాలకోర్చి మరీ మమ్మల్ని తన కలల ప్రతిరూపాలుగా తీర్చిదిద్దుకుంది. ‘నీకు సివిల్స్‌ ప్రిపరేషన్‌కి పుస్తకాలు షేర్‌ చేసిన అర్జున్‌... తన జీవితాన్ని కూడా నీకు షేర్‌ చేశాడు..’ అంటుండేది అమ్మ. అర్జున్‌ అప్పుడప్పుడూ ఆ మాటను గుర్తు చేస్తుంటాడు. తనిప్పుడు నాగపూర్‌లో ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు’’ అని చిరునవ్వుతో చెప్పారు ఎస్పీ నిర్మలాదేవి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement