బకాసుర వధ

Bakasura Massacre In Mahabharata - Sakshi

భక్త విజయం

హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్ర ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. ‘కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరుపాటు తగదు. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి, తర్వాత ఏకచక్రపురం వెళ్లండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పాడు.

శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది, భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు నలుగురు సోదరులూ భిక్షాటనకు వెళ్లగా, భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటిన వెళ్లింది. భార్యాబిడ్డలను పట్టుకుని అదేపనిగా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. 

‘నిస్సారమైనది ఈ జీవితం. ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికూన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వెయ్యడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు– ఒక్కగానొక్క వంశాంకురం. తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు.

‘వద్దు, వద్దు. మీరు వెళ్లకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను. అసలు బతకలేను. పునిస్త్రీ చావు కన్న పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను’ ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ‘ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్నే. నన్ను పంపండి’ అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ.ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ‘ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను. ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా’ అంటూ దగ్గరే ఉన్న ఒక కర్రనందుకున్నాడు. ‘అసలేమైందమ్మా! మీరంతా ఎందుకో బాధపడుతున్నారు. రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరు? మీకొచ్చిన ఆపద ఏమిటి? మీకు ఆపద వస్తే, మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి’ అంది కుంతి.

‘ఏం చెప్పేది తల్లీ! ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్లో వాళ్లందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆలోచించి, బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒక మనిషి, రెండు పోతులు, వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని, వాడు ఊరి మీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజూ వంతుల వారీగా ఒక్కో ఇంటి నుంచి ఒక మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం’ అని చెప్పాడా బ్రాహ్మణుడు. ‘విచారించకండి. దీనికి తగిన ఉపాయం చెబుతాను’ అంది కుంతి. 
‘మీకు ఒక్కడే కొడుకు. పైగా పసివాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్లలో ఒకణ్ణి పంపుతాను.’ అంది.
‘శివ శివా’ అంటూ చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు. ‘అతిథిని చావుకు ఎరగా వేయడం మహా పాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లీ!’ అన్నాడు. 

‘అయ్యా! మీరు అనవసరంగా బాధపడకండి. మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహా బలసంపన్నుడు. వందమంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్నకొడుకు చేదుకాదు కదా, నేను నా కొడుకును ఎలా బలి పెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి’ అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకువెళ్లమని చెప్పింది. 

ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వర త్వరగా పంచభక్ష్యాలతో భోజనం తయారు చేయించి, పోతులు పూన్చిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండి పైకెక్కి భీముడు బయలుదేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా, యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని, వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని, బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. 

గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండి మీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నసాళానికెక్కింది. ‘నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తున్నావేమిటి? ఒళ్లు కొవ్వెక్కిందా?’ అంటూ భీముడి వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా, భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్లాడు. వాడు చెట్టు పెరుక్కుని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి, మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్లాడు.

ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టు పక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్లయుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి, కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని భీముడు వాడి మీదకు మెరుపులా దూకాడు. ఒక చేత్తో నడుము దొరకబుచ్చుకుని, ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకుని, వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి, ధైర్యంగా అతడిని పంపిన కుంతిని వేనోళ్ల పొగిడారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top