శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు

Books of nobles are good friends - Sakshi

మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్‌ భజ సాధు సమాగమమ్‌’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం.  మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు.

రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి  ప్రతి క్షణం కలిగిస్తుంటాయి.

మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు.

నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్‌ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే,  వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top