రేఖ @ 68

Bollywood Actress Glamour Teacher Rekha Completes 68 Years - Sakshi

ఆమె సరళ రేఖ కాదు. వక్రరేఖ కాదు. ఒక అనూహ్య రేఖ. తెలుగు, తమిళం అనే మాతృ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్‌లో చక్రం తిప్పింది. హీరోలకు ఇన్‌స్పిరేషన్‌. హీరోయిన్‌లకు గ్లామర్‌ టీచర్‌. నేడు ఆమెకు 67 నిండి 68 వస్తున్నాయి.

రేఖను తాడేపల్లిగూడెం అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి నటి పుష్పవల్లిది అదే ఊరు. పుష్పవల్లి నటిగా ఎదగడం, జెమిని గణేశన్‌తో సహజీవనం చేయడం ఆ రోజుల్లో సంచలనం. జెమిని గణేశన్‌ వల్ల ఆమెకు రేఖ, మరో కుమార్తె రాధ పుట్టారు. కాని రేఖ జీవితంలో తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. తండ్రి చాలా కాలం రేఖను తన కూతురుగా అంగీకరించలేదు. అప్పటికే ఒక పెళ్లి అయిన జెమినీ గణేశన్‌ సావిత్రితో పెళ్లి సమయంలో పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు.

సావిత్రితో పెళ్లి బహిర్గతం అయ్యాక ఆమెకు దూరం అయ్యాడు. అందువల్ల కావచ్చు బహుశా పబ్లిక్‌గా రేఖను తన కుమార్తె అని ఆయన చెప్పుకోలేదు. రేఖకు ఈ గాయం ఒకటైతే తల్లి ఆ తర్వాత మరో సంబంధంలోకి వెళ్లి ఫలితంగా పుట్టిన మరో ముగ్గురిని పెంచాల్సి రావడంతో రేఖ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. తన జీవితం తాను జీవించాలనుకుంది. తన జీవిత రేఖ తానే గీసుకోవాలనుకుంది. రేఖ అలా పెరిగింది.

ఇంతేరా ఈ జీవితం
‘రంగుల రాట్నం’లో భుజంగరాయ శర్మ రాసిన ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ పాట రేఖకు సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రేఖ ‘బేబీ రేఖ’ పేరుతో నటించింది. రంగుల రాట్నంలో పైకి కిందకు ఉత్థాన పతనాలు ఉంటాయి. రేఖ జీవితంలో కూడా ఉన్నాయి. తెలుగులో ‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణంరాజు పక్కన నటించిన రేఖ తన తల్లి సమాజానికి తండ్రి సమాజానికి దూరంగా వెళ్లదలుచుకుంది. ముంబై వెళ్లి 14–15 ఏళ్లకే ‘సావన్‌ భాదో’ సినిమాలో హీరోయిన్‌ అయ్యింది.

ఆ సినిమా హిట్‌ అయినా రేఖను ఎవరూ లెక్క చేయలేదు. పైగా ‘నల్లబాతు’ అని పిలిచేవారు. ఆమె రంగు, బొద్దుగా ఉండే రూపం నార్త్‌కు పనికి రాదని పత్రికలు రాశాయి. కాని రేఖ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మన రూపాన్ని మనం చెక్కుకోవచ్చు అని మొదటిసారి బాలీవుడ్‌కి తెలియచేసింది రేఖ. ఆ తర్వాత ఆమె రూపం మారింది. ఫ్యాషన్‌ మారింది. నటన మారింది. రేఖ అంటే ‘ఫ్యాషన్‌ దివా’ అని పేరు తెచ్చుకుంది.

తోడు ఎవరు?
రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అమితాబ్‌తో ఆమె తొలిసారిగా ‘దో అంజానే’ లో నటించింది. పెళ్లయిన అమితాబ్‌ రేఖ ఆకర్షణలో పడ్డాడని ఆ వెంటనే వాళ్లు కలిసి చేసిన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. ‘మిస్టర్‌ నట్వర్‌లాల్‌’, ‘మొకద్దర్‌ కా సికిందర్‌’, ‘సిల్‌సిలా’... ఇవి రేఖ–అమితాబ్‌ల చిత్రాలు. వీరి ప్రేమ, ఆ సమయంలో జయభాదురి మానసిక సంఘర్షణ యశ్‌చోప్రాను ‘సిల్‌సిలా’ తీసేలా చేశాయి.

నిజ జీవితం లోని పాత్రలు సినిమా తెర మీద నటించడం బహుశా మొదటి చివరి సారిగా ఈ సినిమాలోనే జరిగిందేమో. అయితే ఈ సినిమా అంత విజయం సాధించలేదు. రేఖ తన తోటి నటుడు వినోద్‌ మెహ్రాను వివాహం చేసుకుందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ముంబై వ్యాపారి ముఖేశ్‌ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. నాలుగు పార్టీల్లో కలిసిన ముఖేశ్‌ అగర్వాల్‌ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని దూకుడుగా అడిగితే రేఖ కూడా అంతే దూకుడుగా ఓకే అనడం ఆ రోజే వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.

ఆ వెంటనే ఒకరి లోపాలు ఒకరికి తెలిసి ఆ పెళ్లి ప్రమాదంలో పడింది. ముఖేశ్‌ అగర్వాల్‌ పెళ్లయిన ఒక సంవత్సరం లోపే రేఖ చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన ‘శేష్‌నాగ్‌’ విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దృష్టి నుంచే చూసింది.

గొప్పనటి
రేఖ గొప్ప నటి, డాన్సర్‌. రేప్‌ విక్టిమ్‌గా ‘ఘర్‌’ సినిమాలో నటించి ఆమె తన సీరియస్‌ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్‌ ముఖర్జీ ‘ఖూబ్‌సూరత్‌’లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్‌ అలీ దర్శకత్వంలో ‘ఉమ్రావ్‌జాన్‌’లో నటించి రేఖ విమర్శకులను అప్రతిభులను చేసింది. ఒక తవాయిఫ్‌ జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్‌ ‘కలియుగ్‌’, గిరిష్‌ కర్నాడ్‌ ‘ఉత్సవ్‌’ ఆమెను పార్లల్‌ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు ‘ఫూల్‌ బనే అంగారే’, ‘ఖూన్‌ భరీ మాంగ్‌’ ఆమెను యాక్షన్‌ హీరోయిన్‌ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది.

జుట్టు తెల్లబడని నటి
రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్‌ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘ఆజ్‌ కల్‌ పావ్‌ జమీపర్‌ నహి పడ్‌తే హై మేరే’, ‘తేరే బినా జియా జాయేనా’, ‘సున్‌ సున్‌ దీదీ తేరే లియే ఏక్‌ రిష్టా ఆయాహై’, ‘ఆప్‌ కే ఆంఖోమే కుచ్‌ మెహకే హుయే రాజ్‌ హై’, ‘పర్‌ దేశియా
ఏ సచ్‌ హై పియా’... ఎన్నో హిట్‌ సాంగ్స్‌ రేఖకు.

ఆమెకు 68 వచ్చేశాయంటే నమ్మడం కష్టం. కాని వయసును జయించిన భాగ్యం ఈ భానురేఖదే కదా.

రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్‌ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top