విధ్వంసాలలో ఎగిరిన పావురాయి

Afghan Women Fawzia Koofi Nobel Peace Prize Nomination Story In Family - Sakshi

నోబెల్‌ శాంతి బహుమతి పోటీదారు

నోబెల్‌ శాంతి బహుమతి అక్టోబర్‌ 9న ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 318 మంది ఈ బహుమతి కోసం పోటీ పడుతున్నారు. అధికారికంగా వీరి పేర్లు బయటకు రాకపోయినా నార్వేకు చెందిన శాంతి సంస్థల బృందం టాప్‌ 5లో ఫాజియా కూఫీ పేరు ఉన్నట్టుగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో తండ్రిని, సోదరుణ్ణి, ఆఖరుకు భర్తను కూడా కోల్పోయిన ఫాజియా అప్ఘనిస్తాన్‌లో మొదటి మహిళా డిప్యూటి స్పీకర్‌ అయ్యింది. ఎవరి వల్లనైతే తాను నష్టపోయిందో ఆ తాలిబన్లతోనే శాంతి చర్చలు జరుపుతోంది. ఆమె పరిచయం. 

ఎవరి వల్లనైతే మనం తీవ్రంగా నష్టపోయామో ఆ శత్రువు ఎదుట కూచుని మాట్లాడటం చాలా కష్టం. శత్రువును క్షమిస్తూ మాట్లాడటం ఇంకా కష్టం. ఫాజియా కూఫీ (45) ఈ రెండు పనులూ చేసింది. మొన్నటి సెప్టెంబర్‌ రెండవ వారంలో కతార్‌ రాజధాని దోహాలో అప్ఘనిస్తాన్‌ ప్రభుత్వానికి, అప్ఘనిస్తాన్‌లో ఇంకా తమ పరోక్ష ప్రాభవం కోల్పోని తాలిబన్ల ప్రతినిధులకు తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. ఇప్పుడు (అక్టోబర్‌ 5 నుంచి) మలి విడత శాంతి చర్చలు జరుగనున్నాయి. అప్ఘనిస్తాన్‌ ప్రభుత్వం తరుఫున 21 మంది ప్రతినిధులు ఈ చర్చలకు హాజరైతే వారిలో కేవలం నలుగురు మాత్రమే మహిళా ప్రతినిధులు. వారిలో ఫాజియా కూఫీ ఒకరు. తాలిబన్ల వల్ల ఆమె వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయినా దేశం కోసం వారి పరివర్తనకు కృషి చేస్తోంది.

ఎండకు వదిలిన పసికూన
ఫాజియా కూఫీ అఫ్ఘనిస్తాన్‌లోని బదఖ్‌షాన్‌ ప్రాంతంలో జన్మించింది. తండ్రి పార్లమెంట్‌ సభ్యుడు. అతని 7 భార్యలు కన్న పిల్లల్లో 19వ సంతానంగా ఫాజియా జన్మించింది. భర్తను మెప్పించడానికి ఆమె తల్లి ఆ పుట్టేది కొడుకు అయితే బాగుండు అని కోరుకుంది. కాని ఫాజియా పుట్టేసరికి అప్పటికే సంతానంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కనుక చనిపోతే బాగుండునని ఎండలో పరుండబెట్టింది. కాని ఫాజియా గట్టి పిండం. చనిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను అంగీకరించారు. అంతే కాదు మొత్తం సంతానంలో కేవలం ఫాజియాను మాత్రమే బడికి పంపి చదివించారు. ఫాజియా పెద్దయ్యి డాక్టర్‌ కావాలని కలలు కంది. కాని ఆడపిల్లలు మెడిసిన్‌ చదివే సౌలభ్యం తాలిబాన్‌ హయాంలో లేదు కాబట్టి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది.

తాలిబన్‌ కాలంలో
అప్ఘనిస్తాన్‌లో జరిగిన మొదటి ఆఫ్ఘన్‌ యుద్ధం (1979–89)లో ముజాహిదీన్‌లు ఫాజియా తండ్రిని చంపేశారు. ఆ తర్వాత ఫాజియా కుటుంబం కోసం వెతికితే వారు వేరే ప్రాంతానికి పారిపోయారు. తండ్రి మరణం తర్వాత తాలిబన్లు ఆధిపత్యంలోకి వచ్చారు. 1996–2001 మధ్య కాలంలో వారు తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని దారుణంగా అణిచేశారు. ఆ అణిచివేతలో ఫాజియా సోదరుడిని కాల్చి చంపారు. ఫాజియా పెళ్లి చేసుకుంటే భర్తను పదోరోజే జైల్లో వేశారు. అతను రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చి జైలులో అంటుకున్న క్షయతో మరణించారు. 2001 తర్వాత తాలిబన్ల ఆధిపత్యం తొలిగాక అఫ్ఘనిస్తాన్‌ భవిష్యత్తు కోసం ముఖ్యంగా స్త్రీల వికాసం కోసం రాజకీయాల్లోకి రావాలని ఫాజియా నిర్ణయించుకుంది. 2005లో తన సొంత ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా గెలిచింది. అంతే కాదు ఆ దేశపు తొలి డిప్యూటి స్పీకర్‌ అయ్యింది. దేశాధ్యక్ష పదవికి తొలి మహిళగా పోటీ పడదామని ప్రయత్నిస్తే లోపాయికారి వ్యవహారం వల్ల యోగ్యతా నియమాలు మార్చి ఆమెను పోటీ చేయనీకుండా చేశారు. అయినప్పటికీ ఫాజియా కూఫీ గొప్ప ప్రభావం వేయగలిగింది. గత పదిహేనేళ్లుగా ఆమె పార్లమెంట్‌ సభ్యురాలిగా కొనసాగుతోంది.

