పేకాట కూడా మానసిక జబ్బేనా! | Sakshi
Sakshi News home page

పేకాట కూడా మానసిక జబ్బేనా! దీన్ని నుంచి బయటపడలేమా?

Published Sun, Jan 28 2024 10:04 AM

Can Gambling Cause Depression And Mental Illness - Sakshi

విజయ్‌ ఒక సేల్స్‌ రిప్రజెంటేటివ్‌. 35 సంవత్సరాల వయసు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా విపరీతంగా పేక ఆడుతున్నాడు. దానివల్ల ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబంలో గొడవలూ వస్తున్నాయి. భార్య ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. విడాకుల వరకూ వచ్చింది. చివరకు భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కౌన్సెలింగ్‌ కోసం వచ్చాడు. 

విజయ్‌ బాల్యం నుంచీ అతని తల్లిదండ్రులు వీకెండ్‌లో సరదాగా పేక ఆడతారని అతనితో మాట్లాడినప్పుడు తెలిసింది. విజయ్, అతని సోదరుడు పెద్దయ్యాక నలుగురూ కలసి ఆడేవారు. అలా పేకాట అలవాటుగా మారింది. అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ క్రికెట్‌ బెట్టింగ్‌ కూడా చేసేవారు. సేల్స్‌ రిప్రజేంటేటివ్‌గా మారాక ప్రతి నెలా టార్గెట్‌ను అందుకోవడం, కొలీగ్స్‌తో పోటీపడాల్సి రావడంతో విజయ్‌ జీవితంలోకి ఒత్తిడి చేరింది.

పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి మరింత పెరిగింది. వీటన్నిటినీ తట్టుకోవడానికి అతను పేకాటను ఒక మార్గంగా మార్చుకున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు అందులో కూరుకుపోసాగాడు. చివరకు పేక ఆడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దీన్ని గాంబ్లింగ్‌ డిజార్డర్‌ లేదా కంపల్సివ్‌ గాంబ్లింగ్‌ అంటారు. ఇదో మానసిక రుగ్మత. 

అదొక సంక్లిష్ట పరిస్థితి

 • గాంబ్లింగ్‌ డిజార్డర్‌ అనేది జీవ, మానసిక, పర్యావరణ కారకాల కలయికతో ప్రభావితమైన సంక్లిష్ట పరిస్థితి. 
 • డోపమైన్, సెరటోనిన్, నోర్‌ ఎపినెఫ్రిన్‌ వంటి కొన్ని న్యూరోట్రాన్స్‌మిటర్లలో అసాధారణతలు దీనికి కారణం కావచ్చు. జన్యువులు కూడా కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి
 • జూదం ఆడే వాతావరణంలో పెరగడం దానిపట్ల సానుకూల ధోరణికి దోహదపడవచ్చు. విజయ్‌ విషయంలో అదే జరిగింది
 • విజయ్‌ జీవితంలోలా అధిక స్థాయి ఒత్తిడి, ప్రధాన జీవన మార్పులు లేదా బాధాకరమైన సంఘటనలు జూదం రుగ్మతలను ప్రేరేపించవచ్చు
 • డిప్రెషన్, యాంగ్జయిటీ లేదా అఈఏఈ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులున్న వ్యక్తులు వారి లక్షణాలను ఎదుర్కోవడానికి జూదానికి అలవాటు పడవచ్చు
 • రిస్క్‌ తీసుకునే ధోరణి, ఇంపల్సివిటీ, సెన్సేషన్‌ సీకింగ్‌ లాంటి వ్యక్తిత్వ లక్షణాలు జూదానికి అలవాటు చేయవచ్చు
 • క్లబ్బులు, కాసినోలు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం కూడా కారణమవుతుంది
 • ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా జూదం ఒక దుర్వినియోగమైన కోపింగ్‌ మెకానిజంగా మారుతుంది
 • అప్పుడప్పుడూ గెలుపొందడం వల్ల వచ్చే ఆనందం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దానికోసం మళ్లీ మళ్లీ ఆడతారు. 

ఆడకుండా ఉండలేరు
గాంబ్లింగ్‌ డిజార్డర్‌ ఒక బిహేవియరల్‌ అడిక్షన్‌. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గురించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు...

 • తమకు కావల్సిన స్థాయి ఎగ్జయిట్మెంట్‌ కోసం పెద్ద మొత్తంలో పందేలు కాస్తుంటారు.
 • జూదం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. 
 • జూదం తగ్గించినప్పుడు లేదా ఆపేసినప్పుడు చిరాకు, అసౌకర్యం, ఉద్రిక్తత..
 • జూదం వల్ల గతంలో వచ్చిన నష్టాలను మళ్లీ జూదంతోనే భర్తీ చేయాలనే ప్రయత్నం..
 • జూదం ఆడుతున్నామనే విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యడం..
 • విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్‌లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేకపోవడం..
 • జూదం వల్ల వచ్చే నష్టాల నుంచి బయటపడేందుకు అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం.. 
 • జూదం రుణాలను చెల్లించడానికి మోసం, దొంగతనం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం..
 • ఆర్థిక, మానసిక, వైవాహిక సమస్యలు వచ్చినా జూదం కొనసాగించడం.. 

సీబీటీతో తప్పించుకోవచ్చు..

 • జూదం వ్యసనం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ నేర్చుకోవడం అవసరం. వాస్తవిక బడ్జెట్‌ వేసుకోవడానికి, జూదం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికి ఆర్థిక సలహాదారుతో కలసి ప్రణాళిక రూపొందించుకోవాలి. 
 • గాంబ్లర్స్‌ అనానిమస్, సపోర్ట్‌ గ్రూపుల్లో చేరడం ద్వారా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు · ఒత్తిడిని తప్పించుకోవడానికి జూదం వైపు వెళ్లకుండా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం, హాబీస్‌ లాంటి ప్రత్యామ్నాయ కోపింగ్‌ మెకానిజమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి ·గుర్తించడం, అభ్యాసం చేయడం, జూదాన్ని ఆశ్రయించకుండా ఒత్తిడిని జయించడానికి సహాయపడుతుంది 
 • జూదానికి సంబంధించిన అహేతుక ఆలోచనలు, నమ్మకాలను గుర్తించడానికి, సవాలు చేయడానికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ ఉపయోగపడుతుంది
 • కోపింగ్‌ స్ట్రాటజీస్‌ను అభివృద్ధి చేయడంలో, కోరికలను నియంత్రించుకోవడానికి సీబీటీ సహాయపడుతుంది
 • కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునర్నిర్మించడం, కుటుంబ మద్దతును పొందడానికి ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది · జూదం వల్ల వచ్చే మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు సహాయపడతాయి.  
   


--సైకాలజిస్ట్‌ విశేష్‌, psy.vishesh@gmail.com             

(చదవండి: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?)

Advertisement
 
Advertisement
 
Advertisement