ఆ అహంకారం వల్లే.. పొలిటికల్‌ బాంబ్‌ పేల్చిన కమలా హారిస్‌ | Kamala Harris Book '107 Days' Blames Biden for 2024 Election Loss, Sparks Controversy | Sakshi
Sakshi News home page

ఆ అహంకారం వల్లే.. బైడెన్‌పై పొలిటికల్‌ బాంబ్‌ పేల్చిన కమలా హారిస్‌

Sep 11 2025 12:30 PM | Updated on Sep 11 2025 1:36 PM

Kamala Harris Sensational Comments On Joe Biden Democratic Party

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అక్కడ రాజకీయాల్లో సంచలనాలకు నెలవుగా మారబోతున్నారా?. సొంత పార్టీ, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అవివేకం, అహంకార ధోరణులతోనే డెమొక్రటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైందంటూ తన ఆత్మకథలో రాజకీయ బాంబుల్నే పేల్చారామె. 

తన ఆత్మకథ ‘107 డేస్’లో కమలా హారిస్‌ రాసుకొచ్చిన విషయాలు ఇలా ఉన్నాయ్‌..  2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారహితం. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బైడెన్‌ అహంకారం, లెక్కలేనితనమే కారణమని ఆరోపించారామె. ‘‘ఇది క్షమాశీలతా? లేక అవివేకమా? ఇప్పుడు చూస్తే, అది అవివేకమే అని స్పష్టమవుతోంది. ఇది ఒక వ్యక్తి అహం, ఆత్మకాంక్ష ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదు. దేశ భద్రత, ప్రజల భవిష్యత్తు పరిగణనలోకి తీసుకుని తీసుకోవాల్సిన నిర్ణయం అని రాసుకొచ్చారామె.

2024 జులైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత బైడెన్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి దిగి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని ఒక మంత్రంలా పాటించామని, అది అవివేకమని అంటున్నారామె. 

పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాతే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని, ఆ తర్వాతే తన పేరును ప్రతిపాదించారని హారిస్ తెలిపారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వ్యాఖ్యానించారు. బైడెన్‌ జ్ఞానం ఉన్న వ్యక్తి అని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారామె. అయితే.. వయసు రిత్యా ఆయన ఇబ్బందులకు గురయ్యారని, ఈ క్రమంలోనే అధ్యక్ష డిబేట్‌లోనూ ఆయన విఫలమయ్యారని అన్నారామె. అయితే నాడు పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇచ్చే పరిస్థితుల్లో అప్పుడు తాను లేనని.. ఒకవేళ తాను ఆ సలహా ఇచ్చి ఉంటే అది తన స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారని చెప్పుకొచ్చారు. అలాగే.. 

ఉపాధ్యక్షురాలిగా ఉన్నంత కాలం వైట్ హౌస్‌తో తన సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని మరో బాంబ్‌ పేల్చారామె.  బైడెన్ స్టాఫ్ తనను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ఆయన సన్నిహితులు ఎన్నికల ప్రచార సమయంలో తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కమలా హారిస్ ఆరోపించారు. అమెరికా మెక్సికో సరిహద్దు విషయంలో తాను పని చేసినప్పుడు తనకు వ్యతిరేకంగా “border czar” క్యాంపెయిన్‌ నడిచిందని.. ఆ సమయంలో వైట్‌హౌజ్‌ కమ్యూనికేషన్‌ టీం తనకు ఏమాత్రం సహాయం చేయలేదని అన్నారామె. ఎన్నికల ప్రచారాల్లో, గాజా విషయంలోనూ తన ప్రసంగాలు బాగా వైరల్‌ అయిన సందర్భంలో.. అధ్యక్ష భవనంలో కీలకమైన వెస్ట్‌ వింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ సంచలన విషయాలే చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉంటే.. 107 Days పుస్తకంను సెప్టెంబర్ 23న సైమన్ అండ్ షూస్టర్ సంస్థ పబ్లిష్‌ చేసింది. ఇందులో అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రయాణం, బైడెన్‌తో సంబంధం, వైట్ హౌస్ లోపల జరిగిన రాజకీయ పరిణామాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని సంచలనాలను సృష్టించవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ప్రత్యేకించి డెమొక్రటిక్‌ పార్టీలోని విబేధాలను బయటపెట్టే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే.. ట్రంప్‌ లాంటి వాళ్లకు డెమొక్రటిక్‌ పార్టీని ఏకిపారేయడానికి ఆయుధం దొరికినట్లే!.

ఇదీ చదవండి: ఐ యామ్‌ వెయిటింగ్‌ అంటున్న ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement