మనుషులు గీసిన గీతలు

Adania Shibli Minor Detail Novel Review In Sakshi Sahityam

నవల: మైనర్‌ డీటైల్‌

రచయిత్రి: అదనియా షిబ్లీ

అరబిక్‌ నుంచి ఆంగ్లానువాదం: ఎలిజబెత్‌ జకాట్‌

ప్రచురణ: న్యూ డైరెక్షన్స్‌; 2020

ప్రతిష్ఠాత్మక నేషనల్‌ బుక్‌ అవార్డ్స్‌ 2020కి షార్ట్‌లిస్ట్‌ అయిన ‘మైనర్‌ డీటైల్‌’ సైజులో చిన్నదయినా అతిశక్తివంతమైన నవలికగా రూపొందడంలో పాలెస్తీనా రచయిత్రి అదనియా షిబ్లీ, అభినందనీయమైన అనువాదం చేసిన ఎలిజబెత్‌ జకాట్‌ సమాన పాత్ర నిర్వహించారు. ఇజ్రాయెల్, పాలెస్తీనాల చరిత్రలోని హింసని లీలామాత్రంగానే స్పృశించినా, పెను అలజడిని కలిగించడంలో వస్తుశిల్పాల సమాన భాగస్వామ్యం ఉంది. నిర్మాణపరంగా నవల కూడా రెండు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది.  

1948లో జరిగిన ఇజ్రాయెల్‌– పాలెస్తీనా యుద్ధపరిణామం ఇజ్రాయెల్‌కి స్వాతంత్య్ర సాధనగా, పాలెస్తీనాకి ఉత్పాతంగా పరిణమించాక, ఇజ్రాయెల్‌లోని నెగెవ్‌ ఎడారి దక్షిణ ప్రాంతంలో ఈజిప్ట్‌తో ఉన్న సరిహద్దు భద్రతకోసం మిలిటరీ దళం ఏర్పాటు చేయడంతో ఆగస్ట్‌ 9, 1949న మొదటిభాగం ప్రారంభమవుతుంది. మొదటిరోజు రాత్రే దళం కమాండర్‌ని గుర్తుతెలియని విషప్పురుగేదో కుట్టడంతో సంబంధిత శరీరభాగమంతా ఇన్‌ఫెక్షన్‌కి గురవుతుంది. గాయపు సలపరింత పెరుగుతున్న కొద్దీ, కమాండర్‌ ఉన్మాదిలాగా కనిపించిన కీటకాలనన్నింటినీ చంపుతుంటాడు. మూడోరోజున దళం ఒక అరబ్బుల సమూహాన్ని గుర్తిస్తుంది. వాళ్లందరినీ కాల్చిపడేసాక, ‘‘కీటకం లాగా’’ బురఖాలో ముడుచుక్కూచుని బతికిబయటపడ్డ ఒక అరబ్‌ యువతిని పట్టుకుని క్యాంప్‌కి తీసుకొస్తారు. ఆమె వెనకే ఆమె కుక్క కూడా. మురికిగా ఉన్న ఆమెని పెట్రోల్‌తో శుద్ధి చేసి, జుట్టు కత్తిరించేస్తారు. మర్నాటి ఉదయం వరకూ దళసభ్యులు జరిపిన అత్యాచారాలకి గొంతువిప్పి ప్రతిఘటించలేని యువతి ఆక్రోశాన్ని, గొంతెత్తి అరుస్తూనే ఉన్న ఆమె కుక్క ద్వారానే వినగలం. మరుసటిరోజుకి ఆమెకిక అరవాల్సిన అవసరం రాదు– చుట్టూ అలముకుని ఉన్న పెట్రోల్‌ వాసన, కుక్క అరుపుల మధ్య ఆమెని కాల్చి చంపేయడంతో మొదటిభాగం పూర్తవుతుంది. అయిదురోజుల ఈ కథాభాగం ప్రథమపురుష భూతకాలపు కథనంలో, సూక్ష్మమైన వివరాలను సైతం తటస్థ కథనదూరంతో అందిస్తూ, పాత్రల ఆంతరంగికతలను ఏమాత్రం బహిర్గతం చేయని దృశ్యచిత్రణ. 

సుమారు అరవై ఏళ్ల తర్వాత పాలెస్తీనాలోని ఒక ఉద్యోగిని పై సంఘటన గురించిన విపులమైన వార్తాకథనాన్ని చదవడంతో రెండవభాగపు ఉత్తమపురుష వర్తమానకాలపు కథనపు హోరు ప్రారంభమవుతుంది. తన భయాల అభద్రతల్లో సాదాసీదా జీవితాన్ని గడుపుతూ, పక్క బిల్డింగ్‌ బాంబింగ్‌కి గురైతే తన కాగితాల మీద దుమ్ముని ఏమీ జరగనట్టే మామూలుగా దులుపుకునే ఈ అమ్మాయిని ఆ వార్త ఆకర్షించడానికి కారణం– ఆ దారుణం జరిగిన సరిగ్గా పాతికేళ్లకి అదే రోజున తను పుట్టడం అనే చిన్న వివరం. ఈ సంఘటన వెనకాల ఉన్న సత్యాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది కానీ, ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలెస్తీనా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఆంక్షలుంటాయి. కొలీగ్‌ ఐడీ కార్డ్, అద్దెకి కార్‌ తీసుకుని, భయాలని అధిగమిస్తూ మాప్స్‌ పెట్టుకుని (1948కి ముందువీ, తరువాతవీ) ఆమె చేసిన ప్రయాణం మొత్తం నిష్ఫలమవుతుంది. మ్యూజియంలలో చూస్తున్న వస్తువులు గతానికి కేవలం మౌనసాక్ష్యాలు మాత్రమే. మధ్యలో పెట్రోల్‌ బంక్‌లో పొరపాటున కొంత పెట్రోల్‌ మీద ఒలకబోసుకుంటుంది. దారీతెన్నూ తెలియకుండా ఒంటిమీద పెట్రోల్‌ వాసనతో కార్లో తిరుగుతుండగా సుమారు డెబ్భై యేళ్లున్న ముసలామె ఒంటరిగా కనిపిస్తే, ఆగి లిఫ్ట్‌ ఇవ్వడం ఆమె కథకి మలుపు. ముసలామె దిగిపోయాక, రేప్‌ బాధితురాలు ఇప్పటికీ బతికుంటే ఇంతే వయసుండేది కదా అని వచ్చిన ఆలోచన ఆమె కథని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో మొదటిసారిగా ఈ ప్రయాణంలో కొన్న చూయింగ్‌ గమ్, ఆమె చేసిన ఆఖరి తప్పవుతుంది.

గతాలు వర్తమానాన్ని నిర్దేశిస్తాయి; వర్తమానంలోని అనుభవాలు గతాన్ని ప్రశ్నిస్తుంటాయి. కాలాల్లోని భేదాల భౌతికతని కథనంలోని దృష్టికోణపు మార్పు మనం ఉలిక్కిపడే అనుభవాన్ని కలిగించగా, ఆ కాలాలలోని సామ్యతని నవలలో పదేపదే ఉపయోగించే పెట్రోల్‌ వాసన, కుక్క అరుపులలాంటి ‘మోటిఫ్స్‌’ ప్రతీకాత్మకంగా చూపిస్తాయి. హింస రాజ్యమేలే చోట ఏమార్పూ ఆశించలేమన్న సారాంశాన్ని నవల ప్రారంభవాక్యమే తేల్చిచెబుతుంది: Nothing moved except the mirage. భ్రాంతి తప్ప మారేది మరోటి ఉండదు!
-ఎ.వి.రమణమూర్తి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top