శాంతి కోసం
తాలిబన్లకు ఫాజియా అంటే సదభిప్రాయం లేదు. 2010లో ఆమె హత్యాయత్నం చేశారు. ఆగస్టు 2020లో ఆమెపై కాబూల్‌ సమీపంలో కాల్పులు జరిపారు. ఆమె కుడి చేతికి బుల్లెట్‌ తాకింది. ఆ కట్టుతోనే ఆమె తాలిబన్లతో శాంతి చర్చలకు హాజరయ్యింది. ‘తాలిబన్లు ఎక్కడికీ పోరు. ఇవాళో రేపో వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు. పార్లమెంట్‌ లో కూచుంటారు కూడా. స్త్రీల విషయంలో వారి భావధార చాలా అప్రజాస్వామికమైనది. స్త్రీల మానవహక్కులను వారు గౌరవించరు. కాని వారిని మెల్లగా ఒప్పించాలి. అప్ఘనిస్తాన్‌లో స్త్రీలు 55 శాతం ఉంటే పురుషులు 45 శాతం ఉన్నారు. ఈ దేశం గత 40 ఏళ్లుగా రకరకాల యుద్ధాలు, అంతర్యుద్ధాలు చూసి తన మగవారిని కోల్పోయింది. ఇవాళ్టికీ కోల్పోతూ ఉంది. ఇంకా ఎంతమంది చావాలి.

శాంతి కోరాల్సిందే. అయితే ఇది ఒక్కరోజులో సాధ్యం కాదన్న వాస్తవాన్ని కూడా గ్రహించాలి. నేను ఇవాళ తాలిబన్లతో చర్చలు జరపుతున్నానంటే కేవలం స్త్రీల ప్రతినిధిగానే కాదు దేశ ప్రజల ప్రతినిధిగా కూడా జరుపుతున్నాను. స్త్రీల విద్యాహక్కు, పని చేసే హక్కు, రాజకీయాలలో పాల్గొనే హక్కు ఇప్పుడిప్పుడే ఒక స్థితికి వస్తోంది. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నేనొక బిల్లు ప్రతిపాదిస్తే అది కొన్ని చాందస వర్గాల వల్ల పాస్‌ కాలేదు. కాని చాలా రాష్ట్రాలలో ఆ బిల్లు సారాంశాన్ని పరిగణిస్తున్నారు. ఇంకా జరగాల్సింది చాలా వుంది. యువత రాజకీయాలలోకి ఆకర్షితులవుతున్నారు. మేమంతా కొత్త ఆప్ఘనిస్తాన్‌ను నిర్మించుకుంటాం. ఆ నిర్మాణంలో స్త్రీల వాటా తప్పక ఉండాలన్నది నా కోరిక’ అంటారు ఫాజియా కూఫీ.

యూనిసెఫ్‌తో ఆమె బాలల హక్కుల కోసం గతంలో చేసిన కృషి, మహిళల వికాసం కోసం చేస్తున్న కృషి ఇవన్నీ ఆమెను నోబెల్‌ బహుమతి వరకూ తీసుకెళ్లాయి. 2020 శాంతి బహుమతికి పోటీ పడుతున్న 318లో ఆమె టాప్‌ 5లో నిలిచారు. ‘ఇంత వరకూ రావడం ఆఫ్ఘన్‌ మహిళలకు దొరికిన అతి పెద్ద గౌరవం’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నిజమే. ఆఫ్ఘన్‌ నుంచి నోబెల్‌ వరకూ ఒక మహిళ చేరుకోవడం సామాన్య విషయం ఏమీ కాదు.ఫలితాలు అక్టోబర్‌ 9న ప్రకటిస్తాను. ఏమో ఆఫ్ఘన్‌ నుంచి నోబెల్‌ గెలిచిన తొలి మహిళగా ఫాజియా నిలుస్తారేమో. చూద్దాం.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top