ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!! | Can AI Replace Teachers? AI-Assisted Conversation Between Teacher And Student Regarding The Syllabus, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

Jun 18 2026 7:47 AM | Updated on Jun 18 2026 8:41 AM

AI-Assisted Conversation Between Teacher And Student Regarding The Syllabus

బడిగంట – 6

‘డియర్‌ చాట్‌ జిపిటి..... ఈ క్వశ్చన్‌ పరీక్షలో రాదు కదా?’ స్టూడెంట్‌ అడిగితే ఏఐ ‘రాదు’ అని ఊరుకుంటుంది. టీచర్‌ ‘పరీక్షలో రాకపోయినా జీవితంలో పనికొస్తుంది’ అంటుంది. ఏఐకి సిలబస్‌ తెలుసు. టీచర్‌కి నువ్వు తెలుసు. నీ సిల్లీ డౌట్లు, నీ కళ్లలో భయం, నీ గుండెల్లో ఆశ. ఏఐ ఆన్సర్‌ చెప్తే టీచర్‌ ఆలోచన నేర్పుతుంది. అందుకే భవిష్యత్‌ చదువు అంటే ‘ఏఐ వర్సెస్‌ టీచర్‌’ కాదు. ‘ఏఐ ప్లస్‌ టీచర్‌’.

ఇంట్లో పిల్లలు హోంవర్క్‌ మొదలుపెట్టగానే మొదట అడిగే మాట ‘ఏఐలో కొట్టనా?’. కొట్టాక క్షణాల్లో ఆన్సర్‌ దొరుకుతుందటే బుర్రకు ఇక పని లేదు. తల్లిదండ్రులు కూడాప్రాజెక్ట్‌ కోసం ‘ఏఐని అడుగు’ అని ఎంకరేజ్‌ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఒక అనుమానం వస్తోంది. ఏఐ అన్నీ చెప్పేస్తుంటే ఇక స్కూల్, టీచర్‌ ఎందుకు అని. నిజమే, ఏఐ వేగంగా సమాచారం ఇస్తుంది. అర్ధరాత్రి అడిగినా విసుక్కోదు. కానీ చదువులో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఆ రెండింటి మధ్య గ్యాప్‌ను పూడ్చేది టీచర్‌ మాత్రమే. ఏఐ యుగంలో టీచర్‌ పోలేదు. టీచర్‌ పాత్ర మారింది.

టీచర్‌ కలిగించే స్పృహ
‘ఆకు పచ్చగా ఎందుకు ఉంది?’ అని పిల్లాడు అడిగితే ఏఐ మూస పద్ధతి జవాబు చెప్తుంది. టీచర్‌ మాత్రం ‘నువ్వు అన్నం తింటే బలం వచ్చినట్టు, చెట్టు ఎండ తింటే ఆకు పచ్చగా అవుతుందిరా’ అంటారు. దీన్నే ‘కాన్సెప్టువల్‌ క్లారిటీ’ అంటారు. ఏఐ డేటా ఇస్తుంది. ఆ డేటాను జీవితానికి అన్వయించే వివేకం, విలువ, దృక్పథం టీచర్‌ మాత్రమే ఇవ్వగలరు. ఇది యంత్రానికి రాని మానవ స్పందన.

టీచర్‌కు ‘క్లాస్‌రూమ్‌’ తెలుసు
మంచి టీచర్‌ పాఠం చెప్తూనే పిల్లల ముఖాలు చదువుతారు. ఎవరి కళ్లలో కన్ఫ్యూజన్‌ ఉందో, ఎవరు అర్థం కాకపోయినా తల ఊపుతున్నారో పసిగడతారు. వెంటనే పాఠం ఆపి, ఉదాహరణ మార్చి, అవసరమైతే మాతృభాషలోకి దిగి చె΄్తారు. పిల్లాడి కంట్లో నీళ్లు చూస్తే సిలబస్‌ పక్కనబెట్టి ముందు ధైర్యం చె΄్తారు. ఏఐకి ఈ శక్తి లేదు. దానికి ఎమోషన్‌ తెలియదు. ఒక పద్ధతి ఫెయిల్‌ అయినా అందరికీ అదే పద్ధతి చూపిస్తుంది. కొత్త బ్యాచ్‌ వచ్చిన ప్రతిసారీ టీచర్‌కు మరింత అనుభవం పెరిగి ఉంటుంది. ఆ హృదయం, ఆ పరిశీలన ఏఐకి రాదు.

