breaking news
Good works
-
శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు
మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం. మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి ప్రతి క్షణం కలిగిస్తుంటాయి. మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు. నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే, వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మన జాతీయాలు
పేడకుప్పకు దిష్టి మంత్రమా? దిష్టి ఎప్పుడు తీస్తారు? ఎందుకు తీస్తారు? అందం, ఐశ్వర్యం, విజయం కలిగిన వారికి నరదిష్టి తగులుతుందని ఒక నమ్మకం. అందుకే దిష్టి తీస్తుంటారు. ఒక కొత్త భవనానికో, అందమైన భవనానికో దిష్టిబొమ్మ తగిలిస్తే అదేమీ వింత కాదు. అదే ఒక పాడుబడిన భవంతికి దిష్టిబొమ్మ కడితే అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ పాడుబడిన భవంతికి దిష్టి తీయాల్సిన అవసరం ఏముంటుంది అని! కొందరు అవసరం లేని పనులు చేసి నలుగురూ నవ్వుకునేలా చేస్తారు. ‘‘మావాడు కార్యశూరుడు. ఎంత పెద్ద కార్యశూర్యుడు అంటే పేడకుప్పకు దిష్టి మంత్రం వేసే రకం’’ అని ఒకరు అంటారు. ‘‘చేయక చేయక ఒక పని చేస్తాడు. తీరా చూస్తే ఆ పని పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లుగా ఉంటుంది’’ అని ఇంకొకరు అంటారు. ఇలా రకరకాల సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పేడకుప్పను చూడగానే ముక్కు మూసుకోవా లనుకుంటాంగానీ, ‘ఆహా ఏమి సౌందర్యం’ అని అనుకోము కదా! మరి పేడకుప్పకు దిష్టి మంత్రం వేస్తే ఎంత నవ్వులాటగా ఉంటుంది! ఈ నేపథ్యంలో నుంచి పుట్టిన జాతీయమే ‘పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లు’ అన్నది! కాక స్నానం ‘‘పనైతే చేస్తాడుగానీ... అది కాక స్నానంలా ఉంటుంది’’ అన్నమాట చాలాసార్లు వింటుంటాం. పనులు చేసేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు చిత్తశుద్ధితో చేస్తారు. సంపూర్ణంగా చేస్తారు. రెండో రకం వారు నామమాత్రంగా చేస్తారు. అందులో లోపాలు, పరిమితులు బోలెడు కనిపిస్తాయి. ఈ రెండో కోవకు చెందిన వారి విషయంలోనే పై జాతీయాన్ని ఉపయోగిస్తారు. కాకి స్నానం ఎలా చేస్తుందో ఎప్పుడైనా చూశారా? తన రెండు రెక్కలనూ నీళ్లలో ఆడించి స్నానం పూర్తి చేశాను అనుకుంటుంది. మనుషుల్లో కూడా కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదో చేశాం అన్న పేరుకి చేసేసి, అద్భుతంగా చేసేశాం అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటివారి పనిని కాకస్నానంతో పోలుస్తారన్నమాట! శనివారపు జడి వాన! శనివారం ఏ పని చేయాలన్నా వెనకడుగు వేస్తుంటారు. కారణం మంచి పనులు చేయడానికి శనివారాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదన్న నమ్మకం. ఇక వాన గురించి. వాన పడితే చేయాల్సిన పనులు చేయలేము. ఆ జల్లులో, బురదలో పనికి రకరకాల ఆటంకాలు కలుగుతాయి. పని వాయిదా పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇక జడివాన మొదలైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇక ఈ రెండూ కలిస్తే?! శనివారం పూట పని చేయడానికే సంకోచిస్తుంటే ఇక వాన కూడా పడిందనుకోండి, ఇక అంతే సంగతులు కదా! అందుకే శనివారపు జడివాన అన్న జాతీయం పుట్టుకొచ్చింది. కొందరు మాట్లాడ్డం మొదలు పెడితే ఆపరు. అలాంటి ‘ఆగని నస’ని శనివారపు జడివాన అంటారు. ‘అయ్యబాబోయ్... అతను ఉపన్యాసం మొదలు పెట్టాడు... ఇక శనివారపు జడివానే!’ అని చమత్కరిస్తారు. ఎలుక చావుకు పిల్లి మూర్ఛ పోయిందట! అసమంజసమైన, పొంతన లేని, అసంబద్ధమైన విషయాలను విన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిలో ఒకడికి ఏమైనా అయితే, రెండోవాడు బాధ పడుతున్నట్లు నటించినా, సానుభూతి చూపించినా... జనాలు నమ్మకపోగా ‘వీడి వాలకం చూస్తే ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోయినట్లుగా ఉంది’ అంటారు. ఎలుక, పిల్లుల మధ్య జాతివైరం ఉంటుంది. పిల్లి నుంచి ఎలా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలా అని ఎలుక ఆలోచిస్తుంది. ఎలుక ప్రాణాలు ఎలా తీయాలా అని పిల్లి ఆలోచిస్తుంది. కాబట్టి వాటి మధ్య స్నేహానికి, బంధుత్వానికి చాన్సే లేదు కదా! ఈ వాస్తవంలో నుంచి పుట్టిన జాతీయమే ఇది.