What Is WhatsApp Pink Scam: కొత్త వాట్సాప్‌ అప్‌డేట్‌ అంటూ సైబర్‌ నేరగాళ్ల మోసం.. క్లిక్‌ చేశారో అంతే

Beware of WhatsApp Pink Scam Know About How To Stay Safe - Sakshi

వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్‌ పింక్‌ స్కామ్‌ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్‌ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం వాట్సాప్‌ ‘పింక్‌ రెడ్‌ అలర్ట్‌’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్‌ పింక్‌ అంటే ఏంటి? ఈ స్కామ్‌ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

పింక్‌ వాట్సాప్‌ అంటే..?
స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్‌ వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్‌ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్‌. వాట్సాప్‌ పింక్‌ని డౌన్‌లోడ్‌ చేయడంతో స్కామర్లు ఫోన్‌ డేటాకు యాక్సెస్‌ పొందుతారు. దీంతో ఈ యాప్‌ మన ఫోన్‌ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్‌ వివరాలు, కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. 

అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త
తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్‌ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్‌ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్‌ చేసే మెసేజ్‌ను యాక్సెస్‌ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్‌ వెబ్‌సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్‌ చేయాలి. 

పేరొందిన యాంటీ మాల్వేర్‌ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా మీ మొబైల్‌ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేయాలి. సేఫ్టీ అప్‌డేట్‌ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్‌ మీ బ్యాంకింగ్‌ వివరాల వంటి సెన్సిటివ్‌ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు.

తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు.  వాట్సాప్‌ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్‌ చేసుకోవడానికి పిన్‌ నంబర్‌ ఉంటుంది. కొత్త ఫోన్‌లో మీ ఫోన్‌ నంబర్‌ యాక్సెస్‌ అవ్వాలంటే ఈ పిన్‌ నెంబర్‌ అవసరం అవుతుంది. మీ అకౌంట్‌ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్‌ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు.

వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి..
‘న్యూ పింక్‌’ వాట్సాప్‌ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్‌ లుక్‌ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్‌డేట్‌ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్‌ హైజాక్‌ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్‌ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేయవచ్చు. యాప్‌ నకిలీ వెర్షన్‌ వినియోగదారుల ఫోన్‌లను హ్యాక్‌ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. 

వాట్సాప్‌ పింక్‌ అనేది హానికరమైన మాల్వేర్‌. మొబైల్‌ ఫోన్‌లను యాక్సెస్‌ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్‌వేర్‌. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్‌ చేసినప్పుడు వారి డిజిటల్‌ పరికరాలలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. 

థర్డ్‌–పార్టీ యాప్‌ స్టోర్‌లు లేదా APK ఫైల్స్‌ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఆపిల్‌ ఫోన్‌లో అయితే యాక్సెస్‌ ఉండదు. వాట్సాప్‌ పింక్‌ స్కామ్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్‌ స్టోర్‌లు, ఏపీకే ఫైల్స్‌ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్‌ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్‌ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు.  

మీ ఫోన్‌లో వాట్సాప్‌ పింక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్‌ చేసి ఫార్మాట్‌ లేదా రీసెట్‌ చేయండి. మీరు ఈ వాట్సాప్‌ పింక్‌ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/  పోర్టల్‌లో రిపోర్ట్‌ చేయవచ్చు.         
                          

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top