వేడుకగా విక్టోరియా డే! | Canada Day: A kick off to summer festivals across the country | Sakshi
Sakshi News home page

వేడుకగా విక్టోరియా డే!

May 17 2026 12:15 AM | Updated on May 17 2026 12:15 AM

Canada Day: A kick off to summer festivals across the country

చరిత్రతో ముడిపడిన సందర్భమే అయినా, కెనడియన్లు ఈ సమయాన్ని పూర్తిగా ఒక సమ్మర్‌ కిక్‌–ఆఫ్‌ ఈవెంట్‌గా భావిస్తారు. నెలల తరబడి మంచుతో, చలితో ఇబ్బంది పడే కెనడియన్లకు, చెట్లు పచ్చబడటం, వెచ్చని గాలులు వీచడం ఒక సంతోషకరమైన సమయం. అందుకే ఈ రోజున క్రీడా పోటీలు నిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలతో విందులు చేసుకుంటారు. పలుచోట్ల కెనడా జాతీయ జెండాతో పాటుగా, యూనియన్‌ జాక్‌ జెండాను ఎగురవేస్తారు. రాజధాని నగరాల్లో తుపాకులతో ఘనంగా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కెనడా అంతటా ఒక నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.

కెనడాలో దేశవ్యాప్తంగా విక్టోరియా డే వేడుకలు మే 18 నుంచి మొదలవుతున్నాయి. మంచుతెరలు వీడి, ప్రకృతి పచ్చదనాన్ని పులుముకుంటున్న వేళ దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ వేడుకలను విక్టోరియా రాణి పుట్టినరోజు సందర్భంగానే కాకుండా, సుదీర్ఘ శీతకాలం తర్వాత వచ్చే వెచ్చని వేసవికి స్వాగతం పలకడానికి జరుపుకొంటారు. బాణసంచా కాల్పులతో, విందు వినోదాలతో సరదాగా గడుపుతారు.

విక్టోరియా మహారాణి పుట్టినరోజును అంటే మే 24న వేడుకగా జరుపుకోవడం 1845 నుంచి ఆచారంగా వస్తోంది. అప్పటి కెనడా ప్రావిన్స్  లెజిస్లేచర్‌ ఈ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. 1901లో రాణి విక్టోరియా మరణానంతరం, ఈ పండుగ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె జ్ఞాపకార్థం కెనడా పార్లమెంట్‌ 1952లో ప్రతి సంవత్సరం మే 25కు ముందు వచ్చే సోమవారం రోజున ‘విక్టోరియా డే’ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే 18న నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేసింది.

కెనడియన్ల దృష్టిలో క్వీన్‌ విక్టోరియా అత్యంత గౌరవనీయురాలు. ఆమె హయాంలోనే కెనడాకు బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. అంతేకాకుండా, ప్రస్తుత రాజధాని ఒటావాను దేశ రాజధానిగా ఎంపిక చేసింది కూడా ఆమెనే! 1956 వరకు, తదుపరి రాజుల పుట్టినరోజులను కూడా క్వీన్‌ విక్టోరియా పుట్టినరోజు అయిన మే 24నే నిర్వహించేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్వీన్‌ ఎలిజబెత్‌ బాధ్యతలు చేపట్టినపుడు, ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్‌ 21 అయినప్పటికీ, ఆమె అధికారిక జన్మదిన వేడుకలను విక్టోరియా డే రోజున నిర్వహిస్తుండటం విశేషం. 
∙ రమా జంబుల

Advertisement
 
Advertisement
Advertisement