‘పాస్‌’... ‘పర్సన్‌’
చదువులో ముఖ్యమైనది మోటివేషన్‌. పిల్లలు సబ్జెక్ట్‌తో కాదు, సబ్జెక్ట్‌ చెప్పే మనిషితో కనెక్ట్‌ అవుతారు. ‘నువ్వు చేయగలవు’ అని ఏఐ చెప్పదు. టీచర్‌ చె΄్తారు. ఆ మాటే పిల్లాడిని ఫెయిల్యూర్‌ నుంచి లేపుతుంది. ఏఐ ఆన్సర్‌ ఇస్తుంది. టీచర్‌ ప్రశ్న అడిగే ధైర్యం ఇస్తారు. ఏఐ ఇన్ఫర్మేషన్‌ ఇస్తుంది. టీచర్‌ విలువలు నేర్పుతారు. క్యూరియాసిటీ వెలిగించడం, తప్పుచేస్తే సరిదిద్దడం, ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని గుర్తించి దగ్గర తీసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే భవిష్యత్‌ చదువు అంటే ‘ఏఐ వర్సెస్‌ టీచర్‌’ కాదు. ‘ఏఐ ప్లస్‌ టీచర్‌’.

మనిషి గుర్తు
అసలు ప్రశ్న ‘టీచర్లు అవసరమా’ అని కాదు. ‘టీచింగ్‌లో  మానవీయ స్పర్శ కాపాడుకుంటున్నామా’ అని. ఏఐ వచ్చింది కాబట్టి టీచర్‌ పని తగ్గలేదు. బాధ్యత పెరిగింది. ఇకపై టీచర్‌ క్యూరియాసిటీ వెలిగించే కాగడా. డేటా యుగంలో దారి చూపే దిక్సూచి. మీ పిల్లాడి ఫో¯Œ లో ఏఐ ఉండొచ్చు. కానీ వాడి లైఫ్‌లో ‘నా మేడం, నా సార్‌’ అనే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషిని రీప్లేస్‌ చేసే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు. బడిగంట మోగింది. ఇక టీచర్‌ అసలు పాఠం మొదలు.
 

కేస్‌ స్టడీ 1
హైదరాబాద్‌లో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి సైన్స్‌ప్రాజెక్ట్‌ కోసం ఏఐని.‘గ్లోబల్‌ వార్మింగ్‌ కారణాలు’ అడిగాడు. టైప్‌ చేయగానే ఐదు పాయింట్లు వచ్చాయి. యథాతథంగా చార్ట్‌ మీద రాసి తీసుకెళ్లాడు. క్లాస్‌లో టీచర్‌ ‘మన వీధిలో చెట్లు నరికితే ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?’ అని అడిగారు. పిల్లాడు మౌనం వహించాడు. ఏఐ ఇచ్చిన డేటాను తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్వయించలేక పోయాడు. ఆరోజు టీచర్‌ క్లాస్‌ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లి ఎండలో సిమెంట్‌ రోడ్డు వేడి, చెట్టు నీడ చల్లదనం తెలిపి ఉష్ణోగ్రత తేడా ఫీల్‌ చేయించారు. ఏఐ ‘ఏంటి’ చెప్పింది. టీచర్‌ ‘ఎందుకు’ అనుభవంలోకి తెచ్చారు.

కేస్‌ స్టడీ 2
ఓ ఇంటర్‌ విద్యార్థిని లెక్కల్లో బలహీనం. ట్యూషన్‌ చేరి అడిగితే ‘సిల్లీ డౌట్‌’ అని కోప్పడతారేమోనని భయం. దాంతో ఏఐతోప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. సమాధానాలు వచ్చాయి. కానీ పరీక్షలో అదే మోడల్‌ మార్చి ఇస్తే తడబడింది. కారణం ఏఐ ఆమె భయాన్ని గుర్తించలేదు. కాలేజీలో లెక్కల మేడం ఆమె ముఖం చూసి విషయం కనిపెట్టారు. ‘నీకు కాన్సెప్ట్‌ రావాలి’ అని ధైర్యం చెప్పి బోర్డు మీద కాకుండా ఆమె నోట్‌బుక్‌లోనే తప్పును సరిదిద్దారు. మూడు నెలల్లో ఆ అమ్మాయి పాస్‌ అయింది. ఏఐ సాధన ఇచ్చింది. టీచర్‌ నమ్మకం ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement