మాకు పిండి తెలుసు పిజ్జా కూడా తెలుసు

Amritsar Women Team Will Give Pizza To Protesting Farmers In Delhi - Sakshi

దేశంలో కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పిట్ట కథలాగా పిజ్జా కథ కూడా చోటు చేసుకుంది. దీని మీద మాటల బాణాలు, వ్యంగ్యపు విసుర్లు జోరుగా సాగుతున్నాయి.ఇంతకూ ఏం జరిగిందీ?అంటే పంజాబ్‌ నుంచి ఈ ఉద్యమంలో ఎక్కువ మంది రైతులు పాల్గొంటున్నారు కనుక ఆ రాష్ట్రం నుంచి మద్దతుదారులు రెగ్యులర్‌గా కార్లేసుకొని వచ్చి రైతులకు సహాయం చేసి వెళుతున్నారు. కొందరు తిండి, కొందరు దుప్పట్లు, కొందరు మందులు ఇలా ఇచ్చి పోతున్నారు. మొన్నటి శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌ నుంచి ఇలాగే ఐదు మంది మిత్రులు ఢిల్లీలో ఉన్న రైతులకు ఏదైనా ఆహారం అందిద్దామని బయలు దేరారు. కాని ఆలస్యమయ్యేసరికి హర్యాణాలోని ఒక మాల్‌ దగ్గర ఆగి రెగ్యులర్‌ సైజ్‌ పిజ్జాలు భారీగా కొని ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే వాటిని అవెన్‌లో తయారు చేసి రైతులకు ఉచితంగా పంచారు. దాదాపు 400 పిజ్జాలను వారు పంచారు. సిక్కుల ఉచిత భోజన పంపక కేంద్రాలను ‘లంగర్‌’లని అంటారు. దానివల్ల వీరిది ‘పిజ్జా లంగర్‌’ అయ్యింది. వెంటనే ఇది ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది ప్రశంసించారు. కొందరు ప్రభుత్వ విధానాల మద్దతుదారులు విమర్శించారు.

‘చూశారా... రైతులట... పిజ్జాలు తింటున్నారట’ అని విమర్శించారు. వెంటనే అలాంటి విమర్శలకు గట్టి బదులు లభించింది. ‘రైతు పిజ్జా తయారీకి పిండి ఇస్తాడు. ఏం.. అతను పిజ్జా ఎందుకు తినకూడదు?’ అని ఆ పిజ్జా లంగర్‌ను నిర్వహించిన ఒక సభ్యుడు అన్నాడు. రైతులు పైజామాలను వదిలి జీన్స్‌ ప్యాంట్‌లలోకి మారారని తెలుసుకోండి అని కూడా అన్నారు. ‘రైతులు విషం తింటుంటే పట్టించుకోని వారు పిజ్జా తింటే విమర్శిస్తున్నారు’ అని పంజాబ్‌ నటుడు దిల్‌జిత్‌ అన్నాడు. పంజాబ్‌ అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు. ‘నేను రైతు కూతురిని. నాకు ఇంగ్లిష్‌ కూడా వచ్చు’ అని వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రైతులు ఎంతసేపు నూనె లేని రొట్టె, ఎర్ర కారం తింటూ ఉండాలా? మాకు పిజ్జా చేసుకు తినడం కూడా వచ్చు’ అని మరికొంతమంది స్త్రీలు ఫేస్‌బుక్‌లో రియాక్ట్‌ అయ్యారు. మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో అదే.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top